రివ్యూ: గాలిపటం

 

Galipatam-telugu-movie-review-ratingయువ‌త‌కు గాలం..  ‘గాలిప‌టం : తెలుగుమిర్చి రేటింగ్ : 3/5

మ‌సాజ్ సినిమా చూపిస్తూ.. మెసేజ్ ఇవ్వడం కూడా ఓ క‌ళే! ఎంత బూతు తీసినా, ఎంత బోల్డ్‌గా సీన్లు చూపించినా వాటికీ ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంద‌ని చెప్పడానికీ బుర్రకావాలి. సంప‌త్ నందికి అది కావ‌ల్సినంత ఉంది. త‌న తొలి సినిమా ఏమైంది ఈ వేళ గుర్తుందా? అదీ ఇంతే. ప్రేమ పేరుతో కుర్రకారు వేసే వెర్రి మొర్రి వేషాల‌న్నీ ఎంచ‌క్కా తీసేసి చివ‌ర్లో ”నాయినా… ఇలా చేయ‌డం త‌ప్పు..” అని చెప్పి ఇంటికి పంపేశారు. దాంతో యూత్ విచ్చల విడిగా ఆ సినిమా చూసేసింది. ఇంకేముంది.. కాసులు గ‌ల‌గ‌ల‌మ‌న్నాయి. ఇప్పుడూ సేమ్ టూ సేమ్ ప‌ద్ధతి పాటించేశాడు. ఆ సినిమానే గాలిప‌టం.

కార్తిక్(ఆది) మరియు శ్వేత(ఎరికా ఫెర్నాండెజ్) ఇద్దరూ పెళ్లి చేసుకొంటారు. ఒకే ఆఫీసులో ఉద్యోగం. బెస్ట్ క‌పుల్‌గానూ అవార్డు అందుకొంటారు. అయితే… ఇద్దరిమ‌ధ్య ఏదో ఓ గ్యాప్ ఉంటుంది. అది గొడ‌వ‌ల‌కు దారి తీస్తుంది. ఇగో స‌మ‌స్యల‌తో చిన్న చిన్న గొడ‌వ‌లే.. చినికి చినికి గాలివాన‌గా మారుతుంటాయి. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకోవ‌డానికి సిద్ధప‌డ‌తారు. వీళ్లిద్దరికీ గ‌తంలో ఓ చెరో ప్రేమ‌క‌థ ఉంటుంది. కార్తీక్, పరిణీతి(క్రిష్టినా అఖీరవా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ… పెళ్లి మాత్రం చేసుకోరు. ఆర‌వ్ (రాహుల్‌) అనే అబ్బాయి శ్వేత‌ని ఇష్టప‌డ‌తాడు. అయితే శ్వేత అత‌న్ని దూరం పెడుతుంది. కార్తీక్‌, శ్వేత విడిపోయి… మాజీ ప్రేమికుల‌ను క‌లుసుకోవాల‌న్నది ప్లాన్‌. మ‌రి ఆ త‌ర‌వాత ఏమైంది? కార్తీక్‌, శ్వేత‌లు నిజంగానే విడిపోయారా? ప‌రిణీతి, అర‌వ్ ల క‌థేంటి?? అస‌లు ఇలాంటి క‌థ‌తో ద‌ర్శకుడు ఏం చెప్పాల‌నుకొన్నాడు?? అనేదే గాలిప‌టం స్టోరీ.

సినిమాకి ర‌క్ష యువ ప్రేక్షకులే. వాళ్లని ఆక‌ట్టుకొంటే చాలు… అన్న సిద్దాంతంతో క‌థ‌లు అల్లుకొంటోంది చిత్రసీమ‌. ఇదీ అలాంటి సినిమానే. ఓ సినిమా నుంచి యూత్ ఏం ఏం కోరుకొంటోందో, అవ‌న్నీ ద‌ట్టించి సినిమా లాగించేశారు. మ‌రీ బూతు ట్యాగ్ ప‌డిపోతుందేమో అన్న భ‌యంతో చివ‌ర్లో సందేశాల పేరుతో క్లాస్ పీకారు. మొత్తానికి బ్యాలెన్స్ చేసే ప్రయ‌త్నం అయితే జ‌రిగింది. అయితే..ఎక్కువ భాగం ‘బూతు’ వైపే మొగ్గింది. దాన్ని బోల్డ్ గా చెప్పాం.. అనే క‌వ‌రింగ్ ఇచ్చుకొంటే ఇచ్చుకోవ‌చ్చు గాక‌.. కానీ బూతు బూతే.

యువ‌త‌రం త‌మ గీత‌ని ఎప్పుడో దాటేసింది. సెక్స్‌, మందు కొట్టడం, మాన‌వ సంబంధాల్ని చాలా లైట్‌గా తీసుకోవ‌డం, సంప్రదాయాల మీద బొత్తిగా న‌మ్మకం లేక‌పోవ‌డం ఇవ‌న్నీ ఈ సినిమాలో సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశారు. యువ‌త స‌మ‌స్యల్ని ఆవిష్కరిస్తూనే వాళ్లకు అర్థమ‌య్యే రీతిలో (అంటే.. కాస్త మ‌సాలా జోడించి) చెప్పే ప్రయ‌త్నం చేశారు. సో… యూత్ వ‌ర‌కూ ఈ సినిమా ఎంజాయ్ చేసేస్తారు. తెర‌పై క‌నిపించే కొన్ని పాత్రలు మ‌న స‌మాజాన్ని ప్రతిబింబిస్తుంటాయి. అయితే స‌మాజం అంతా ఇలానే కుళ్లిపోయింది అనుకోవ‌డం కూడా పొర‌పాటే. తెల్లకాగితం మీద ఓ మ‌చ్చ ప‌డితే.. మొత్తం కాగితమే ప‌నికి రాద‌ని ఎలా డిసైడ్ చేస్తారు..?? ఈ సినిమా కూడా అంతే. లోకంలో యువ‌త అంతా ఇలా పాడైపోతున్నట్టు.. సెక్స్ త‌ప్ప మ‌రో యావ లేన‌ట్టు చూపిస్తారు. మొగుడూ పెళ్లాల మ‌ధ్య ఓ స‌న్నివేశం అయితే… మ‌రీ బోల్డ్ గాఉంటుంది. నాకు రోజు అది కావాల‌నిపిస్తుంటుంది.. నువ్వేమో అటు తిరిగి ప‌డుకుంటావ్‌..? అని అడ‌గ‌డం ఓ ఉదాహ‌ర‌ణ మాత్రమే.

క్లైమాక్స్‌లో కూడా ద‌ర్శకుడు, ర‌చ‌యిత ఇద్దరూ కాస్త త‌త్తర‌ప‌డ్డారు. ముగింపు చాలామందికి జీర్ణంకాదు. బ‌హుశా ఈ క‌థ‌లో ఇదే కొత్త మ‌రియు బోల్డ్ పాయింట్ అని వారిద్దరూ భావించి ఉంటారు. ప‌తాక స‌న్నివేశాల్ని కాస్త మార్చుకొనుంటే.. బాగుండేది. ఆ క్లైమాక్స్ ఎంత‌మందికి న‌చ్చుతుంది అనే విష‌యాన్ని బ‌ట్టే ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

ఆది బాగానే చేశాడు. ఇలాంటి క్యారెక్టర్ అత‌నికి చాలా కొత్త. ఆ కొత్తద‌నాన్ని ఆస్వాదించిన‌ట్టే క‌నిపించాడు. హీరోయిన్లు ఇద్దరూ ఓకే. రాహుల్ న‌ట‌న‌లో ఎలాంటి మార్పూ లేదు. ఇంత‌కు ముందు సినిమాల్లో ఎలా న‌టించాడో.. ఇందులోనూ అంతే. జ‌బ‌ర్‌ద‌స్త్ కామెడీ గ్యాంగ్‌ని బాగానే ఉప‌యోగించుకొన్నారు. సాంకేతిక విష‌యానికి వ‌స్తే… సంప‌త్‌నంది రాసుకొన్న మాట‌లు బాగా పేలాయి. కొన్ని చోట్ల శ్రుతిమించిన‌ట్టు అనిపించినా, యువ‌త‌కు కిక్ ఇస్తుంది. ద‌ర్శకుడు ఈ సినిమాని బాగానే డీల్ చేసినా… సెకండాఫ్‌లో తేలిపోయాడు. క‌థ‌ని బాలెన్స్ చేయ‌డంలో త‌డ‌బడ్డాడు. మిగిలిన‌దంతా ఓకే. యువ‌త‌కు న‌చ్చేలా.. వాళ్లే మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్‌కి వ‌చ్చేలా జాగ్రత్త ప‌డ్డారు. భీమ్స్ అందించిన బాణీలు బాగున్నాయి. అవీ మాస్‌, యువ‌త‌కు న‌చ్చేవే. ఛాయాగ్రహ‌ణం నీట్‌గా ఉంది.

నూటికి నూరుపాళ్లూ యువ‌త‌కు గాలం వేయ‌డానికి తీసిన సినిమా ఇది. ఆ విష‌యంలో చిత్రబృందం స‌క్సెస్ కొట్టొచ్చు. అయితే ఫాస్ట్ ఫుడ్‌లాంటి ఈ సినిమా పెద్దల‌కు ఎంత వ‌ర‌కూ న‌చ్చుతుంది అనేదే ప్రశ్నార్థకం.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.