రివ్యూ: గ్రీన్ సిగ్న‌ల్‌

green
గే గోల..బూతు జోల..గ్రీన్ సిగ్నల్ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5

నాలుగు రెచ్చగొట్టే సీన్లు, అరడజను బూతు జోకులు, మరో జత కంగాళీ సీన్లు కలిపి చుట్టేస్తే చాలు, కుర్రాళ్లు థియేటర్ల ముందు క్యూకట్టేస్తారని మన సినిమా జనాలు కొందరికి అపార నమ్మకం. ఇలాంటి వాళ్ల బ్రాండ్ నే ఇప్పుడు మారుతి ప్రెజెంట్స్ అని కూడా ముద్రేసారు. హిందీ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది, దానికి తమ తాలూకా పైత్యం జోడించి తీసిన సినిమా గ్రీన్ సిగ్నల్. హాయిగా బ్యాచులర్ లైఫ్ గడిపేస్తున్న కుర్రాళ్లు ప్రేమలో పడితే వచ్చిన ఇబ్బందులు ఏమిటి? పర్యవసానం ఏమిటి అన్నది ఈ సినిమా లైన్.

నలుగురు కుర్రాళ్లు ఓ రూమ్ లో వుంటారు.వీరిలో ఓ కుర్రాడు జాలీ టైపు,.భర్త తన తో ఎక్కువగా గడపడం లేదని అసంతృప్తి చెందుతున్న అతివను తన దాన్ని చేసుకుని, ఆమె సోమ్ముతో సోకు చేస్తుంటాడు. ఇంకో కుర్రాడు ఓ అమ్మాయితో కలిసి ఒకే ఫ్లాట్లో వుండి, నానా పాట్లు పడుతుంటాడు. ఇంకో కుర్రాడు అతి బుద్ధిమంతుడు. ఓ అమ్మాయిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఆ అమ్మయి ఇతగాడిని స్పేర్ బండి గా వుంచుకుని, తన ఖర్చులన్నీ అతడికి అంటగట్టేస్తుంటుంది. ఇంకొ కుర్రాడు గే. వాడికి ఓ గే ఫ్రెండ్. వాళ్ల మధ్య మరో గే. వీళ్ల గోల వాళ్లది. ఇలాంటి వ్యవహారాలు ఏ తీరాలకు చేరాయన్నది మిగిలిన కథ

సినిమా బేసిక్ లైన్ ఓకె. కానీ ఇప్పటికే ఈ వ్వవహారాలన్నీ సవాలక్ష యూ(బూ)తు సినిమాల్లో చూసేసాం. అమ్మాయిలు అబ్బాయిలను బకరా చేయడం, అమ్మాయిలతో అబ్బాయిలు, ‘అందు’కోసమే స్నేహం చేయడం అన్నీ తెలుగుతెరను ఇప్పటికే పావనం చేసేసాయి. ఇది మరో సినిమా అంతే. సినిమాలో కథ ప్రేక్షకులకు రీచ్ అవదు. అసలు సినిమా చూస్తుంటే, అందులో కథ అనే పదార్థం వుందని అనిపించదు. సీన్ల తరువాత సీన్లు వచ్చి కదలిపోతుంటాయంతే. పైగా ఈ సీన్లన్నింటినీ గుదిగుచ్చుతూ, ఓ సన్యాసుల మూక ఒకటి. కేవలం సినిమాను గోవా తీసుకెళ్లడానికి వేసిన ఎత్తుగడ, ఆపై మళ్లీ అక్కడ సినిమా తొక్కిన పక్కదార్లు, అక్కడినుంచి కొత్త ప్రేమ కథ పుట్టుకురావడం ఇవన్నీ ప్రేక్షకులకు అంతగా పట్టవు.

సినిమా అదృష్టం ఏమిటంటే, నటించిన కుర్రాళ్లంతా చక్కగా, అనుభవం వున్నవాళ్లలా నటించడం. అమ్మాయిలు తమ శరీరం తమది కాదని మిడ్డీలు, చెడ్డీలు వేసుకుని తెరకు వళ్లు అప్పగించడం. గే పెళ్లి చూపుల వ్యవహారం సీన్లు కంపరం కలిగిస్తాయి. దర్శకుడు విజయ్ మద్దాల రాసుకున్న డైలాగులు కూడా కొత్తగా లేవు. అమ్మాయిలు అంటే ఏమిటి? వాళ్ల ప్రేమలో పడితే మగవాడు ఎలా నాశనమైపోతాడు లాంటి పడికట్టు మాటలు అన్నీ వున్నాయి, అంతే తప్ప కొత్త కోట్ ఒక్కటీ కనిపించదు. స్వామి ఫొటోగ్రఫీ ఓకె. జెబి సంగీతం ఎలా వున్నా, సినిమానే ఆసక్తికరంగా లేనపుడు, పాటలు, వాటి ప్లేస్ మెంట్ ఎవరికి పడతాయి? కుర్రాళ్లంటే ఇలాగే వుంటారు,. వాళ్ల తరహా వున్నదివున్నట్లుచూపిస్తే, చూసేస్తారు అనుకోవడం సరికాదు. ఇలా వుండేవాళ్లు కూడా వుండొచ్చు. కానీ వారి శాతం చాలా తక్కువ.కానీ అదే ఎక్కువ అని సినిమా తీస్తే, ఒకటి రెండు సార్లు ఓకె కానీ, పదే పదే అంటే బాక్సాఫీసు దగ్గర బకెట్ తన్నేస్తాయి.

అయినా కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు అంటే ఎక్కడో ఇంకా చిన్న ఆశ మిగిలే వుండాలి. కానీ గ్రీన్ సిగ్నల్ లాంటి సినిమాలు ఆ ఆశను చంపేసి, మళ్లీ మరొకరు అలాంటి ప్రయత్నాలు చేయకుండా వుంటే అంతే చాలు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5                                                     –స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.