తెలుగు తమ్ముళ్ళ తెలంగాణం

TDP faces issues due to Telanganaతెలుగుదేశం పార్టీ తెలంగాణా ఏర్పాటుకే కట్టుబడి ఉన్నట్టు లేఖనివ్వటం వల్ల పార్టీలో చోటుచేసుకుంటున్న ఫిరాయింపుల వల్ల టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ అగ్రనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు వర్గాల మధ్య ఉన్న విభేదాలు అంత తీవ్రమైనవేమీ కాదన్నారు. అవి త్వరలోనే సమసిపోతాయని చెప్పారు. కాంగ్రెస్‌తో జగన్‌కు అంతర్గత సంబంధాలు ఉన్నాయని కేంద్రమంత్రి వయలార్‌ రవి వ్యాఖ్యలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు “వస్తున్నా మీకోసం” పాదయాత్ర తెలంగాణా జిల్లాల నుండి సీమాంధ్ర ప్రవేశిస్తుండడంతో ఇప్పటికే కృష్ణా జిల్లా కాంగ్రెస్ నేతల నిరసనలు తేదేపా నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్ర విభజనపై పార్టీ అభిప్రాయానికే కట్టుబడి ఉంటామని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ స్పష్టం చేశారు. ఆయన ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో చంద్రబాబు పాదయాత్రతో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. మీడియాలో వార్తల కోసం ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాకులాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. బాబు పాదయాత్రను అడ్డుకుంటామని లగడపాటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించారు.