ఇచిత్రం : కేసీఆర్ ని పొగిడిన మోత్కుపల్లి

mothukupally
ఎప్పుడూ తిట్టే నోరే సడెన్ పొగిడితే ఎలాగుంటుంది ? ఇచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నేత మోత్కపల్లి యవ్వారం కూడా దాదాపు ఇలాగే ఉంది. మోత్కుపల్లి నోరు తెరిస్తే చాలు.. కేసీఆర్ పై తిట్ల దండకాన్ని మొదలెట్టేవారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా.. ఒకట్రెండు సందర్భాల్లో కేసీఆర్ సంకల్పాన్ని మెచ్చుకొన్నాడు. కానీ, మోత్కుపల్లి మాత్రం కేసీఆర్ ఏ సందర్భంలోనైనా కార్నర్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు.

అయితే, తొలిసారి మోత్కుపల్లి కేసీఆర్ ని పొగడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల లిస్టులో భువనగిరి కేంద్రంగా యాదద్రి జిల్లాని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, మోత్కుపల్లి యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లా విష‌యంలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను గ‌మ‌నించి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. కేసీఆర్ ని పొగడ్తలతో ముంచేత్తారు.

ఈ పొగడ్తల వెనక యాదాద్రి జిల్లా ఏర్పాటు కానుండటం ఒక్కటే కారణం కాదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు గవర్నరి గిరి దక్కుతుందని భావించిన మోత్కుపల్లి.. ఇప్పుడిప్పుడే ఆ ఆశని కూడా వదులుకున్నాడట. ఇక, టీడీపీలో కొనసాగడం కూడా అనవసరమని భావించిన మోత్కుపల్లి.. టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు సమాచారమ్. అందులో భాగంగానే.. కేసీఆర్ పై పొగడ్తల వర్షమని చెప్పుకొంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవ్వరు ఉండరనే సామెత ఉండనే ఉండే.. భవిష్యత్ లో మోత్కుపల్లి కారెక్కెనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో !