“రామరాజ్యం లాంటి మామరాజ్యం వస్తుంది”

Jr-NTR-Chandrababu-Naiduతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ‘ వస్తున్నా..మీకోసం ‘ పాదయాత్ర కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా మెరుగైందని హీరో జూనియర్ ఎన్.టి.ఆర్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్.ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేసారు. తాను వరుస వెంబడి షూటింగుల కారణంగా పాదయాత్రలో వున్న చంద్రబాబును కలవలేకపోయానని, త్వరలో వీలు చేసుకుని వెళ్లి ఆయనను కలుస్తానని జూనియర్ చెప్పారు. బహుశా చంద్రబాబు కృష్ణా జిల్లాలో వుండగా జూనియర్ ఆయనను కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో విశేష సంఖ్యలో అభిమానులున్న జూనియర్ కనుక ఆ జిల్లాలో చంద్రబాబు యాత్రలో కలిసి పర్యటిస్తే జిల్లాలో తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.