ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ

Rahul Gandhi to be Congress Vice Presidentకాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి అందరూ ఊహించినట్టుగానే పార్టీలో ప్రముఖ పదవి దక్కింది. గాంధీ కుటుంబంలో యువరాజు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుత్రరత్నం రాహుల్ గాంధీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని రాహుల్ పేరును ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించగా సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. జనార్దన్ ద్వివేది అధికారికంగా రాహుల్ నియమాకాన్ని వెల్లడించారు. పార్టీలో రెండో స్థానానికి రాహుల్ ను లక్షలాది మంది కార్యకర్తల ఆకాంక్ష మేరకు ఎంపిక చేశామని తెలిపారు. యువనేత నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2014లో రాహుల్ సారథ్యంలో ఎన్నికలకు వెళతామని ద్వివేది అన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడంతో సంబరాల్లో మునిగితేలుతున్నారు. జైపూర్ లోని చింతన్ బైఠక్ శిబిరం వద్ద బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడి పదవి కట్టబెట్టినందుకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి దేశాన్ని మార్చుదామన్నారు. పార్టీ సీనియర్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు.