రివ్యూ : హార్ట్ ఎటాక్‌

Heart-Attack-movie-telugu-r

యాక్షన్ ముంచిన ల‌వ్‌స్టోరీ: హార్ట్ ఎటాక్‌ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5

పూరి జ‌గన్నాథ్ గొప్ప టెక్నీషియ‌న్‌. మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన డైరెక్టర్‌. అక్కడితో ఆగిపోలేదు. ల‌వ్‌స్టోరీలూ తీసి మెస్మరైజ్ చేశాడు. ఎప్పుడూ యాక్షన్ గోలేనా..?? అనుకొంటున్న త‌రుణంలో ఓ ప్రేమ‌క‌థ చూపించి ఆకట్టుకొంటుంటాడు. ఈసారీ అంతే! హార్ట్ ఎటాక్ అంటూ ల‌వ్ స్టోరీతో ఎటాక్ చేశాడు! నిజానికి యాక్షన్ క‌థ‌ల‌కంటే పూరి ప్రేమ క‌థ‌లే బాగా డీల్ చేయ‌గ‌ల‌డేమో. ల‌వ్ లో ఉన్న సెన్సిటీవ్ పీలింగ్‌ని నిజాయ‌తీగా ఆవిష్కరించే ప్రయ‌త్నం పూరి బాగా చేస్తాడు. ఇట్లు శ్రావ‌ణి సుబ్రహ్మణ్యం చూస్తే ఆ సంగ‌తి తెలుస్తుంది. కాక‌పోతే అత‌నిలో యాక్షన్ కంటెంట్ ఈమ‌ధ్య ఎక్కువ కావ‌డంతో, పూరి నుంచి ఆ త‌ర‌హా సినిమాల్ని ఆస్వాదించ‌డానికి అల‌వాటు ప‌డిపోవ‌డంతో – ల‌వ్ స్టోరీ + యాక్షన్ మిక్స్ చేసిన ఓ క‌థ‌ని జ‌నం ముందుకు తీసుకొచ్చాడు.. హార్ట్ ఎటాక్‌తో.

పూరి సినిమాల్లో క‌థ‌ల గురించి పెద్దగా హైరానా ప‌డ‌క్కర్లెద్దు. ఎందుకంటే అత‌ని సినిమాల్లో లైన్ త‌ప్ప క‌థ ఉండ‌దు కాబ‌ట్టి. హార్ట్ ఎటాక్ లో ఉన్న ఆ లైన్ ఏంటంటే.. వ‌రుణ్ (నితిన్‌) అనాథ‌. బంధాలంటే పెద్దగా న‌మ్మకం లేదు. ఓ ట్రావెల‌ర్లా ప్రపంచం మొత్తం చుడుతుంటాడు. వెళ్లిన చోట పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కొని – అక్కడ కొన్ని రోజులు గ‌డిపి – మ‌రో ప్రాంతానికి వెళ్లిపోవ‌డం అత‌ని అల‌వాటు. ఓసారి స్పెయిన్ వెళ్తాడు. అక్కడికి ఇండియా నుంచి హాయాతి (ఆదా శ‌ర్మ‌) వ‌స్తుంది. త‌న స్నేహితురాలి ప్రేమ క‌థ సుఖాంతం చేయ‌డానికి. హాయాతిని తొలిచూపులోనే ఇష్టప‌డ‌తాడు. ఓ గంట డీప్ కిస్ ఇవ్వమ‌ని ప్రపోజ‌ల్ పెడ‌తాడు. హాయాతికి తిక్కరేగుతుంది. దాంతో ఇద్దరి మ‌ధ్య చిలిపి త‌గాదా మొద‌ల‌వుతుంది. వ‌ద్దు వ‌ద్దంటూనే వ‌రుణ్‌ని ఇష్టప‌డ‌డం మొద‌లెడుతుంది. కానీ ఆ సంగ‌తి చెప్పదు. హాయాతి స్నేహితురాలి పెళ్లిని త‌న తెలివితేట‌ల‌తో జ‌రిపిస్తాడు. దాంతో వ‌రుణ్‌పై మ‌రింత ప్రేమ పెంచుకొంటుంది హాయాతి. కానీ వ‌రుణ్ మాత్రం… మ‌న బంధం ఒక్క ముద్దు వ‌ర‌కే అంటాడు. ఆ ముద్దుకీ ఒప్పుకొని ఓ ష‌ర‌తు పెడుతుంది హాయాతి. ఆ ష‌ర‌తు ఏమిటి? అస‌లు హాయాతి ఎవ‌రు? గోవాలోని కిడ్నాప్ గ్యాంగ్ ఈ ప్రేమ క‌థ‌లో ఎలా ఎంట‌ర్ అయ్యారు?? అన్నది హార్ట్ ఎటాక్ క‌థ‌.

లవ్ స్టోరీ అన‌డం కంటే ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ అంటే బెట‌ర్‌! ప్రేమ కంటే ఆ జంట మ‌ధ్య భావోద్వేగాల‌ను పండించ‌డానికే పూరి ఎక్కువ‌గా ఇష్టప‌డ్డాడు. దాంతో పాటు.. త‌న మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ని జోడించ‌డం మ‌ర్చిపోలేదు. ప్రేమ‌, సంగీతం, యాక్షన్ ఈ మూడింటి మేళ‌వింపు తెర‌పై చూపించ‌డానికి తాప‌త్రయ‌ప‌డ్డాడు పూరి. చిన్న క‌థ‌ని టెక్నిక‌ల్ వ్యాల్యూస్ జోడించి తీర్చిదిద్దడంలో త‌న వంతు స‌ఫ‌లీకృతుడ‌య్యాడు, ఎలాంటి ఫ్లాష్ బ్యాక్‌లూ, ఇంట్రవెల్ ట్విస్టులూ లేకుండా నేరుగా క‌థ‌లోకి వెళ్లిపోయి లేని పోని గంద‌ర‌గోళానికి దూరం చేశాడు పూరి. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. కాక‌పోతే ఊహించ‌ని ట్విస్టులూ, భ‌యంక‌ర‌మైన మ‌లుపులూ ఈ సినిమాలో ఉండ‌వు. తెలిసిన కథే, తెలిసిన రీతిలో, కాస్త అందంగా తీయ‌డం వైపే మొగ్గు చూపించాడు. ఫ‌స్టాఫ్ లో ఉన్న వేగం – సెకండాఫ్‌లో క‌నిపించ‌దు. క‌థ బ‌ల‌హీనంగా ఉండ‌డంతో… ఈ స‌మ‌స్య వచ్చింది. దాంతో పాటు పూరి త‌ర‌హా పంచ్ డైలాగులూ ఇందులో మిస్ అయ్యాయి. రొటీన్ క్లైమాక్స్ కూడా ఈ సినిమాకి ఓ మైన‌స్‌.

హిట్ ఇచ్చే కాన్పిడెన్సే వేరు. వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టిన జోష్ నితిన్ మొహంలో క‌నిపించింది. ఈ సినిమాలో ఎప్పట్లానే హుషారుగా న‌టించేశాడు. మాస్ డైలాగులు బాగా ప‌లికాడు. దానికితోడు స్టైలీష్ గా ఉన్నాడు. ఈ సినిమాతో అత‌నికి లేడీ ఫాలోయింగ్ పెరిగే అవ‌కాశం ఉంది. అయితే డాన్సులు చేసే అవ‌కాశం మాత్రం రాలేదు. ఈ విష‌యంలో నితిన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ ప‌డే అవ‌కాశం ఉంది. ఆదాశ‌ర్మకి ఇదే తొలి చిత్రం. ఎక్కడా ఇబ్బంది ప‌డ‌లేదు. చూడ్డానికి అందంగా క‌నిపించింది. డ‌బ్బింగ్ ఎవ‌రు చెప్పారో గానీ బాగానే సూటైంది. అలీ, బ్రహ్మానందం న‌వ్వించ‌డానికి త‌మ వంతు ప్రయ‌త్నాలు చేశారు. బ్రహ్మీతో చేయించిన‌ టైటానిక్ ఎపిసోడ్ కాస్త న‌వ్విస్తుంది. ఈ సినిమాలో ఎంట‌ర్ టైన్ మెంట్ కాస్త త‌క్కువే. సెకండాఫ్‌లో అదీ లేదు. యాక్షన్ ఎపిసోడ్స్ పూరి త‌నదైన శైలిలోనే తెర‌కెక్కించాడు. యాక్షన్ ప్రియుల‌కు ఈ సినిమా న‌చ్చే అవ‌కాశం ఉంది.

సాంకేతికంగా అమోల్‌రాథోడ్ కెమెరాప‌నిత‌నం ఓ హైలెట్‌. స్పెయిన్ గోవా అందాల్ని బాగా చూపించాడు. ఇక అనూప్ గురించి చెప్పుకోవాలి. నితిన్ సినిమా అన‌గానే అనూప్ రెచ్చిపోతుంటాడు. ఈ సినిమాలోనూ మంచి పాట‌ల్ని అందించాడు. నేప‌థ్య సంగీతం కూడా మెచ్చుకొనే రీతిలోనే సాగింది. సెకండాఫ్ డ‌ల్ అవ్వడం, ఎంట‌ర్టైన్‌మెంట్ లేక‌పోవ‌డం, రొటీన్ క‌థ‌.. ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్‌కి భారంగా మారింది.

పూరి సినిమాల్లో ప్రధాన లోపం క‌థ‌. ఈ సినిమాలోనూ అదే రిపీట్ అయ్యింది. ఓ సినిమాని స్టెలీష్ గా, అందంగా తీర్చిదిద్దడానికి చూపించే శ్రద్ధ క‌థ విష‌యంలోనూ పెట్టుంటే ఇంకాస్త మెరుగైన ఫ‌లితం ద‌క్కేది. ఇప్పటికైనా ఫ‌ర్లేదు. యాక్షన్ ప్రియుల‌నూ, యూత్‌ని టార్గెట్ చేసిన ఈ సినిమా… వాళ్లకు చేరువ‌య్యే అవ‌కాశం ఉంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here for English Review