ముప్ఫయ్ లక్షల ఎకరాల్లో సూక్ష్యసేద్యం లక్ష్యం – చంద్రబాబు

CHANDABABU_Nellour సూక్ష్మ సేద్యం ద్వారా రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సీఎంఓలో 23 మైక్రో ఇరిగేషన్ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ సేద్యంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. ఒక్క ఎకరం కూడా ఎండకూడదన్న తన సంకల్పానికి సూక్ష్మ సేద్య పరికరాల ఉత్పత్తి సంస్థలు సహకరించాలని కోరారు.

ముప్ఫయ్ లక్షల ఎకరాల సాగుకోసం 15 వేల స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ కావాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. సూక్ష్మ సేద్య పరికరాలతో రెండెకరాలకు తడులు వేయాలంటే రెండువేల ఖర్చవుతుందన్నారు. పంట ఎండిపోయాక రక్షణ చర్యలు తీసుకోవటం కాదని, పంట చేలు ఎండిపోకుండా చూడటం ప్రధానమని ముఖ్యమంత్రి చెప్పారు.

పరికరాల ఉత్పత్తి కంపెనీలు కేవలం లాభాపేక్షతో కాకుండా రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న తన ఆశయానికి అండగా నిలవాలని కోరారు. ఉచితంగా పరికరాలు ఇవ్వాలని తాను అడగటం లేదని, డబ్బు చెల్లిస్తామని, అయితే సామాజిక బాధ్యతను కూడా గుర్తెరిగి నడుచుకోవాలని పిలుపునిచ్చారు. నాణ్యమైనవి, మన్నికగల సూక్ష్మ, తుంపర సేద్య పరికరాలను సరఫరా చేయాలని కోరారు.

డ్వాక్రా మహిళలకు వీటిని ఉపయోగించే పద్ధతుల్లో డ్వాక్రా మహిళలకు శిక్షణనివ్వాలని సూచించారు. తాము పంటసంజీవని కార్యక్రమం కింద రాష్ట్రంలో పదిలక్షలు సేద్యపుకుంటలను ఈ వర్షాకాలంలోగా తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం రెయిన్‌గన్స్ ను రాయితీతో సరఫరా చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.3389.86 కోట్ల వ్యయంతో సూక్ష్మ సేద్య సంస్థ అమలు చేస్తున్న పథకం ద్వారా 6.93 లక్షల ఎకరాలను 6.25 లక్షల రైతులు సాగు చేస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 11.25 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యానికి అనువైనదిగా గుర్తించినట్లు తెలిపారు.

కరవు పీడిత జిల్లాలుగా గుర్తించిన అనంతపురం, చిత్తూరు, కర్నూలులతో పాటు కరవు ఏర్పడ్డ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బిందు, తుంపర సేద్యానికి అనువుగా ఉండే ప్రాంతాలలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు. గ్రామాలలో 150 ఎకరాలను ఒక యూనిట్‌గా తీసుకుని ఈ తరహా సేద్యానికి ఉద్యమస్ఫూర్తితో ప్రోత్సహించాల్సి ఉందన్నారు.

కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కరవు పీడిత జిల్లాలలో వర్షాధార పంటలు పక్వ దిశలో ఉంటే కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ విజయకుమార్, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.