జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ..ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిందంటూ లోకేష్ ఫైర్

తెలుగుదేశం నేత నారాలోకేష్..మరోసారి వైసీపీ సర్కార్ ఫై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయిందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన వీరాంజనేయులు అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందన్నారు.

ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరమని.. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాడి ఉద్యోగాలు సాధిద్దామన్నారు నారా లోకేష్.

.@ysjagan పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.(1/3) pic.twitter.com/S74LAsne7d— Lokesh Nara (@naralokesh) September 13, 2021

ఎర్రకోట గ్రామానికి చెందిన ఉప్పర ఈశ్వరమ్మ, వీరభద్ర దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో వీరాంజనేయులు(25) ఒకరు. చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించడంతో ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యాడు. ఆరేళ్ల ట్రిపుల్‌ ఐటీలోను మంచి మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ గ్రూపు-2కు సన్నద్ధమయ్యాడు. ఉద్యోగం రాలేదు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూశాడు. నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనోవేదనకు గురయ్యేవాడు. ఎంత చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు వాపోయారు.