రివ్యూ: అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

abbayi-class-ammayi-mass
నిర్మాత‌కు లాస్‌…అబ్బాయి క్లాస్ – అమ్మాయి మాస్‌

కాపీ కొట్టాడు కాపీ కొట్టాడు.. అని రామ్ గోపాల్ వ‌ర్మని ఆడిపోసుకొంటాం గానీ – కాపీ కొట్టడం కూడా ఓ క‌ళే అని అర్థం చేసుకోరు. కాపీ కొట్టడం అంటే సీన్‌కి సీన్ మ‌క్కీకి మ‌క్కీ దించేయ‌డం అని చాలా మంది అపోహ‌. ఇంకొంద‌రు మార్పులూ చేర్పులూ చేసేసి, సొంత పైత్యం జోడించి ఉన్నదాన్ని పాడు చేస్తారు. ఇంకొంద‌రు ఎలాంటి క‌థ‌ను కాపీ కొట్టాలో, అది ఎలాంటి క‌థ‌లో ఇరికించాలో అర్థం కాక బోల్తా ప‌డ‌తారు. కోనేటి శ్రీ‌ను మూడో ర‌కం. అబ్బాయి క్లాస్ – అమ్మాయి మాస్‌లో తాను చేసిన చిన్న త‌ప్పుకు భారీ మూల్యం చెల్లించుకొన్నాడు. ఇంత‌కీ ఆ త‌ప్పేంటి? ఈ సినిమా క‌థేంటి? తెలుసుకోవాలంటే రివ్యూలోకి ప‌దండి.

శ్రీ (వ‌రుణ్ సందేశ్‌)కి అమ్మాయిలంటే ప‌డ‌దు. దానికో దారుణ‌మైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అమ్మాయి అన‌గానే బిగుసుకుపోతాడు. అత‌నికో కంపెనీ ఉంటుంది. అది న‌ష్టాల్లో న‌డుస్తుంటుంది. త‌న కంపెనీని గాడిలో పెట్టాలంటే లంటే చాలా డ‌బ్బులు కావాలి. మ‌రోవైపు కెకె (ఆహుతి ప్రసాద్‌) అప‌ర కోటీశ్వరుడు. త‌న కూతురు అంజ‌లి శ్రీని ప్రేమిస్తుంది. అంజ‌లి పెళ్లి చేసుకొంటే శ్రీ కంపెనీకి కావ‌ల్సిన ఆర్థిక స‌హాయం చేస్తాన‌నే ష‌ర‌తు విధిస్తాడు కెకె. త‌గ్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అంజ‌లిని పెళ్లిచేసుకోవ‌డానికి ఒప్పుకొంటాడు. కాక‌పోతే శ్రీ‌ని అమ్మాయిల‌తో ఎలా మ‌సులు కోవాలో తెలీదు. అందుకే నీరు ( హ‌రి ప్రియ‌) అనే వేశ్యని కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఇంటికి తెచ్చుకొంటాడు శ్రీ‌. నీరు ఎలాంటిది? ఆమె శ్రీ‌ని ఎలా మార్చగ‌లిగింది? నీరు వెనుక ఉన్న క‌థేంటి? మ‌ధ్యలో దాస్ (కాశీ విశ్వనాథ్‌) క‌థేమిటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సెకండాఫ్ కూడా ఓపిగ్గా కూర్చోవ‌ల‌సిందే.

ఈ స‌మీక్ష‌కు ముందు మ‌నం రాంగోపాల్ వర్మని గుర్తు తెచ్చుకొన్నాం. ఆయ‌నే ఎందుకంటే – గాడ్ ఫాద‌ర్ క‌థ‌నే ర‌క‌ర‌కాల కోణాల్లో చూసి కొత్త క‌థ‌లు పుట్టిస్తారాయ‌న‌. అదో ర‌క‌మైన కాపీ! ఈ ద‌ర్శకుడి ద‌గ్గర ఒక‌టి కాదు.. రెండు క‌థ‌లున్నాయి. ఒక‌టి హాలీవుడ్ చిత్రం ప్రెట్టీ ఉమ‌న్‌, బాలీవుడ్ సినిమా క‌హాని. ఈ క‌థ‌ని రెండు ముక్కలు చేసి, రెండు ప్రధాన పాత్రల‌కు అన్వయించుకొన్నాడు. కానీ వాటి చుట్టూ త‌న‌దైన క‌థ‌ను రాసుకోవ‌డంలో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

ఫ‌స్ట్ సీన్ నుంచీ ఈ సినిమా గూడ్స్ బండితో పోటీ ప‌డుతూ… నెమ్మదిగా న‌డుస్తుంటుంది. ఇంట్రవెల్ వ‌స్తున్నా క‌థలో వేగం రాదు. ఎందుకో చూసిన స‌న్నివేశాన్నే మ‌ళ్లీ మళ్లీ చూస్తున్నామ‌న్న ఫీలింగ్‌. ఈ స‌న్నివేశం లేక‌పోతే ఏమైంది?? క‌థ కొచ్చిన న‌ష్టం ఏమిటి?? అనే క్వశ్చనింగులు. అస‌లు ఈ సినిమాకెందుకొచ్చాం?? అనే సందేహాలు. ఇవ‌న్నీ తొల అర‌గంట‌కే క‌లిగేస్తాయి. ఈమ‌ధ్య కాలంలో ఇంత బోరింగ్ స్ర్కీన్ ప్లే మ‌రో సినిమాలో చూళ్లేదేమో..! నీరు పాత్ర ఎంట్రీ ఇచ్చాక కాస్త బాగుందేమో అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. అయితే అదీ క్రమంగా మాయ‌మైపోతుంది. ఇంట్రవెల్ త‌ర‌వాత మ‌న స‌హ‌నానికి మ‌రింత ప‌రీక్ష పెడ‌తాడు ద‌ర్శకుడు. శుభం కార్డులో క‌థ ఏ తీరున ముగుస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దాని కోసం మ‌రో గంట కూర్చోవ‌డం క‌ష్టమే!

వ‌రుణ్ సందేశ్ న‌ట‌న‌లో కొత్తద‌నం గురించి మాట్లాడుకోవ‌డం శుద్ధ దండ‌గ‌. క‌ళ్ల జోడు పెట్టుకొంటే క్లాస్ అబ్బాయి అయిపోతా.. అనుకొని ఉంటాడు. అక్కడ‌క్కడా కాస్త ఓవ‌ర్ యాక్షన్ చేశాడు. ఇక హ‌రి ప్రియ మాత్రం త‌న పాత్రకు న్యాయం చేసింది. హ‌స్కీ చూపులు, నిర్లక్ష్యపు మాట‌లు వెర‌సి… నీరూ పాత్ర నీరుగారిపోకుండా జాగ్రత్త ప‌డింది. గ్లామర్ కూడా అందుకు త‌గిన‌ట్టే ప్రద‌ర్శించింది. ఈ సినిమా కాస్తలో కాస్త చూడ‌గ‌లిగామంటే అదంతా.. హ‌రి ప్రియ వ‌ల్లే. శ్రీ‌నివాస‌రెడ్డి మ‌ళ్లీ పేర‌డీ కామెడీకే ప‌రిమిత‌మైపోయాడు. అత‌ని పాత్ర ఇంకాస్త బాగా తీర్చిదిద్దగ‌లిగితే క‌థ‌లో కాస్త రిలీఫ్ అయినా దొరికి ఉండేది. ఆహుతి ప్రసాద్‌, కాశీ విశ్వనాథ్ పాత్రని ఫాలో అయిపోయారంతే.

ఓ మాస్ చిత్రానికి ప‌నిచేయ‌డం శేఖర్ చంద్రకు ఇదే తొలిసారి. అయితే త‌న బాధ్యత‌ను సక్రమంగా నిర్వహించాడు. మాస్ బాణీలూ ఇవ్వగ‌ల‌ని అని నిరూపించుకొన్నాడు. రిలీల్ సోప్ పాట‌లో కౌశ అందాలు ఆక‌ట్టుకొంటాయి. ఇంత‌కు మించిన హైలెట్స్ రాయ‌డం క‌ష్టమే. ద‌ర్శకుడి అనుభ‌వ రాహిత్యం బాగా క‌నిపించింది. ఇంత బ‌ల‌హీన‌మైన క‌థ‌కు నిర్మాత‌లు ఎందుకు అన్ని డ‌బ్బులుపోశారో అర్థం కాదు. అటు క్లాస్‌కీ, ఇటు మాస్‌నీ ఆక‌ట్టుకోలేని ఈ సినిమా …. వ‌రుణ్ సందేశ్‌కి మరో చేదు జ్ఞాప‌కాన్నిమిగిల్చింది.

తెలుగు మిర్చి రేటింగ్స్: 2/5 –                                                                       .స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.