”పవన్ కల్యాణ్ కు అర్థమయ్యేలా చెప్పాలి”

sujana

కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావని.. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగైతే ఉద్యోగాలు వస్తాయని అన్నారు కేంద్రమంత్రి సుజనాచౌదరి.

కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన .. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ప్యాకేజీ ద్వారా ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందని.. ప్యాకేజీకి కేంద్రం త్వరలోనే చట్టబద్ధత కల్పించనున్నట్లు వెల్లడించారు.

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోదా పై పట్టుబడుతున్నారు కదా ? అనే ప్రశ్నకు సమాధనం ఇచ్చిన సుజనా.. పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కలిసి, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో రాష్ట్రానికి కలిగే లబ్దిని గురించి వివరిస్తామని, హోదా అన్న పేరు మాత్రమే లేదని, అంతకుమించిన నిధులు ప్యాకేజీ రూపంలో వచ్చాయని ఆయనకు అర్ధమయ్యేలా చెబితే అర్ధం చేసుకుంటారని చెప్పారు.

‘స్పెషల్ స్టాటస్ బెనిఫిట్స్ ఇన్ ప్యాకేజ్’గా చూడాలని వివరించిన ఆయన.. ఓ జాతీయ ప్రాజెక్టుకు 100 శాతం నిధులిస్తామని చెప్పడం స్వతంత్ర భారత చరిత్రలో ఒక్క పోలవరం విషయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు.