ప్రాంతీయ పార్టీలతో పొత్తులు : వాయలార్‌

vyalarraviకాంగ్రెస్‌ పార్టీకి ప్రాంతీయ పార్టీలతో పొత్తులుంటాయట… ఈ కీలకమైన వ్యాఖ్యలతో మరోసారి ఆసక్తి పెంచేలా చేసింది ఎవరో కాదు సాక్షాత్తూ ప్రస్థుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కీలకమైన తెలంగాణా అంశంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాయలార్‌ రవి. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కొనసాగుతాయని చింతిన్‌ శిబిర్‌లో పాల్గొనడానికి జైపూర్ వచ్చిన ఆయన చెప్పారు. రాష్ట్ర నాయకత్వమే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తుందన్నారు. సోనియా ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని, తెలంగాణపై ఇప్పటివరకూ చర్చ జరగలేదన్నారు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు సమయం ఖరారు కాలేదని వాయలార్ తెలిపారు. జగన్ ఎప్పుడో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారని, పరిస్థితులను బట్టి పొత్తులపై ఆలోచిస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన విధానం ఉంటుందన్నారు. తమకు భారతీయ జనతా పార్టీనే ఉత్తర భారతంలో మొదటి ప్రత్యర్థి అని వాయలార్ రవి అన్నారు. అలాగే ‘చింతన్ శిబిరం’లో చిన్న రాష్ట్రాలపై చర్చ జరగలేదని వాయలార్ రవి తెలిపారు. తెలంగాణపై చర్చించినట్లు కూడా సమాచారం లేదని ఆయన అన్నారు. రాజకీయ పొత్తుల గురించే చర్చ జరుగుతుందని వాయలార్ పేర్కొన్నారు.