ఉభయ సభలని కుదిపేస్తున్న ఢిల్లీ అల్లర్లు

ఢిల్లీ హింసాకాండపై ప్రభుత్వాన్ని కడిగేయాలని ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాయి. ఇందుకోసం ఈరోజు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం కాగానే ఢిల్లీ అల్ల‌ర్ల అంశంపై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు పట్టుపట్టాయి. అయితే, ఈ నెల 11న ఢిల్లీ అల్లర్లపై లోక్ సభలో, 12వ తేదిన రాజ్యసభలో చర్చిద్దామని పార్ల‌మెంట‌రీ శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి అన్నారు. దానికి సంతృప్తి చెందని విపక్షాలు ఆందోళనకి దిగడంతో లోక్ సభ మధ్యాహ్నం 12గంటలకి, రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

మరోవైపు,  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలకు చెందిన ఎంపిలు ధర్నా చేపట్టారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండపై సభలో చర్చించాలని, అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని వారు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు.