రివ్యూ : కెవ్వుకేక

kevvu-keka-telugu-movie-reviews-ratingsతెలుగుమిర్చి రేటింగ్‌ : 2.5/5Click here for English Review |

న‌వ్వుల్లేక‌… గావుకేక‌
కెవ్వు కేక‌

న‌వ్వించ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కేం కాదు. అబ్బో చాలా ఫీట్లు చేయాలి. ఫ్రీగా ఎస్సెమ్మెసు జోకులు పంచుకొనే కాలం ఇది. యాభై రూపాయ‌లు పెట్టి థియేట‌ర్‌ కి వెళ్లామంటే క‌నీసం యాభై జోకులైనా ఆశిస్తాం… అదీ న‌రేష్ సినిమా కాబట్టి. పాపం ఈ అల్లరోడు కూడా చాలా జాగ్రత్తగానే సినిమాలు తీసుకొంటూ ఉంటాడు! పంచ్‌ లూ, పేర‌డీలూ, పాత జోకుల‌కు కాస్త రిపేరు చేసి కొత్తగా న‌వ్వించే ప్రయ‌త్నాలు య‌ధావిధిగా చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయ‌న్నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది. అదే కెవ్వుకేక‌! హిట్ సినిమాలోని పాపుల‌ర్ పాట టైటిల్‌ గా పెట్టుకొన్నారు – ప‌రిశ్రమ‌లో ఉద్దండులైన హాస్యన‌టుల్ని తీసుకొన్నారు! దానికి తోడు.. బ్లేడు బాబ్జీతో హిట్టిచ్చిన దేవి ప్రసాద్‌తో కాంబినేష‌న్ సినిమా. మ‌రి కెవ్వుకేక ఏ రేంజులో ఉంది??

బుచ్చిరాజు ( అల్లరి న‌రేష్ ) క‌ళానికేత‌న్‌ లో సేల్స్‌మెన్‌. మ‌హాల‌క్ష్మిలోని అమాయ‌క‌త్వానికి, అందానికీ తొలి చూపులోనే ప‌డిపోతాడు. కానీ మ‌హాల‌క్ష్మి నాన్న సుబ్బారావు (ఎమ్మెస్‌)కి డ‌బ్బు పిచ్చి. తాను కోటీశ్వరుడు కావాలంటే.. త‌న కూతురికి మ‌రో కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లిచేయాల్సిందే అనుకొంటాడు. అందుకు త‌గిన సంబంధాలు కూడా చూస్తుంటాడు. అందుకే మహ‌ల‌క్ష్మి త‌న నాన్నకు అబ‌ద్ధం చెబుతోంది. బుచ్చిని క‌ళానికేత‌న్‌ కి య‌జ‌మానిగా ప‌రిచ‌యం చేస్తుంది. గ‌తి లేక ఇది అబ‌ద్ధాన్నికొన‌సాగిస్తాడు బుచ్చిబాబు. కానీ… బుచ్చి ఓ సేల్స్‌ మెన్ అనే సంగ‌తి సుబ్బారావుకి తెలిసిపోతుంది. దాంతో ఆయ‌న అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. ఆత్మహ‌త్యా ప్రయ‌త్నం కూడా చేస్తాడు. ఒకానొక ఎమోష‌న‌ల్ పాయింట్ ద‌గ్గర మ‌హాల‌క్ష్మి.. త‌న తండ్రికి మాటిస్తుంది. అదేంటంటే.. ఆరు నెల‌ల్లో బుచ్చిబాబు కోటీశ్వరుడు అవుతాడని – లేదంటే ఇంట్లో చూసిన సంబంధాన్ని చేసుకొంటాన‌ని తండ్రికి మాటిస్తుంది. ప్రియురాలి కోసం.. బుచ్చిబాబు ఛాలెంజ్‌ ని స్వీక‌రిస్తాడు. మ‌రి ఆ డ‌బ్బు ఎలా సంపాదించాడు? అనేదే ఈ సినిమా క‌థ‌.

ఇదీ ఓ క‌థేనా..? ఎన్ని సినిమాల్లో చూళ్లేదు..? అనుకొంటున్నారా? భ‌లేవారే. న‌రేష్ సినిమాల్లో ఈ మాత్రం క‌థ ఉండ‌డం గ్రేటే. క‌థ లేక‌పోయినా కామెడీ పంచ్‌ లూ, డైలాగుల‌తో సినిమాని నెట్టుకొచ్చేద్దాం అనుకొంటాడు. ఈసారి స‌తీష్ వేగేశ్న పెన్నులు, కాగితాల‌కూ పని క‌ల్పించి ఈ మాత్రం క‌థైనా రాసుకొన్నాడు. ఇక ఇంట్రవెల్ అయిపోయిన త‌ర‌వాత చూడాలి. క‌థ బ్యాంకాక్ షిష్ట్ అవుతుంది. అక్కడ మ‌నోడు డ‌బ్బు సంపాదించాలి క‌దా?? అందుకే అక్కడున్న బిగ్ షాట్ (ఆశిష్ విద్యార్థి)ని కిడ్నాప్ చేస్తాడు. అదంతా ఓ పెద్ద ప్రహ‌స‌నం. చివ‌రికి ఎలాగోలా డ‌బ్బు సంపాదించి శుభం కార్డు వేసుకొంటారు.

ఫ‌స్టాప్ కాస్త నిదానంగా, ఇంకాస్త న‌వ్వుల‌తో సాగిపోతుంది. అక్కడ‌క్కడా న‌రేష్ సినిమా తాలుకూ ఛ‌మ‌క్కులు క‌నిపిస్తుంటాయి. న‌రేష్ కోటీశ్వరుడు అనే అబ‌ద్దాన్ని నిజం అని న‌మ్మించే ప్రయ‌త్నం, చిరుగుల కోటు వేసుకొని ఫంక్షన్‌కి వెళ్లడం, చిరిగిన వెంట‌నే ధ‌న్‌ రాజ్ రెడీమెడ్‌ గా కుట్లు వేయ‌డం – ఇవ‌న్నీ ఫ‌న్నీగా సాగిపోతాయి. అయితే ఒకొక్క స‌న్నివేశం… క‌నీసం నాలుగైదు నిమిషాలైనా అలా..సాగి.. పోతుంటుంది. మ‌ధ్య మ‌ధ్యలో దూసుకొచ్చే ఒక‌ట్రెండు జోకుల కోసం…. ఓపిగ్గా ఆ సీన్ అంతా చూడాల్సిందే.

ఇంట్రవెల్ వ‌ర‌కూ సినిమాకి క్షమించేయొచ్చు. కానీ ఆ త‌ర‌వాత చూడాలి మ‌హాప్రభో.. కామెడీ పేరు చెప్పి – వెండి తెర‌నీ, థియేట‌ర్‌ లో కూర్చొన్న ప్రేక్షకుల మ‌న‌సుల్ని క‌క‌లావిక‌లం చేసేశారు. సాధార‌ణంగా ఇలాంటి కామెడీ సినిమాల్లో అలాంటి దొంగ కిడ్నాప్ ఉదంతాల‌ను చాలా చూశాం. అవన్నీ చిన్న చిన్న సీన్‌ లుగా ముగించేవారు. కానీ ఆ చిన్న ముక్కని ప‌ట్టుకొని సినిమా అంతా లాగారు. సినిమాల్లేక ఖాళీగా ఉన్న గ్యాంగ్‌ ని ఇందులో ఇరికించేశారు. ఎలాగూ పెట్టాం క‌దా.. అని వాళ్లకో సీన్ రాసుకొన్నారు. రాసుకొన్నాం క‌దా.. అని తీసిప‌డేశారు. దాంతో నిడివి.. అలా అలా పెరిగిపోయింది. క‌థ అక్కడే ఉంటుంది. ఎక్కడికీ క‌ద‌ల‌దు. దాని చుట్టూ.. ఓ న‌ల‌భై క్యారెక్టర్లు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ – ప్రేక్షకుల క‌ళ్లు తిరిగేలా చేశాయి. దాంతో నాలుగైదు సినిమాలు చూశామ‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.

న‌రేష్ డిటో.. బ్రహ్మాండంగా చేశాడు. అత‌ని టైమింగ్‌ ని త‌ప్పుపడితే నేర‌మూ, ఘెర‌మూ. కాక‌పోతే ఏ క‌థ ప‌డితే ఆక‌థ ఒప్పుకోకూడ‌దు. క‌థ‌లో కాస్త ప‌ట్టుంటే ఎన్ని జిమ్మిక్కులైనా చేయొచ్చు. రొటీన్ కథ‌తో ఇలాంటి తిప్పలు త‌ప్పవు. `ఈవిడెవ‌రు.. పార్క్‌ లో చ‌న‌క్కాయ‌లు అమ్ముకొంటుందా..?` అంటాడు కృష్ణభ‌గ‌వాన్‌. ఈ సినిమాలో హీరోయిన్‌ ని చూసి. మ‌రీ అంతలా లేక‌పోయినా – మ‌హాగొప్పగా అయితే ఏం లేదు. దూరం నుంచి చూసి స‌ర్దుకుపోవ‌చ్చు. ఎక్స్‌ ప్రెష‌న్స్ చూద్దాం అని ద‌గ్గర‌కెళ్తే – ద‌డ‌ద‌డ‌లే. ఆమె మొహంలో ఒక్క ఫీలింగూ స‌రిగా ప‌ల‌క‌లేదు. కృష్ణభ‌గ‌వాన్‌, అలీ, ఎమ్మెస్‌, చ‌ల‌ప‌తిరావు, జీవా – ఇలా చెప్పుకొంటూ పోతే ఈ సినిమాలో చాలామంది ఉన్నారు.కానీ ఏం లాభం…? ఎవ‌రిదీ స‌రైన క్యారెక్టర్ కాదు.

ఈ సినిమా కెవ్వు కేక‌రా బాబు.. అని ప్రేక్షకులు అనుకోవాలి. వాళ్లు అనుకొంటారో లేదో అని అయిదు నిమిషాల‌కోసారి `కెవ్వు కేక‌లా ఉంది..` అని పాత్రధారుల‌చేతే అనిపించారు. క‌నీసం ఆ ప‌దం.. ఓ డ‌జ‌నుసార్లైనా వినిపించింది. టైటిల్ జ‌స్టిఫికేష‌న్ అదేనేమో..? భీమ్స్ – చిన్నిచర‌ణ్ పాట‌లు న‌రేష్ సినిమా తగిన‌ట్టే ఉన్నాయి. చివ‌ర్లో ముమైత్ ఖాన్ మెరిసినా ఆమెను చూసే ఓపిక అప్పటికి న‌శించిపోతుంది.

న‌రేష్ సినిమాకి న‌వ్వుకోవ‌డానికే వెళ్తారు. క‌నీసం సీన్‌ కి ఒకసారి న‌వ్వించినా చాలు. కానీ ఆ ప్రయ‌త్నం ఈ సినిమాలో స‌వ్యంగా జ‌ర‌గ‌లేదు. ఏదో.. న‌వ్వాలేమో అనుకొని న‌వ్వుకొన్నారు త‌ప్ప‌… మ‌న‌స్ఫూర్తిగా, క‌డుపు చెక్కల‌య్యే రేంజులో ఒక్కసారీ న‌వ్వురాదు. ఈమ‌ధ్య న‌రేష్ సినిమాల్లో కామెడీ డోసు త‌క్కువైన సినిమా ఇదేనేమో..? ఆ త‌ప్పంతా ద‌ర్శకుడు, మాట‌ల ర‌చ‌యిత‌దే. పంచ్‌ ల విష‌యంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని, స్ర్కిప్టును షార్ప్ చేసుకొంటే ఫ‌లితం ద‌క్కేది.

తెలుగు మిర్చి రేటింగ్స్: 2.5/5                                                –  స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Review