31 జిల్లాల తెలంగాణకి కేసీఆర్ కేబినేట్ ఆమోదం

31 Districts Telangana
31 జిల్లాల తెలంగాణకి కేసీఆర్ కేబినేట్ ఆమోదముద్రవేసింది. దీంతో.. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక్క అడుగు ముందు నిలిచినట్టయ్యింది. ఇక, తుది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఒక్కటే మిగిలింది. ప్రస్తుతమున్న 10 జిల్లాలకు అదనంగా 21 కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుమతించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరనుంది.

1974 జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది నిర్ణయించింది. దీని ద్వారా ముసాయిదా ప్రకటన (నోటిఫికేషన్‌)లో పేర్కొన్న ప్రతిపాదిత జిల్లాల సంఖ్యను పెంచటానికి, తగ్గించడానికి వీలు కలగనుంది. నూతన జిల్లాల కోసం 2019 పోస్టుల మంజూరు చేసింది.

కేసీఆర్ కేబినేట్ తీసుకొన్న మరికొన్ని నిర్ణయాలు :
* కొత్త జిల్లాలకు 21 కలెక్టర్లు, 21 మంది ఎస్పీలు, 21 మంది జాయింట్‌ కలెక్టర్లు, 21 మంది డీఆర్‌వోలు సహా 2019 పోస్టుల సృష్టికి ఆమోదం
* నాలాలపై నిర్మించిన, ఇతర అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించిన అంశాలపై పురపాలక భవనాల ట్రైబ్యునల్‌ ఏర్పాటు.
* జీహెచ్‌ఎంసీ సహా పురపాలక సంఘాలన్నింటినీ ఒకే సేవా నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేలా ఆర్డినెన్స్‌ జారీ.
* నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, రామగుండంలలో కొత్త పోలీసు కమిషనరేట్లు
* 23 కొత్త పోలీసు సబ్‌డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు.
* ప్రపంచస్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రి నెలకొల్పటం కోసం హెటిరో సంస్థకు 15 ఎకరాల భూమి కేటాయింపు
* భగీరథ పథకానికి తీసుకొన్న అటవీప్రాంతానికి ప్రత్యామ్నాయంగా 463.70 ఎకరాల భూమి కేటాయింపు
* ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయింపును 2014 జులై ఒకటి నుంచి అక్టోబరు 15 వరకు ఉన్న సమయానికీ వర్తింప చేసేందుకు అనుమతి.
* విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 321 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం.
* ఎమ్మార్వో పేరు తహసిల్దారుగా మార్పు
* యాదగిరి గుట్ట, పెద్దశంకరంపేటల్లో అగ్నిమాపక కేంద్రాలు
* జీహెచ్‌ఎంపీ పరిధిలో నర్మ్‌ కింద నిర్మాణంలో ఉన్న 24,648 ఇళ్ల నిర్మాణం కోసం హడ్కో రుణం.
* వేములవాడ ఆలయఅభివృద్ధి అథారిటీ పరిధిలోకి ఆరు గ్రామాలు. తిప్పాపూర్‌, సంకెపల్లి, నాంపల్లి, చంద్రగరి, మరుపాక, శాత్రాజ్‌పల్లి చేర్పు.