తూచ్‌… ఆరు కాదు ఏప్రిల్‌ నుండి తొమ్మిది

LPG SLసబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కేంద్రం 9కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2013 ఏప్రిల్‌ నుంచి ఈ పెంపు అమలుల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్లను ఆరుకు పరిమితం చేస్తూ గత ఏడాది సెప్టెంబర్ లో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మధ్య తరగతి ప్రజల్లో ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. విపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వ పెద్దలు వచ్చే సాధారణ ఎన్నికల్లో సిలిండర్లను 9కి పెంచకపోతే పార్టీ దెబ్బతింటుందని గ్రహించిన నేపథ్యంలోనే సబ్సిడీ సిలిండర్లను 9కి పెంచాలని కేంద్రం రెండు నెలలుగా కసరత్తు చేస్తోంది. సిలిండర్లను 9కి పెంచాలని గుజరాత్‌ ఎన్నికల సమయంలోనే ప్రయత్నించింది. అయితే అప్పట్లో ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరం రావడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు ఈశాన్య భారతంలో ఎన్నికలు జరగనున్న కారణంగా సబ్సిడీ సిలిండర్ల పెంపు విషయాన్ని ఎన్నికల సంఘానికి వివరిస్తూ ప్రభుత్వం లేఖ రాసింది.