వైసీపీ తరపున పోటీకి సిద్దం

తెలుగు దేశం పార్టీలో ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు కీలక నేతగా వ్యవహరించిన సినీ నటుడు మోహన్‌బాబు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డికి ఆప్త మిత్రుడిగా పేరుబడ్డ మోహన్‌బాబు ఆయన కొడుకు వైఎస్‌ జగన్‌ పార్టీలో జాయిన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన మోహన్‌బాబు అన్ని అనుకున్నట్లుగా జరిగితే వైకాపా తరపున పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. చిత్తూరు జిల్లా నుండి మోహన్‌బాబు సీటు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీకాళహస్తి లేదా వెంకటగిరి నియోజక వర్గాల్లో మోహన్‌బాబుకు మంచి పట్టు ఉంది. ఆ కారణంగానే మోహన్‌బాబు అక్కడ నుండి పోటీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్‌ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ఖాయం అని, 2019 ఎన్నికల్లో జగన్‌ జెండా రెపరెపలాడటం ఖాయం అనే నమ్మకంతో మోహన్‌బాబు ఉన్నాడు. మోహన్‌బాబు ఎంట్రీ వల్ల ఖచ్చితంగా వైకాపాకు బలం చేకూరినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌బాబు కోరినట్లుగా జగన్‌ సీట్లు కేటాయించే అవకాశం ఉందని, భవిష్యత్తులు వైకాపాలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.