రివ్యూ : చంద‌మామ క‌థ‌లు

 

chandamama-kathalu-review (1)

                          |Click here for English Review|

కంచికి చేర‌ని ‘చంద‌మామ క‌థ‌లు’ : తెలుగుమిర్చి రేటింగ్ – 2.5/5

ప్ర‌యోగాలు అని చెప్ప‌లేం గానీ.. డిఫ‌రెంట్ సినిమాలు తీసే ద‌ర్శ‌కుల్లో… ప్ర‌వీణ్ స‌త్తారు ఒక‌రు. మ‌నం చూసిన క‌థ‌ల్నే కాస్త కొత్తగా, వీలైనంత స‌హ‌జంగా చూపిస్తారాయ‌న‌. ముఖ్యంగా క‌థ‌ని క‌థ‌గా చెప్పాలంటే ఆయ‌న‌కు ఇష్టం. ఇప్పుడు ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది క‌థ‌లు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఆ సినిమానే చంద‌మామ క‌థ‌లు. ఇంట్లో పిల్ల‌ల్ని నిద్ర‌బుచ్చ‌డానికి పెద్ద‌వాళ్లు క‌థ‌లు చెబుతుంటారు. ఒక క‌థ‌, దాని త‌ర‌వాత మ‌రో క‌థ‌.. ఆ త‌ర‌వాత ఇంకో క‌థ‌. మొద‌టి క‌థ‌కీ, మూడో క‌థ‌కీ లింకు ఉండ‌దు. ఇందులోనూ అంతే. ప్రేక్ష‌కుల్ని బొజ్జో పెట్ట‌డానికి… ద‌ర్శ‌కుడు ఎనిమిది క‌థ‌లు చెప్పాల్సొచ్చింది. ఇంత‌కీ ఆ క‌థ‌లెలా ఉన్నాయి? దాన్ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన విధానం ఎలా ఉంది?? తెలుసుకొందాం రండి.

సార‌ధి (కిషోర్) ఓ ర‌చ‌యిత‌. త‌న కూతుర్ని కాపాడుకోవ‌డానికి ఐదు ల‌క్ష‌లు అవ‌స‌రమ‌వుతాయి. వాటిని సంపాదించే మార్గం.. క‌థ‌రాయ‌డం ఒక్క‌టే. అందుకే తన జీవితంలో ఎదురైన మ‌నుషుల క‌థ‌ల్ని.. రాయ‌డం మొద‌లెడ‌తాడు. వెంక‌టేశ్వ‌ర‌రావు (కృష్ణుడు) కి 30 ఏళ్లొచ్చినా పెళ్లికాదు. పాపం… చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. మొక్క‌ని దేవుడూ లేడు. త‌న‌కు టైమ్ ఎప్పుడొస్తుందా?? అని ఎదురుచూస్తుంటాడు. లీసా (ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌) ఓ టాప్ మోడ‌ల్‌. త‌న కెరీర్ డౌన్ ఫాల్‌ లో ఉంటుంది. చిన్న చిన్న యాడ్స్ చేయాల్సివ‌స్తుంది. ఆ బాధ‌తో పాటు న‌మ్ముకొన్న‌వాడు (ఫృథ్వీ) హ్యాండిస్తాడు. ఓ బిచ్చ‌గాడు (కృష్ణేశ్వ‌ర‌రావు)కి సొంత ఇల్లు కొనుక్కోవాల‌న్న ఆశ‌. అందుకే రూపాయి రూపాయి కూడ‌బెట్టి ప‌ది ల‌క్ష‌లు సంపాదిస్తాడు. మోహ‌న్ (న‌రేష్‌) అమెరికా నుంచి ఇండియా వ‌స్తాడు. 30 యేళ్ల త‌ర‌వాత త‌న మాజీ ప్రియురాలు స‌రిత (ఆమ‌ని)ని చూస్తాడు. అప్ప‌టికే స‌రిత భ‌ర్త‌కు దూరం అవుతుంది. మోహ‌న్ కూడా ఒంట‌రివాడే. అందుకే ఇద్ద‌రూ త‌మ జీవితాల్ని మ‌రోసారి మొద‌లుపెట్టాల‌ని భావిస్తుంటారుజ అష్ర‌ఫ్ (అభిజిత్‌) పాత‌బ‌స్తీలో కిరాణా కొట్టు న‌డుపుతుంటాడు. హ‌సీనా (రిచాప‌న‌య్‌) అంటే చాలా ఇష్టం. ఆమె కూడా అఫ్ర‌ఫ్ ని ప్రేమిస్తుంది. కానీ ఆస్తులు బాగున్నాయ‌ని.. ఓ దుబాయ్ కుర్రాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. రఘు(చైతన్య కృష్ణ) రేణు (షామిని అగర్వాల్) ఒకే కాలేజీలో చ‌దువుకొంటుంటారు. రేణు డ‌బ్బున్న‌వాళ్ల బిడ్డ‌. ర‌ఘు పేదింటి కుర్రాడు. ఎలాగైనా రేణుని లొంగ‌దీసుకొని ఆ ఇంటికి అల్లుడు కావాల‌నుకొంటాడు. రఘు(నాగ సౌర్య) ప‌ల్లెటూరి కుర్రాడు. బ‌ల‌దూర్‌ గా తిరుగుతుంటాడు. గౌరీ (అమిత రావు) ని ఏడిపిస్తుంటాడు. ఓ సారి అర్థ‌రాత్రి గౌరి ఇంటికి వెళ్లి.. అడ్డంగా దొరికిపోతాడు. ఈ క‌థ‌ల‌న్నీ ఏ కంచికి చేరాయో తెలియాలంటే చంద‌మామ క‌థ‌లు చూడాలి.

అస‌లు ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని ఎనిమిది క‌థ‌ల్ని ఒక‌చోట చేర్చాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిందో…?? బాలీవుడ్‌ లో ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. బొంబే టాకీస్ అనే సినిమా వ‌చ్చింది. నాలుగు క‌థ‌ల్ని ఒకే సినిమాగా తీశారు. అయితే ఒక్కో క‌థ‌నీ ఒక్కో ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేశాడు. ఆ విధానం అక్క‌డ స‌క్సెస్ అయ్యింది. అయితే ప్ర‌వీణ్ స‌త్తారు మాత్రం ఆ ఎనిమిది క‌థ‌ల్నీ తానే హ్యాండిల్ చేయాల‌నుకొన్నాడు. అయితే ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ లింక్ లేక‌పోవ‌డం ఈ సినిమాకున్న ప్ర‌ధాన మైన‌స్‌. క‌థ‌లెనిమిది అయినా ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌నీ క‌న్ ఫ్యూజ్ లేకుండా, ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌గ‌లిగాడు. ఆ విష‌యంలో మెచ్చుకొని తీరాలి. ఆయా క‌థ‌ల్ని ముగించిన విధానం కూడా ఓకే అనిపిస్తుంది. కానీ ఎనిమిది క‌థ‌ల్ని ఒక చోట చేర్చే సత్తా మాత్రం ద‌ర్శ‌కుడిలో క‌రువ‌య్యింది. పైగా ఎనిమిది క‌థ‌ల్లో ఒక‌ట్రెండింటిలో మిన‌హా మిగ‌తా క‌థ‌ల్లో డెప్త్ లేదు. మ‌న‌కు ఎదుర‌య్యే క‌థ‌లే అవ‌న్నీ. వాటిని నాలుగుకి కుదించుకొంటే బాగుండేది. లీసా పాత్ర‌ ఫ్యాష‌న్ సినిమాలోని ప్రియాంకా చోప్రాని పోలి ఉంటుంది. ఆమ‌ని – నరేష్‌ల ఎపిసోడ్‌… లైఫ్ ఇన్ మెట్రో సినిమాకి కాపీ. బిచ్చ‌గాడి స్టోరీ మ‌రో సినిమా నుంచి ఎత్తేసిన‌దే. కృష్ణుడు క‌థ‌లో ఇంపాక్ట్ లేదు. అలాంట‌ప్పుడు ఎనిమిది క‌థ‌ల్ని చూసే ఓపిక ప్రేక్ష‌కుడికి ఎక్క‌డి నుంచి వ‌స్తుంది??

ఓ మ్యాగ్‌ జైన్ కోసం ర‌చ‌యిత రాసిన క‌థ ఇది… అని చూపించాడు ద‌ర్శ‌కుడు. ఏ మ్యాగ‌జైనండీ క‌థ‌కి ఐదు ల‌క్ష‌లు ఇస్తోంది?? సినిమా కోసం రాసిన క‌థ అనుకొంటే బాగుండేది. బిచ్చ‌గాడు పైసా పైసా కూడ‌బెట్టిన డ‌బ్బుతో త‌న అవ‌స‌రం తీర్చుకొన్నాడు ర‌చ‌యిత‌. ఇక ఆ పాత్ర‌కి వ్య‌క్తిత్వం ఎక్క‌డున్న‌ట్టు?? 30 యేళ్లు దాటితే పెళ్ల‌వ్వ‌దా? నేటి యువ‌త‌కు, అందులోనూ అబ్బాయిల‌కు ఇలాంటి భ‌యాలున్నాయా?? లీసా, వెంక‌టేశ్వ‌ర‌రావు ఎలా క‌లిశారు? వారి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఈ విష‌యాల్ని దర్శ‌కుడు ట‌చ్ చేయ‌లేదు. ఏ క‌థ ఆ క‌థ విడివిడిగా చూసుకొంటుంటే బాగానే ఉంద‌నిపిస్తుంది. కానీ క‌లిపే ఓ అంతఃసూత్రం ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర లేకుండా పోయింది. స‌హ‌జ‌త్వానికి పెద్ద‌పీట వేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తి స‌న్నివేశాన్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు. ఆ విష‌యంలో ప్ర‌వీణ్ స‌త్తారు స‌త్తా మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. బిచ్చ‌గాళ్లు డ‌బ్బు ఎలా దాచుకొంటాన్న విష‌యాన్ని రిసెర్చ్ చేసిన‌ట్టు ఉన్నాడు. ఆ స‌న్నివేశాల్ని బాగా చూపించాడు.

న‌టీన‌టుల విష‌యానికొస్తే… ప్ర‌తి ఒక్క‌రూ తమ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. మిస్ కాస్టింగ్ ఒక్క‌రంటే ఒక్క‌రూ లేరు. ఇక్క‌డో విష‌యాన్ని త‌ప్ప‌కుండా ప్ర‌స్తావించాలి. వెన్నెల కిషోర్‌, కొండ‌వ‌ల‌స ల‌కు సెప‌రేట్ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివ‌రీ ఉంటుంది. కానీ ఈ సినిమాల్లో నూ వాళ్ల‌చేత బాలెన్స్ న‌ట‌న రాబట్టుకొన్నాడు ద‌ర్శ‌కుడు. త‌మ స్టైల్‌ ని పూర్తిగా మార్చుకొని ద‌ర్శ‌కుడుకీ, క‌థ‌కీ ఏం కావాలో అదే చేశారు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కు త‌గిన పాత్ర దొరికింది. లైఫ్ లో ప‌డుతున్న స్ట్ర‌గుల్‌ ని బాగా చూపించ‌గ‌లిగింది. బిచ్చ‌గాడిగా క‌నిపించిన కృష్ణారావు న‌ట‌న ఆక‌ట్టుకొంటుంది. న‌రేష్‌, ఆమనిల మ‌ధ్య సాగిన ల‌వ్‌ట్రాక్ కూడా ఒకే. కానీ లిప్ లాక్ సీన్ ఒక్క‌టే.. కాస్త ఆక్షేప‌ణ మోయాల్సివ‌చ్చింది. అది కూడా లేకుండా క్లీన్ గా చూపించొచ్చు. అర‌వై ఏళ్ల దాటిన త‌ర‌వాత కూడా ప్రేమ ఉంటుంది, ఎవ‌రి జీవితాల్ని వాళ్లు నిర్ణ‌యించుకోవ‌చ్చు అన్న మోడ్ర‌న్ థాట్ ఉన్న ద‌ర్శ‌కుడు.. భ‌ర్త‌పోయిన ఆడ‌దాన్ని వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఎందుకు చూపించిన‌ట్టో..??

మిక్కీ ప్ర‌తిభ ఏమైపోయిందో అర్థం కావ‌డం లేదు, పాట‌ల్లో సాహిత్యం బాగానే వినిపించింది. కానీ ట్యూన్‌ ల‌లో కొత్త‌ద‌నం ఎక్క‌డ‌?? వినిపించిన బాణీలే మ‌ళ్లీ వినిపిస్తున్నాడు. ఆర్‌. ఆర్ విష‌యంలో మాత్రం ప్ర‌తిభ బాగానే చూపించాడు. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టాలి. ఆర్ట్ విభాగ ప‌నితీరు బాగుంది. సంభాష‌ణ‌లు లైట్ గా ఉన్నాయి. అబ్బ‌.. భ‌లే రాశాడు అన్న డైలాగ్ ఒక్క‌టీ లేదు. ఇంత డ్ర‌మ‌టిక్‌గా ఉందిరాబాబూ.. అని త‌ల‌లుప‌ట్టుకొన్న డైలాగూ లేదు. దర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా స‌గం స‌గం మార్కులే తెచ్చుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు.

మాస్ ని పూర్తిగా నెగ్లెట్ చేస్తూ తీసిన సినిమా ఇది. ద‌ర్శ‌కుడు త‌న అభిరుచిని చూపించాల‌నుకొన్నాడు. అయితే ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ప‌ట్టించుకోలేదు. అన్ని క‌థ‌ల‌కూ ఓ ముగింపు ఇచ్చాడు. కానీ మొత్తంగా సినిమా క‌థే.. కంచికి చేరేట్టు క‌నిపిచండం లేదు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                     – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

| Click here for English Review|