రివ్యూ: అనామిక

anamika

క‌హానీ + శేఖ‌ర్‌క‌మ్ముల = అనామిక‌ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5

రీమేక్ సినిమాల్లో తెలియ‌ని రిస్క్ ఉంది. మ‌న నేటివిటీకి ఆ క‌థ‌ని త‌ర్జుమా చేసుకోక‌పోతే… కథ ఎంత బాగున్నా ఆ ప్ర‌య‌త్నం నిష్ష‌లం అవుతుంది. ఉన్న‌ది ఉన్న‌ట్టు దించేస్తే… కాపీ పేస్ట్ అంటారు. సొంత తెలివి తేట‌లు జోడిస్తే సినిమా పాడు చేశావ్ అంటారు. సినిమా హిట్ట‌యితే… నీ గొప్ప‌ద‌నం ఏముంది?? అని అడుగుతారు. సో… రీమేక్ సినిమా అనుకొన్నంత ఈజీ కాదు. శేఖర్ క‌మ్ముల సినిమాల‌కు ఓ బ్రాండ్ ఉంది. పోస్ట‌ర్ పై శేఖ‌ర్ క‌మ్ముల అనే పేరు చాలు.. దాన్ని న‌మ్మి జ‌నాలు థియేట‌ర్‌ల‌వైపు రావ‌డానికి. అత‌ని క‌థ‌లు.. మ‌న‌నుంచి పుట్టిన‌వే. అంత స‌హ‌జంగా ఉంటాయి. అలాంటి శేఖ‌ర్ క‌మ్మల ఓ రీమేక్ క‌థ ఎంచుకొన్నాడు. అత‌ని ముందు రెండు స‌వాళ్లు. ఒక క‌హానీని ధీటుగా తీయాలి. రెండోది… త‌న సొంత ముద్ర చూపించాలి. ఆ రెండింటికీ న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేశాడు అనామిక‌లో..!

అనామిక (న‌య‌న‌తార‌) అమెరికానుంచి వ‌స్తుంది. ఎయిర్‌పోర్టులో దిగ‌డ‌మే నేరుగా.. పోలీస్ స్టేష‌న్‌కి వెళ్తుంది. నాభ‌ర్త అజ‌య్ శాస్త్రి (హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణె) వారం రోజుల నుంచీ క‌నిపించ‌డం లేదు. అత‌న్ని ఎలాగైనా వెదికి ప‌ట్టుకోమ‌ని కంప్లైంట్ ఇస్తుంది. ఏఎస్సై పార్థ‌సార‌ధి (వైభ‌వ్‌) అనామిక‌కు స‌హాయం చేస్తుంటాడు. కానీ సీఐ మాత్రం.. సార‌ధి ప్ర‌య‌త్నాల‌ను కావాల‌నే అడ్డుకొంటూ ఉంటాడు. నా కోరిక తీరిస్తే.. నీ భ‌ర్త ఆచూకీ చెబుతా అని అనామిక‌తో బేరం కూడా పెడ‌తాడు. మ‌రోవైపు అజ‌య్ శాస్త్రి గురించి కూపీలాగుతుంటుంది అనామిక‌. అయితే అజ‌య్ గురించి వివ‌రాలు తెలిసిన‌వాళ్లంతా ఒకొక్క‌రుగా హ‌తం అవుతుంటారు. సీఐ కూడా అలానే మృత్యువాత ప‌డ‌తాడు. అయితే సీఐ ఇంట్లో ఓ హార్డ్ డిస్క్ దొరుకుతుంది. అందులో కీల‌క‌మైన ఆధారాలుంటాయి. ఆ హార్డ్ డిస్క్ కోసం హోం మంత్రి (న‌రేష్‌) ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈ కేస్‌ని డీల్ చేయ‌డానికి వ‌చ్చిన పాషా (ప‌శుప‌తి)… నీ భ‌ర్త ఓ తీవ్ర‌వాది అనే షాకింగ్ న్యూస్ అనామిక‌కు చెబుతాడు. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ తీవ్ర‌వాది ఎలా అయ్యాడు? పాషా చెప్పింది నిజ‌మా? కాదా? అజ‌య్ గురించి తెలిసిన వాళ్ల‌ని చంపుతోంది ఎవ‌రు? ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? వీటికీ పీపుల్స్ ప్లాజాలో జ‌రిగిన బాంబుపేళుళ్ల‌కు ఏమైనా సంబంధం ఉందా? ఇవ‌న్నీ అనామిక చూసి తెలుసుకోవాల్సిందే.

క‌హానీ ఓ థ్రిల్ల‌ర్. చ‌క‌చక ముందుకు సాగుతుంది. సెకండాప్‌లో వ‌చ్చే ట్విస్టులు అద్భుతంగా ఉంటాయి. అయితే క‌హాని చూసిన‌వాళ్ల‌కూ అనామిక కొత్త‌గా ఉండాలి క‌దా..?? అందుకే శేఖ‌ర్ క‌మ్ముల ఈ సినిమాలో కీల‌క‌మైన మార్పులు చేశాడు. క‌హానిలో ఆత్మ అలానే ఉంచుతూ సొంత ప్ర‌తిభ చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. క‌హానీలో విద్యాబాల‌న్ గ‌ర్భ‌వ‌తి. ఓ నిండు గ‌ర్భిణి త‌న భ‌ర్త గురించి అన్వేషిస్తూ క‌ష్టాలు ప‌డుతుంటే గుండె త‌రుక్కుపోతుంటుంది. సినిమాసాగే కొద్దీ ఆ పాత్ర‌పై సానుభూతి పెరుగుతుంది. అలాంటిది… గ‌ర్భం అనే కాన్సెప్ట్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టాడు శేఖ‌ర్ క‌మ్ముల. ఈ మార్పు వ‌ల్ల క‌థ‌లో కొత్త ఎపిసోడ్‌లు రాసుకొనే సౌల‌భ్యం వ‌చ్చింది. అనామిక‌ని సీఐ అనుభ‌వించాల‌ని కోరుకోవాల‌నుకొనే ఎపిసోడ్ కొత్త‌గా రాసుకొనే అవ‌కాశం చిక్కింది. సెకండాఫ్‌లో భారీ మార్పులు చేశాడు శేఖర్ క‌మ్ముల. అనామిక‌కీ, క‌హానీకి ఎలాంటి పోలిక‌లు క‌నిపించ‌వు. క్లైమాక్స్ పూర్తిగా కొత్త‌ది. ఒక విధంగా చెప్పాలంటే క‌హాని చూసిన వాళ్ల‌కి కూడా థ్రిల్ క‌లిగిస్తుంది. క‌హానికి శేఖ‌ర్ క‌మ్ముల 50 శాతం మాత్ర‌మే వాడుకొన్నాడు. మిగ‌తా స‌గం.. త‌న ఆలోచ‌న‌ల ప్ర‌కారం క‌థ‌ని ముందుకు న‌డిపించాడు.

పాతబ‌స్తీ నేప‌థ్యాన్ని బాగా వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. తొలిభాగంలో క‌థ నెమ్మ‌దిగా ముందుకు పోతుంటుంది. మ‌ర్డ‌ర్ ఎపిసోడ్ల‌తో… కాస్త టెన్ష‌న్ పెరుగుతుంది. క్ర‌మంగా అది సెకండాఫ్‌తో జోరు అందుకొంటుంది. క్లైమాక్స్‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చి.. స‌మ‌ర్థ‌మంత‌మైన ముగింపు ఇచ్చాడు. అయితే శేఖ‌ర్ చేసిన మార్పుల వ‌ల్ల స‌గం మంచి, స‌గం చెడు జ‌రిగాయి. క‌హానితో పోలిస్తే… అనామిక‌లో ప‌ట్టు స‌డ‌లింది. ఇన్విస్టిగేష‌న్ ఆఫీస‌ర్ పాత్ర క‌హానిలో కీల‌కం. ఇందులో ప‌శుప‌తికి అంత స్కోప్ లేదు. క‌హానిలో ట్విస్ రివీల్ చేసే స‌న్నివేశాలు బాగుంటాయి. చివ‌రికి ఆ లాడ్జ్ కూడా క‌హానీలో ఓ భాగంగా ఉంటుంది. అక్క‌డ చిన్న‌బ్బాయి పాత్ర కూడా క‌హానిలో కీల‌కం. అయితే అనామిక‌లో మాత్రం అనామిక పాత్ర‌కు త‌ప్ప ఏ పాత్ర‌కూ స‌రైన ప్రాధాన్యం ఉండ‌దు. సినిమాని ముగించేయాల‌న్న తొంద‌ర‌లో ట్విస్ట్ రివీల్ చేస్తూ.. ప్రేక్ష‌కుల్ని క‌న్విన్స్ చేస్తూ ముగించాల‌ని ఆలోచించ‌లేదు. పోలీస్‌ని రెండో నిమిషంలోనే నువ్వు నువ్వు అంటూ అనామిక ఏక వ‌చ‌నంతో సంబోధించ‌డం.. బొత్తిగా అత‌క‌లేదు. అస‌లు ఆ హార్డ్ డిస్క్‌కీ, హోం మంత్రికి సంబంధం ఏమిటి? అనామిక హైద‌రాబాద్ రావ‌డానికీ, త‌న భ‌ర్త‌ను వెత‌క‌డానికి ప్రేరేపించిన అంశాలేంటి? ఇలాంటి విష‌యాల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు.

సినిమా అంతా త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకొని న‌డ‌ప‌డానికి న‌య‌న‌తార శ్ర‌మించింది. విద్యాబాల‌న్‌తో పోలిస్తే త‌క్కువ మార్కులు ప‌డ‌తాయేమోగానీ… అలాంటి పోలిక‌లు లేక‌పోతే ఫ‌స్ట్ క్లాస్ మార్కులే! భావోద్వేగాలు పండించే స‌న్నివేశాల్లో బాగా న‌టించింది. ముఖ్యంగా పోలీస్‌స్టేష‌న్‌లో ఖాన్‌తో గొడ‌వ ప‌డే సంద‌ర్భంలోనూ, ప‌తాక స‌న్నివేశాల్లోనూ న‌య‌న న‌ట‌న భేషుగ్గా ఉంది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణె మాంటేజ్ సీన్స్‌లో క‌నిపించ‌డం త‌ప్ప ఏం చేయ‌లేదు. వైభ‌వ్ సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకొంటూ పోయాడు. ప‌శుప‌తి క‌నిపించేది కాసేపే అయినా ఆక‌ట్టుకొంటాడు. అత‌ని పాత్ర ప‌రిధి, నిడివి పెంచాల్సింది. సినిమా క్వాలిటీ విష‌యంలో నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. కీర‌వాణి పాట‌ల‌కు ఈ సినిమాలో అంత‌స్కోప్ లేదు. అందుకే త‌న ప‌నిత‌నాన్ని ఆర్‌.ఆర్ విష‌యంలో చూపించాడు. ఈ సినిమాకి ప్ర‌ధానమైన హైలెట్స్‌లో ఆర్‌.ఆర్ ఒక‌టి. సన్నివేశాల్ని ఎలివేట్ చేయ‌డానికి నేప‌థ్య సంగీతం బాగా దోహ‌దం చేసింది. ఆర్ట్ ప‌నిత‌నాన్నీ మెచ్చుకోవాలి. పాత బ‌స్తీ సెట‌ప్‌లో వేసిన లార్డ్జ్ బాగుంది. కెమెరా వ‌ర్క్‌కి పేరు పెట్ట‌లేం. పాత‌బ‌స్తీ ఇరుకు వీధుల్లో కెమెరా న‌డిపించ‌డం మామూలు విష‌యం కాదు. సంభాష‌ణ‌ల్లో మెలోడ్రామా లేకుండా స‌హ‌జంగా ఉండేలా చూసుకొన్నాడు. ఆడ‌ది పక్క‌లో పువ్వ‌యినా అవ్వొచ్చు, బ‌ల్లెం అయినా అవ్వొచ్చు. ఏద‌వుతుందో అయ్యేవ‌ర‌కూ తెలీదు అన్న డైలాగ్ బాగుంది.

రీమేక్ రైట్స్ కొన్నాం క‌దా.. అని ఉన్న‌ది ఉన్న‌ట్టు కాపీ చేయ‌కుండా… త‌న సొంత తెలివి తేట‌ల్ని చూపించే ప్ర‌య‌త్నం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల‌ను అభినందించాలి. క‌హాని చూడ‌కుండా ఈ సినిమాకి వెళ్తే.. నిరుత్సాహ‌ప‌డ‌రు. చూసి వెళ్లినవాళ్ల‌కూ కాస్త కొత్త‌గానే అనిపిస్తుంది. కానీ… క‌హానీతో పోల్చి చూసుకొని చూస్తేనే క‌ష్టం.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5                                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు