అధ్యక్షుడితో విభేదాల్లేవ్‌ : మోత్కుపల్లి

mothukupalliతెలంగాణా అంటూనే తెలుగుదేశం పార్టీలో అందరికీ ఠకీమని గుర్తొచ్చే నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తుంగతుర్తి శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు. అయితే గతకొంత కాలంగా ఎందుకనో మోత్కుపల్లి సైలెంట్‌ అయిపోవడం, పెద్దగా పార్టీ పరంగా కనిపించకపోవడం, వినిపించకఫోవడం ఇంటా, బయటా చర్చనీయాంశమైపోయింది. ఓ దశలో మోత్కుపల్లికి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు విభేదాలొచ్చాయన్న టాక్‌ కూడా వినిపించింది. అయితే గురువారం ఉదయం చంద్రబాబును మోత్కుపల్లి కలుసుకున్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలోకి బాబు పాదయాత్ర ప్రవేశించిన తరుణంలో, మోత్కుపల్లి అధ్యక్షుడిని కలుసుకోవడంతో బాబు పాదయాత్రలో మోత్కుపల్లి పాల్గొనే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత తొలగినట్లయింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఆయన అధినేతను కలిశారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ… తనకు ఎలాంటి విభేదాలు చంద్రబాబుతో లేవన్నారు. తప్పకుండా తాను వస్తున్నా మీకోసం అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు.

కాగా ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన బాబుకు వేలాదిగా కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. నల్గొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్ వద్ద బాబు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. సిపిఐ, యుటిఎఫ్, ఎమ్మార్పీఎస్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు బాబుకు ఘన స్వాగతం పలికాయి. బాబును కలిసిన వారిలో మోత్కుపల్లితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరీలు కూడా ఉన్నారు. తొమ్మిది రోజుల పాటు మూడు నియోజకవర్గాలలో చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాలో సాగింది.