పోటాపోటీగా సమావేశాలు

telangana samaikyandraరాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ అంశంపై కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇరుప్రాంతాల నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గన్ పార్క్ వద్ద తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన మౌనదీక్ష ముగిసింది. అనంతరం టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ… జైపూర్ లో జరిగే చింతన్ బైఠక్ లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోనున్న సమయంలో అడ్డుపడొద్దని సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు అడ్డుకున్నా తెలంగాణ తథ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

మరోవైపు రాష్ట్రాన్ని విడదీయొద్దని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమైక్యవాద సమావేశం ముగిసింది. ఈ సమాశానికి హాజరైన నేతల్లో కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదని హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి డీఎల్ పిలుపునిచ్చారు. సమైక్యవాదాన్ని కేంద్రానికి వినిపించాలని కొంత మంది ప్రతిపాదించగా, రాజీనామాలు చేయాలని ఒకరిద్దరు నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. రాజీనామాలతో బెదిరించడం సరికాదని, దీనివల్ల మనకే నష్టం జరుగుతుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం విధించుకున్న నెలరోజుల గడువు దగ్గరపడుతున్న కొలది రాష్ర్ట రాజకీయాల్లో మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.