రివ్యూ: చంద‌మామ‌లో అమృతం

amruthaకాస్త చేదుగా.. ఇంకాస్త చ‌ప్ప‌గా ‘చంద‌మామ‌లో అమృతం‘ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5 

ఎన్ని జిమ్మిక్కులైనా చేయండి. నేల విడ‌చి సాము చేయండి. క‌థ‌ని అంత‌రిక్షంలోకీ తీసుకెళ్లండి. మాక్కావ‌ల్సింది వినోదం. కాసేపు కాల‌క్షేపం… అంటుంటారు ప్రేక్ష‌క మ‌హాశ‌యులు. అలాంటి సినిమాల్ని నెత్తిమీద పెట్టుకొంటారు. ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు, బాంబుల బీభ‌త్సాలు, ప‌గ – ప్ర‌తికారాలూ చూసి చూసి విసిగిపోయారు. టీవీ సీరియ‌ళ్ల‌లోనూ ఇదే గోల‌. కాసేపు న‌వ్వుకొందామ‌ని ఛాన‌ల్ తిప్పితే – అత్త అరాచ‌కాలు కోడ‌లు క‌న్నీళ్లు త‌ప్ప ఇంకేం క‌నిపించ‌వు. అలాంట‌ప్పుడే అమృతం వ‌చ్చింది. ప్రేక్ష‌కుల చెవుల్లో, క‌ళ్ల‌లో అమృతం నింపింది. ధారావాహిక‌ల్లో అదో ఒర‌వ‌డి. ఇప్పుడు అదే టీమ్‌… సినిమా తీస్తోందంటే – అందునా అమృతం క‌థ‌నే వెండి తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారంటే ఎంత ఆనందం..?? మ‌రి టీవీ అమృతానికీ, సినిమా అమృతానికి ఏమైనా పోలిక‌లున్నాయా? ఆ స్థాయిలో అమృతం న‌వ్వించిందా? తెలుసుకొందాం -రండి.

అమృతం (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌) ఆంజ‌నేయులు (హ‌రీష్‌) ఇద్ద‌రూ మంచి స్నేహితులు. అమృత విలాస్‌ని దిగ్వియంగా న‌డుపుతుంటారు. అయితే అమృతం మావ‌య్య పెట్టిన కండీష‌న్ వ‌ల్ల విడిపోతారు. చెరో చోట హోట‌ల్ బిజినెస్ పెట్టి, అందులో విజ‌యం సాధిస్తారు. తిరిగి అమృతం, ఆంజ‌నేయులు మ‌ళ్లీ క‌లుస్తారు. ఆ హోట‌ల్‌కి వ‌చ్చిన ప్రేమ జంట‌కి ద‌గ్గ‌రుండి పెళ్లి చేయాల‌నుకొంటారు. అయితే అబ్బాయి తండ్రి టెర్ర‌రిస్ట్‌, అమ్మాయి తండ్రి ఫ్యాక్ష‌నిస్ట్‌! ఎవ‌రో ఒక‌రు అమృత విలాస్‌పై దాడి చేస్తూనే ఉంటారు. మ‌రోవైపు చంద్ర‌యాన్ పేరుతో చంద‌మామ‌పై టూరిజం అనే కాన్సెప్ట్ ఒక‌టి మొద‌ల‌వుతుంది. ఇక్క‌డున్న ఆస్తుల‌న్నీ ఆమ్మేసి చంద్ర‌యాన్ వెళ్లాల‌ని అమృతం, ఆంజ‌నేయులు ప్లాన్ చేస్తారు. అనుకొన్న‌ట్టుగానే ఆస్తుల‌న్నీ ఆమ్మేసి టికెట్లు కొంటారు. కానీ ఆ సంస్థ బోర్డు తిప్పేస్తుంది. దాంతో ఇద్ద‌రూ రోడ్డున ప‌డ‌తారు. అయితే చంద‌మామ‌పైకి వెళ్లాలి. అక్క‌డ దొరికిన‌కాడికి దోచుకోవాల‌న్న క‌సి మాత్రం ఇద్ద‌రిలోనూ ఉంటుంది. అందుకోసం వాళ్లేం చేశారు? చంద‌మామ‌పై ఎలా వెళ్లారు? అక్క‌డ ఎలాంటి హంగామా సృష్టించారు? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

ద‌ర్శ‌కుడు గుణ్ణం గంగ‌రాజు కాన్సెప్ట్ కొత్త‌గా, దాన్ని ప్ర‌జెంట్ చేసే విధానం వింత‌గా ఉంది. అమృతంలో ఆయ‌న ఎన్ని అద్భుతాలు సృష్టించారో. వారానికి ఒక గ‌మ్మ‌త్తైన కాన్సెప్ట్‌తో నవ్వించారు. చంద‌మామ‌లో అమృతం విష‌యంలోనూ ఆయ‌న వెరైటీ కాన్సెప్టుల‌ను ఫాలో అయిపోయారు. అమృత విలాస్‌ని స్పేస్‌లో పెట్టాల‌న్న ఆలోచ‌న బాగుంది. దానికి అగుగుణంగానే కాన్సెప్టులు త‌యారు చేసుకొన్నారు. అయితే సినిమా వేరు, సీరియ‌ల్ వేరు! అమృతం సీరియ‌ల్ స‌క్సెస్ అయ్యింది క‌దా.. అని ఈ సినిమా కూడా ఆయ‌న సీరియ‌ల్ తీసిన‌ట్టే తీస్తారు. రెండున్న‌ర గంట‌ల సినిమానే అయినా… థియేట‌ర్‌లో ఆరు గంట‌లు కూర్చున్న ఫీలింగ్. చెప్పేదేదో నిదానంగా, టైమ్ తీసుకొని చెబుదామ‌న్న‌ది ఆయ‌న కాన్సెప్ట్‌. దాంతో నాలుగో స‌న్నివేశం నుంచే సినిమా బోర్ కొడుతుంటుంది. అయితే అమృతం స్థాయిలో అక్క‌డ‌క్క‌డ మెరుపులు మెర‌వ‌డంతో ప్రేక్ష‌కుడు తేరుకొంటూ, మ‌ళ్లీ నీర‌సిస్తూ.. ఇలా ప్ర‌యాణం సాగిస్తుంటాడు. మెగా ఎపిసోడ్ అని ఒక‌టి వేస్తుంటారు. ఆదివారం పూట‌. అంటే దాదాపు గంట, గంట‌న్న‌ర పాటు సాగుతుందా సీరియ‌ల్‌! అమృతం కూడా మెగా సీరియల్ టైపే అనుకోవాలి.

ఇది కామెడీ సినిమానే. కాక‌పోతే డైలాగ్ ఓరియెంటెడ్ కాదు. యాక్ష‌న్ ఓరియెంటెడ్‌. సినిమాలో లీన‌మైపోయి, పాత్ర‌ల్ని ఫాలో అయిపోతే గానీ ఆ కామెడీ అర్థం కాదు. దాన్ని బీసీ సెంట్ల‌రో ప్రేక్ష‌కులు అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మే. అమృతం సీరియ‌ల్ అన‌గానే.. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ గుర్తొస్తాడు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ – గుండుహ‌నుమంత‌రావుల‌ది అద్భుత‌మైన కాంబినేష‌న్‌. వాళ్ల టైమింగ్ సూప‌ర్‌గా కుదిరింది. వాళ్ల‌ను పెట్టుకొన్నా చంద‌మామ‌లో అమృతం కాస్త చూసేవాళ్లం. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అమృతం పాత్ర‌ని చెడ‌గొట్ట‌లేదు. త‌న వంతు న్యాయం చేశాడు. అయితే గుండు హ‌నుమంత‌రావు లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. అప్పాజీ, సారువాడు.. య‌ధావిధిగా న‌వ్వించారు. రావు ర‌మేష్‌, ఆహుతి ప్ర‌సాద్ యాడ్ అయ్యాడు. వాళ్లు త‌మ ప‌రిధి మేర ఆక‌ట్టుకొన్నారు. సంగీతం, కెమెరాప‌నిత‌నం రెండూ బాగున్నాయి. సినిమా ఆద్యంతం స్పేస్‌పై సాగుతుంది అనుకొన్నారు గానీ.. అంత సినిమా లేదు. ఏదో ఓ అర‌గంట పాటు చూపించారంతే. అయితే అక్క‌డ చూపింని కాన్సెప్ట్‌లు బాగున్నాయి.పాత పాట‌ల్ని రిమిక్స్ రూపంలో వాడుకొన్నారు. నిర్మాణం విష‌యంలో నాణ్య‌త ప్ర‌మాణాలు త‌గ్గాయి. చిన్న సినిమా కాదా?? బ‌డ్జెట్‌నీ దృష్టిలో పెట్టుకొని సినిమా తీసుంటారు.

ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. వెండి తెర ఇచ్చినా – బుల్లి తెర బుద్దులు పోనిచ్చుకొన్నారు కాదు.. అని. అది అక్ష‌రాలా నిజం. సినిమా అనేస‌రికి స్కేల్ మారుతుంది. లార్జ‌న్ దేన్ లైఫ్ ఆలోచ‌న‌లు రావాలి. కాస్త జోష్ ఉండాలి. అవే… ఈ అమృతంలో క‌ర‌వ‌య్యాయి. అమృతం సీరియ‌ల్ అంటే ఇష్టం ఉన్న‌వాళ్లు ఈ సినిమా ఒక్క‌సారి చూడ‌డానికి సాహ‌సించొచ్చు.

ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే… ఇది సీరియ‌ల్ టైపు సినిమా. చూడ్డానికి ఓపిక తెచ్చుకోవాలి.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5                     – స్వాతి
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు