ఇప్పుడు ఈ బంద్ ఎందుకు ???

Why did KCR call for bandhతెలంగాణా రాష్ట్ర సమితి అలవాటుగా మరోసారి బంద్ కు పిలుపు ఇచ్చింది. అయితే ఈ సారి ఈ బంద్ కు కారణం మాత్రం తెలియదు. తెలంగాణా అంశంపై డిల్లీ లో జరిగిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న తెరాస అధినేత చంద్రశేఖరరావు సమావేశం నుంచి బైటికి రాగానే ” రేపు తెలంగాణా బంద్ ” అని మీడియా ద్వారా పిలుపు ఇచ్చారు. అఖిల పక్ష సమావేశంలో కెసిఆర్ అనుకున్నదానికి వ్యతిరేకంగా గానీ, భిన్నంగా గానీ ఏమీ జరగలేదు. అసలా సమావేశానికి వెళ్ళే ముందే చంద్రశేఖరరావు ” ఈ సమావేశం ఒక డ్రామా.. దీనివల్ల ఒరిగేదేమీ లేదు..” అని ప్రకటించారు. అప్పటికే తెలుగుదేశం పైనా, కాంగ్రెస్ పైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పైనా విమర్శలు గుప్పించారు. ఈ మూడు పార్టీలు తెలంగాణా అంశంపై నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ మూడు పార్టీలు తమ అభిప్రాయం చెప్పవని ఈయన ఘంటాపధంగా చెప్పారు. సమావేశంలో ఏమి జరగబోతోందో తనకు తెలుసనీ చెప్పారు.

అన్నీ తెలిసి, అన్నిటికీ మానసికంగా సిద్ధమయ్యే ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం కూల్ గా జరిగింది. కేవలం గంట సేపట్లో ముగిసిన ఈ సమావేశంలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాయి. అయితే చంద్రశేఖరరావు అనుకున్నదానికి భిన్నంగా తెలుగుదేశం పార్టి మాత్రం ఈ మీటింగులో తెలంగాణా కు తాను అనుకూలమేనన్న అంశాన్ని స్పష్టంగా చెప్పింది. ఇది తెరాస కు మింగుడుపడని అంశం. తెలంగాణా లో తెలుగుదేశం పార్టీని లక్ష్యం గా చేసుకుని ఇప్పటిదాకా పోరాటం చేస్తోంది. దేశం పార్టీ తెలంగాణా కు వ్యతిరేకమన్న ఏకైక వాదనతో ఆ పార్టిని తెలంగాణా ప్రజలముందు దోషిగా నిలబెట్టాలన్న తెరాస ఆలోచనకు బ్రేక్ పడింది. తెలంగాణా అంశంలో దేశం స్పష్టత ఇవ్వటంతో ఆ పార్టీ ని కార్నర్ చేసేందుకు భవిష్యత్తులో తెరాస కు అవకాశం లేకుండా పోయింది. అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టి ప్రదర్శించిన వైఖరితో రాయలసీమ, ఆంద్ర ప్రాంతాలలో స్పందన ఎలా వున్నా తెలంగాణలో మాత్రం దేశం క్యాడర్లో కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇప్పటిదాకా రెండుకళ్ళ సిద్ధాంతం అనే ఆక్షేపణలు ఎదుర్కొంటున్న దేశం తన ఒంటికన్ను నిర్ణయాన్ని చెప్పేయటంతో తెరాస కు ఆయుధం చేజారి పోయినట్లయింది. అది మినహా, అంతకు మించి అఖిలపక్ష సమావేశంలో తెరాస ఊహించనివి ఏమీ జరగలేదు.

తెలంగాణాకు సంబంధించి కేంద్ర హొమ్ మంత్రి షిండే కూడా ఎటువంటి ప్రకటనా చేయలేదు. సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పలేదు. ఇది ఒకవిధంగా తెరాస కు అనుకూలమైన ఆయుధమే. ఈ కారణంతో తెలంగాణా ప్రాంతంలో వైఎస్సార్ పార్టీని మరింతగా కార్నర్ చేసేందుకు అవకాశం తెరాస కు దొరికినట్లయింది. ఏతా వాతా ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు గైకొనటం గానీ, నిర్ణయాలు ప్రకటించటం గానీ జరగలేదు. తెరాస బైటికొచ్చి బంద్ కు పిలుపు ఇచ్చేంత
తీవ్రమైన విషయం ఏమీ లేదు. సమావేశం నుంచి బయటికొచ్చిన చంద్రశేఖరరావు తాను అనుకున్నదే జరిగిందని, అన్ని పార్టీలు డ్రామాలు ఆడాయని అన్నారు. ఇదే మాట సమావేశం జరగక ముందే కెసిఆర్ చెప్పారు. అసలీ సమావేశం శుద్ధ దండగ అన్న చంద్రశేఖరరావు ఎందుకు డిల్లీ వెళ్లి అఖిల పక్షంలో పాల్గొన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశం తో పాటు, సి.పి.ఐ., సి.పి.ఎం., ఎం.ఐ.ఎం. తదితర పార్టీలు కూడా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాయి. తెలుగుదేశం నిర్ణయం పట్ల తెలంగాణా కాంగ్రెస్ ఎం.పి. లతో బాటు తెలంగాణా నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధనరెడ్డి కూడా హర్షం ప్రకటించారు. దేశం నిర్ణయాన్ని వాళ్ళందరూ స్వాగతించారు కూడా. కాని చంద్రశేఖరరావు మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరులకు నిరసనగా బంద్ కు పిలుపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెరాస నిర్ణయం ఉద్యమ రూపేణా కాకుండా కేవలం రాజకీయ ఉద్దేశ్యంతోనే వుందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తమ రాజకీయ ఉనికి కోసమే తెరాస ఈ బంద్ నిర్ణయాన్ని తీసుకున్నదని, ఈ బంద్ పిలుపు ద్వారా ప్రజలను ఇబ్బందులపాలు చేయటం తప్ప వేరే ఉద్యమ ప్రయోజనం లేదని వారు పేర్కొంటున్నారు.

అసలు అఖిల పక్ష సమావేశం పట్ల నమ్మకం లేని చంద్రశేఖర రావు ఆ సమావేశానికి ఎందుకు హాజరు అయ్యారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. ఆయన ఊహకు భిన్నంగా ఏదీ జరగలేదు… జరిగిన దానికి భిన్నంగా ఆయన ఏదీ ఆశించలేదు… ఊహించలేదు. మరి ఈ నిరసన, ఆగ్రహం ఎవరిమీద ? ఈ బంద్ పిలుపు ఎందుకోసం ? కెసిఆర్ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ నా ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నా ? తెలుగుదేశం పార్టీ నా ? లేక కెసిఆర్ కోపం తెలంగాణా ప్రజల మీదా ? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగల ఒకే ఒక్క వ్యక్తి చంద్రశేఖరరావు మాత్రమే….!