నాస్కామ్ ఆధ్వర్యంలో విశాఖలో ఐటీ స్టార్టప్స్ వేర్‌హౌస్

Vizag-ITఒకప్పుడు కాల్ సెంటర్లుగా మొదలై, వర్క్ స్టేషన్లుగా వుండిపోయిన మన కంపెనీలు రానున్న కాలంలో సొంతంగా సాంకేతిక ఉత్పత్తుల్ని తయారుచేసుకునే స్థాయికి ఎదగాలని బలంగా కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నాస్కామ్ ఆరంభించిన తొలినాళ్లలో స్వయంగా తాను దాని ప్రమోషన్ కోసం ప్రయత్నించిన వైనాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఏపీ నుంచి వెళ్లి ఢిల్లీ స్థాయిలో కార్యదర్శులుగా ఎదిగి ఐటీ, టెలికమ్యూనికేషన్స్ రంగానికి విశేష సేవలందిస్తున్న వ్యక్తులు తమతో కలిసి పనిచేయడం తమకు సంతోషదాయకంగా వున్నదన్నారు.

విశాఖ సన్‌రైజ్ టవర్స్‌లో మరో రెండు మాసాల్లో నాస్కామ్ 10కే స్టార్టప్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సమావేశంలో పాల్గొన్న ఐటీ అధికారులు తెలియజేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి శ్రీ పల్లెరఘునాథరెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు శ్రీ రెంటాల చంద్రశేఖర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. గూగుల్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్, మెక్రోసాఫ్ట్ వెంచర్స్, కోటక్, అమెజాన్ వెబ్ సర్విసెస్, ఐబీఎం వంటి అంతర్జాతీయ కంపెనీలు 10కే స్టార్టప్ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి..

విశాఖలో 8500 చదరపు అడుగుల వైశాల్యంతో ఏర్పాటుచేస్తున్న స్టార్టప్స్ వేర్ హౌస్ ద్వారా 85 నుంచి 100 సీట్లకు అవకాశం వుంటుందని, తద్వారా 30కి పైగా అంకుర కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఏర్పాడుతుందని నాస్కామ్ అధ్యక్షుడు తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని ఏపీని నాలేడ్జ్ ఎకనామీ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీ పల్లె రఘునాధరెడ్డి చెప్పారు. సమావేశంలో ఐటీ అడ్వయిజర్స్ శ్రీ జే సత్యనారాయణ, శ్రీ జేఎస్ చౌదరి, ఐటీ కార్యదర్శి శ్రీ ఫణికిశోర్, ఇంకా, శ్రీ నిఖిల్ అగర్వాల్, నీనా పహుజా, ముఖ్యమంత్రి కార్యదర్శులు శ్రీ సాయి ప్రసాద్, శ్రీ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.