తెలంగాణ మంత్రిమండలి సమావేశం

ts-cabinetచాలా రోజుల తరువాత తెలంగాణ కేబినెట భేటి కాబోతోంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. జులై 10న కేబినెట్ భేటి జరగాల్సివుంది. కానీ కేసీఆర్ జ్వరంతో బాధపడుతుండటంతో దాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు. తాజాగా మళ్లీ కేబినెట్ సమావేశం బుధవారం జరగనుంది. ఇప్పటిదాకా తీసుకున్న నిర్నయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే గ్రామజ్యోతి కార్యక్రమం నడుస్తోన్న తీరు…దానిపై ప్రజల అభిప్రాయం కూడా కేబినెట్లో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించినందుకు కేబినెట్ సహచరులను కేసీఆర్ అభినందించనున్నారు. టీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగింది. జులై నుంచి 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. కానీ ఆ స్థాయిలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరిన్ని ఉద్యోగ నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉద్యోగ నియామకాలకు పెంచిన వయోపరిమితి నిర్ణయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. అన్నింటికంటే మించి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేబినెట్ చ‌ర్చించ‌నుంది. ఈ విషయంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ శ‌ర్మ‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. 40వేల మందిని రెగ్యులరైజ్ చేయాలని నివేదించింది. దీనిపైనా నిర్ణయం తీసుకోనుంది కేబినెట్..కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జులై చివరి నుంచే ఉంటుందని పెరెడ్ గ్రౌండ్ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు కాబట్టి దానిపై కూడా కచ్చితంగా నిర్ణయం ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశం మరోసారి వివాదాస్పదమై తెరమీదకు వచ్చింది. గతంలో నిర్దేశించిన స్థానంలో కాకుండా వేరే ప్రదేశంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయాలని కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ వ్యాప్కోస్ ను టిఎస్ స‌ర్కారు కోరింది. దీంతో కాళేశ్వ‌రం మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ను వ్యాప్కోస్ ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. దీనిపై కేబినెట్ ఆమోద‌ముద్ర వేయ‌నుంది. మరోవైపు సచివాలయ మార్పు పైనా సమావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇప్పటికే సచివాలయాన్నిఎర్రగడ్డ లోని చెస్ట్ ఆసుప్రతికి తరలించాలని సర్కారు భావించిది. దానిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత సచివాలయాన్ని సికిందరాబాద్ లోని బైసన్ పోల్ మైదానంలో నిర్మించాలని తలంచినా..రక్షణశాఖ అనుమతి రాలేదు. దీంతో తాజాగా సచివాలయాన్ని హైటెక్ సిటీ పరిసరాల్లోకి తరలించాలన్న ఉద్దేశంలో కేసీఆర్ స‌ర్కారు ఉంది. దానిపై కేబినెట్ లో సమీక్ష జరిపే అవకాశం ఉంది.

ముఖ్యంగా మంత్రుల పనితీరు పైనా కేబినెట్ లో కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పలువురు మంత్రుల పనితీరుకు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నారాయ‌న‌. ఆ నివేదికల ఆధారంగా సమావేశంలో సమీక్ష జరిపే అవకాశం ఉంది. పనితీరు సరిగాలేని మంత్రులను గ‌ట్టిగా హెచ్చ‌రించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది.