“….ప్రస్థానం” కొనసాగింపు ప్రశ్నార్థకమేనా??… !

Shamila Injuredవై.యస్‌.ఆర్‌.సీ.పీ అధినేత జగన్‌ మోహన రెడ్డి ఓదార్పు యాత్రకు సీ.బీ.ఐ బ్రేకులు వేసింది. జగన్‌ అరెస్టయి జైలుపాలవడంతో పాలుపోని స్థితిలో “మరో ప్రజాప్రస్థానం” పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముందుగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాదయాత్ర చేయబోతున్నారని ప్రకటించినప్పటికీ వయోభారం, ఆరోగ్య సమస్యల దృష్ట్యా చివరి నిమిషంలో వై.యస్‌.జగన్‌ సోదరి షర్మిళ పాదయాత్ర చేయడానికి  పూనుకున్నారు. పూనుకోవడమే కాకుండా హుషారుగా, అలుపెరుగక జనాలను ఆకర్షిస్తూ, అధికార, ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. ఇప్పటికే 822 కిలోమీటర్లకు పైగా కడప, అనంతపురం, కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాలలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 57 రోజులపాటు పాదయాత్ర సాగించారు.

Shamila Injured1అయితే రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌ లో కాలిగాయం బారిన పడిన విషయం తెలిసిందే! కాలిగాయం తీవ్రంగా మారడంతో వైద్యులు షర్మిళకు శస్త్రచికిత్సతో పాటు దాదాపు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనితో షర్మిళ “మరో ప్రజా ప్రస్థానం” పాదయాత్రకు షర్మిళ వైపు నుండి కనీసం ఓ నెలరోజులపాటు బ్రేకులు పడినట్టే. అయితే, ఇప్పుడు మరి పాదయాత్రను ఎవరు కొనసాగిస్తారు? అన్నదానిపై సమాధానం కనిపించడం లేదు. వై.ఎస్‌.విజయమ్మ నడవడం కష్టమేనని సమాచారం. ఆవిడ నడుం నొప్పితో బాధపడుతున్నారని, కాబట్టి పాదయాత్ర చేయలేరని… అలాగే వై.యస్‌.జగన్‌ సతీమణి భారతి వ్యాపార కార్యకలాపాలతో పూర్తి బిజీగా ఉండడంవల్ల తాను పాదయాత్రలేనని చెప్పేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి “మరో ప్రజాప్రస్థానం” పాదయాత్రను ఎవరు తమ భుజస్కంధాలకెత్తుకుంటారో…? ఎవరు తమ కాలికి పని చెబుతారో…? సమాధానం ప్రస్థుతానికయితే వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ వర్గాలవద్ద కూడా లేని పరిస్థితి.

Shamila Injured2తాజాగా అపోలో ఆస్పత్రిలో జరగబోయే తన కాలి శస్త్రచికిత్సకు ముందు షర్మిళ చంచల్‌ గూడ జైలుకు వెళ్ళి సోదరుడు జగన్‌ ను కలిశారు. అక్కడ కూడా ఇదే చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే ప్రత్యామ్నాయం దొరకలేదని సమాచారం. అలాగే నడవడం కష్టమైనప్పటికి సహాయకుల సహకారంతో వీల్‌ ఛైర్‌ లో తన వద్దకు వచ్చిన సోదరి షర్మిళను చూసి జగన్‌ భావోద్వేగానికి గురయ్యారని ప్రత్యక్షంగా చూసినవారు మీడియాకు సమాచారమిచ్చారు.