తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జోరు మొదలు కాబోతుంది. ఇటీవలే శాసన , గ్రామపంచాయితీ, ఎంపీ ఎన్నికలు జరుగగా..తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మే 6న తొలి దశ, మే 10న రెండో దశ, మే 14న మూడో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈసారి ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ వేసే సౌలభ్యాన్ని కూడా కల్పించారు. ఐతే అప్లికేషన్ పూర్తయ్యాక ప్రింట్ అవుట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఎన్నికల నిర్వహణకు 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. జడ్పీటీసీ అభ్యర్థులు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్షా 50వేలు గరిష్ఠ వ్యయ పరిమితి విధిస్తున్నట్లు ఆయన వివరించారు. సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని.. అయితే, ఫలితాల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.