రాబోయే 5వారాల్లో జలసంరక్షణ చర్యలు వేగవంతం చేయాలి

CBN గ్రామీణాభివృద్ధి శాఖకు, పంచాయితీరాజ్ కు, జాతీయ స్థాయిలో అవార్డులు రావడం అభినందనీయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నీరు-చెట్టు, పంట సంజీవని అమలుపై మంగళవారం జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా 10వేలమంది అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖకు సంబంధించిన మొత్తం 5 అవార్డులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయని, ఎఫ్ డీఐ లో గుజరాత్ తరువాత మన రాష్ట్రమే ముందంజలో ఉందని ఇటీవల ఎఫ్ డీఐ నివేదిక వెల్లడించిన విషయం ప్రస్తావించారు. ప్రతిరంగంలో మన రాష్ట్రం ముందుండాలని ఆకాంక్షించారు. అన్నిశాఖల అధికారులు దీనిని స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో పనిచేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జూన్ నాటికి భూగర్భ జలాలు 8మీటర్ల లోతున, డిసెంబర్ నాటికి 3 మీటర్ల లోతున ఉండేలా పంటసంజీవని, నీరు-చెట్టు, ఎన్టీఆర్ జలసిరి, తదితర జలసంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. నిధుల సమీకరణ బాధ్యత కలెక్టర్లదేనంటూ, అంతా పారదర్శకంగా జరగాలని, సాంకేతికత ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాలని దిశానిర్ధేశం చేశారు. ఈవేసవిలో ఇంకా 5 వారాల వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఉపాధిహామీ పనులు జరిగేలా చూడాలన్నారు. భూగర్భ జలాలను పెంచడానికి ‘ఈనాడు’ చేపట్టిన ‘సుజలాం- సుఫలాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. మిగిలిన పత్రికలు, ఛానళ్లు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి పంట సంజీవని, నీరు-చెట్టు తదితర కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు. ‘ఇంటింటికీ ఇంకుడుగుంత’ నినాదంతో అధికారులు ప్రజలందరినీ చైతన్యపరచాలన్నారు. రాష్ట్రంలో కోటి 45 లక్షల ఇళ్లలో ఇంకుడుగుంతల తవ్వకం వల్ల సత్ఫలితాలను సాధించవచ్చన్నారు. చెరువుల పూడిక తీత, కట్టల పటిష్టం, జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, ఉద్యానవన, జలవనరుల శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నరేగా, నీరు-చెట్టు పనులు అన్ని ప్రాంతాలలో ముమ్మరంగా జరిగేలా వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది చురుకుగా వ్యవహరించాలన్నారు.

ఒక గ్రామంలో 100 పంటకుంటల తవ్వకం పెద్ద కష్టం ఏమీకాదంటూ,మొత్తం 10 వేల గ్రామాలలో 10 లక్షల పంటకుంటల తవ్వకం పూర్తిచేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు మనవంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలని, సమయం వృధా చేసుకుంటే ఇబ్బందులు పడతామని చెప్పారు. అందరి సహకారంతో రాష్ట్రంలో అనేక పనులు రికార్డు వ్యవధిలో పూర్తి చేస్తున్న విషయం గుర్తుచేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని 5నెలల్లో పూర్తిచేశాం, తాత్కాలిక సచివాలయాన్ని 100 రోజుల్లో నిర్మించామంటూ, అభివృద్ది పనులకు ప్రజలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకొస్తున్నారని ప్రశంసించారు. అధికార యంత్రాంగం చిత్తశుధ్ధితో వ్యవహరించాలని, చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మానవ వనరులున్నాయి, నిధులున్నాయి, అవసరాలున్నాయి, అవకాశాలున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడమే మనముందున్న తక్షణ కర్తవ్యంగా ఉద్భోధించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు.

పంట సంజీవనిలో కర్నూలు,కడప, చిత్తూరు జిల్లాలలో మంచి పురోగతి వుంది, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు వెనుకబడ్డాయంటూ, అన్ని జిల్లాలలో చురుకుగా పనులు జరగాలన్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చిత్తూరు,అనంతపూర్,కర్నూలు,కడప,ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ముందంజలో ఉందని చెప్పారు. మిగిలిన జిల్లాలలో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలన్నారు. గత ఏడాది మే నెలలో రూ.670 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ1000 కోట్లు ఖర్చు చేయాలని సూచించారు. ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కింద చిత్తూరు జిల్లాలో 200 బోర్లు వేస్తే 92% విజయవంతం అయ్యాయన్నారు. కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాలలో కూడా దీనిని వెంటనే ప్రారంభించాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి-1 లో లక్ష ఎకరాలకు ప్రయోజనం కల్గుతుందని, ఎన్టీఆర్ జలసిరి-2 లో లక్ష దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొనగా, జలసంరక్షణకు చేస్తున్న అన్ని నిర్మాణాలను జియో ట్యాగింగ్ చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యకార్యదర్శులు రామాంజనేయులు, శశిభూషణ్, కలెక్టర్లు మాట్లాడారు. తమ జిల్లాలలో చేపట్టిన నవ్యవిధానాలను వివరించారు.