మెట్రో, ఆర్టీసీ అధికారులకు కేటీఆర్‌ విజ్ఞప్తి.. ఏంటంటే ?

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ భయంకరమైన వైరస్ తెలంగాణకి కూడా సోకింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 8మంది కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురికి కరోనా నెగటివ్ అని తేలినట్టు సమాచారమ్. మరోవైపు, కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తయింది. ముందుగా ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌ మెట్రో రైలు, ఆర్టీసీ అధికారులకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా బెంగళూరులో ఆర్టీసీ బస్సులను అధికారులు ప్రత్యేకంగా శుభ్రంచేస్తున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ మెట్రోరైలులో చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ కోరారు. అదేవిధంగా ఆర్టీసీకి తగు సూచనలు చేయాలంటూ రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మంత్రి ట్విట్టర్‌ ద్వారా కోరారు. కరోనా వైరస్ కి మందు లేదు. పరిశుభ్రతతో వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తపడొచ్చు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ మెట్రో, ఆర్టీసీ అధికారులకి పై సూచనలు చేసినట్టు తెలుస్తోంది.