శంకరన్నను ఈడ్చుకెళ్లడం దారుణం..!

shankar-rao-arrestగ్రీన్ ఫీల్డ్ భూముల కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే తెలుస్తుంది. ఒత్తిడివల్ల ఆయన హైబీపీకి గురయ్యారని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు.

శంకర్రావును అరెస్ట్ చేసిన తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు, పలు కులసంఘాల నేతలు కూడా మండిపడ్డారు. శంకర్రావును అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఓ ప్రజాప్రతినిధిని అలా ఈడ్చుకెళ్లడం దారుణమని ఆయన అన్నారు. పోలీసులు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని దానం ప్రశ్నించారు. శంకర్రావు అరెస్ట్ చేసిన విధానం ఖండించినవారిలో జానారెడ్డి, ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహా, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

మరోవైపు శంకర్రావు వ్యవహారంలో అతిగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాలమహానాడు డిమాండ్ చేసింది. ఈ విషయమై మాల మహానాడు నేతలు ఈరోజు (శుక్రవారం) సచివాలయం ముట్టడికి యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.

కాగా, శంకర్రావు వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మల్కాజిగిరి డీసీపీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే శంకర్రావు అరెస్ట్ విషయంలో క్రింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.