రివ్యూ: కొత్త‌జంట‌

kottha-janta
క‌థ పాత‌దేనంట‌…. కొత్తజంట‌: తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5

నిర్మాత‌ల‌కు నాలుగు డ‌బ్బులు మిగిల్చే సినిమాలు తీశాడు మారుతి. ఎవ‌రూ కాద‌లేని నిజం. ఇంకా ప‌చ్చి నిజం ఏమిటంటే… ఆ విజ‌యాల మాటున బూతు ఉంది. బూతు చూపించి సొమ్ము చేసుకొన్నాడ‌న్న అప‌వాదు ఉంది. దాన్ని ఎలాగైనా స‌రే.. చెరిపేసి, క్లీన్ సినిమాలు నేనూ తీయ‌గ‌ల‌ను అని నిరూపించాల‌నుకొన్నాడు. క్లీన్ సినిమా అన‌గానే.. మ‌ళ్లీ అత‌నికి ప్రేమ క‌థే గుర్తొచ్చింది. అందులో ఎలాగూ ప‌ట్టు చేజిక్కింది కాబట్టి.. దానికి కామెడీ పూత పూసి, క్లాస్ ట‌చ్ ఇచ్చి.. ఇది వ‌ర‌కు జ‌రిగిన త‌ప్పిదాలు స‌రిదిద్దుకొందామ‌నుకొన్నాడు. ఆ సినిమానే కొత్త జంట‌. మ‌రి కొత్త‌.. అని పేరు పెట్టిన ఈ సినిమాలో కొత్త విష‌యాలేం ఉన్నాయి? మారుతి త‌న ల‌క్ష్యాన్ని చేరుకొన్నాడా? అందుకోసం ఏం చేశాడు? అనేది తెలుసుకోవాంటే రివ్యూ చ‌దివేయాల్సిందే.

క‌థ‌లోకి వెళ్తే.. శిరీష్ (అల్లు శిరీష్‌) ప‌క్కా స్వార్థ ప‌రుడు. డ‌బ్బుల‌కు త‌ప్ప బంధాల‌కు చోటివ్వడు. అచ్చం ఇలాంటి ల‌క్షణాలే సువ‌ర్ణ (రెజీనా)లోనూ ఉంటాయి. ఇద్దరూ ఒకే టీవీ ఛాన‌ల్‌లో ప‌ని చేస్తుంటారు. ఆ టీవీ ఛాన‌ల్ రేటింగులు పెంచ‌డానికి కొత్తజంట అనే ఓ పోగ్రాం చేస్తారు. దానికి విప‌రీత‌మైన మైలేజీ వ‌స్తుంది. ఈలోగా శిరీష్ కి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌స్తుంది. ఆ ఆఫ‌ర్ నిల‌బెట్టుకొంటే ఓ టీవీ ఛాన‌ల్‌లో భాగ‌స్వామి కావ‌చ్చు. అయితే దానికి సువ‌ర్ణ స‌హాయం కావాలి. మామూలుగా అడిగితే నో చెబుతుంద‌ని తెలిసి…. ముందు ఐ ల‌వ్ యూ అని ముగ్గులోకి దింపుతాడు. త‌ర‌వాత‌… ప్రేమ కోసం తాను చెప్పిన‌ట్టు సువ‌ర్ణ చేస్తుంద‌నుకొంటాడు. అయితే సువ‌ర్ణ మాత్రం శిరీష్‌ని సిన్సియ‌ర్‌గానే ప్రేమిస్తుంది. ఎప్పుడూ త‌న స్వార్థం కోస‌మే ఆలోచించే సువ‌ర్ణ తొలిసారి… శిరీష్ గురించి ఆలోచిస్తుంది. అయితే శిరీష్ త‌న‌ని ప్రేమిస్తోంది కేవ‌లం స్వార్థం కోస‌మే అని తెలిసి ఛీ కొట్టి వెళ్లిపోతుంది. అలా విడిపోయిన ఈ ఇద్దరూ మ‌ళ్లీ ఎలా క‌లుసుకొన్నారు? అన్నదే కొత్త జంట క‌థ‌.

ల‌వ్ స్టోరీలో కొత్త లైన్లేవీ పుట్టుకురావు. పాత‌వే మ‌ళ్లీ తిర‌గేసి, మ‌ర‌గేసి వాడుకోవాలి. మారుతి కూడా అదే చేశాడు. కొత్త జంట‌లో చూసిన లైను పాత‌దే. ఇంచుమించు ఇలాంటి క‌థ‌తోనే 100% ల‌వ్ వ‌చ్చింది. మొన్నొచ్చిన ఆహా క‌ల్యాణం ఛాయ‌లూ ఈసినిమాలో క‌నిపిస్తాయి. అలాంట‌ప్పుడు ట్రీట్‌మెంట్ కొత్తగా రాసుకోవాలి. ఆ విష‌యంలో ద‌ర్శకుడు మారుతి కాస్త త‌డ‌బ‌డ్డాడు. సినిమాలో వినోదం లేక‌పోతే…బండి న‌డ‌వ‌డం లేదు. అందుకే దానిపై ఎక్కువ ఫోక‌స్‌పెట్టాడు. దాని కోసం ఫ‌స్టాఫ్‌లో స‌ప్తగిరిపై, సెకండాఫ్‌లో పోసాని కృష్ణముర‌ళిపై ఆధార‌ప‌డ్డాడు. ఇద్దరూ బాగానే న‌వ్వించారు గానీ… ఆ కామెడీలో అతి ఉంది. రియాలిటీ షో నేప‌థ్యంలో ఎన్ని కామెడీ బిట్లు రాలేదు..?? కేవ‌లం వాటిని న‌మ్ముకొని ఈ సినిమా చూడ‌డం అంటే క‌ష్టమే క‌దా..??

క‌థానాయ‌కుడు ఓ స్వార్థప‌రుడు. రెండు లైన్లలో చెప్పాల్సిన ఈ పాయింట్‌.. ప్రతీ స‌న్నివేశంలోనూ ప్రేక్షకుల‌కు గుర్తు చేయాల‌ని త‌ప‌న ప‌డ్డాడు. దాంతో చూసిన సీనే మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్న ఫీలింగ్‌. ఫ‌స్టాఫ్ కాస్త స‌ప్తగిరి కామెడీతో లాగించేశారు. సెకండాఫ్‌లో మాత్రం పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. ఉన్న పాయింట్‌ని సాగ‌దీస్తూ. లేని కామెడీ ట్రాక్ పై ఆధార‌ప‌డుతూ గార‌డీ చేయాల‌ని చూశాడు. అయితే ఆ ప్రయ‌త్నం స‌ఫ‌లీకృతం కాలేదు. చివ‌ర్లో నాయ‌కానాయిక‌లు క‌లిసిపోయే స‌న్నివేశాలు, ఆ త‌ర‌వాత వ‌చ్చే ఫైట్ కూడా కృత్రిమంగానే ఉంది. క్లాస్ ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకోవ‌డం కోసం ఓ క‌థ రాసుకొని.. బీసీల కోసం కొన్ని స‌న్నివేశాలు జొప్పించి.. త‌న మార్క్ డ‌బుల్ మీనింగ్ డైలాగులు అక్కడక్కడ వదులుతూ.. మొత్తానికి ఎవ‌రికీ కాకుండా చేశాడు మారుతి.

గౌర‌వంతో ఎంట్రీ ఇచ్చాడు శిరీష్‌. ఇది రెండో సినిమా. ఒక్క సినిమాకే మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. అత‌ని మైన‌స్‌ల‌ను క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేసే ప్రయ‌త్నం భారీ ఎత్తున జ‌రిగింది. న‌ట‌న‌లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అయితే చ‌లాకీ పాత్రలిస్తే ఏం చేస్తాడ‌న్నది ఇంకా తెలీదు. ఎందుకంటే ఈసినిమాలో ఒక్క స‌న్నివేశంలోనూ హుషారుగా క‌నిపించ‌లేదు. రెజీనా న‌ట‌న‌, ఆమె హావ‌భావాలూ, ఆ పాత్రని చూపించిన తీరూ చాలా బాగున్నాయి. ఓ హిట్ దొరికితే క‌చ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుంది. సినిమా అంత‌టికీ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. స‌ప్తగిరి మ‌రోసారి బాగా న‌వ్వించాడు. పోసాని కూడా. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు. మారుతి సినిమాల్లో క‌నిపించే గ్యాంగ్ ఇందులోనూ తళుక్కుమంటుంది.

జెబి అందించిన పాట‌లు బాగున్నాయి. ఆర్‌.ఆర్ కూడా. మారుతి సినిమాల్లో క్వాలిటీకి కొద‌వ ఉండ‌దు. దానికి తోడు గీతా ఆర్ట్స్ బ్యాన‌రాయె. అందుకే నిర్మాణ విలువ‌ల విష‌యంలో ఎక్కడా రాజీ ప‌డ‌లేదు. క‌థ‌, మాట‌లు, ద‌ర్శకత్వం ఇలా కీల‌క విభాగాలు నెత్తిమీద పెట్టుకొన్న మారుతి.. దేనికీ పూర్తి న్యాయం చేయ‌లేదు. పాత క‌థ‌ని తీసుకొన్నాడు స‌రే.. కొన్ని కొత్త స‌న్నివేశాలు రాసుకొన్నా బాగుండేది. మాట‌ల్లో బూతులు బాగా త‌గ్గించేశాడు. తానూ ఓ క్లీన్ మూవీ తీయ‌గ‌ల‌ను అని నిరూపించుకొన్నాడు.

కాస్త వినోదం, మంచి పాట‌లు, కొన్ని సీన్స్‌… అన్నిటికంటే అటు అమ‌లాపురం రీమిక్స్ పాట‌. వీటికోస‌మైతే కొత్త జంట చూడొచ్చు. అలాంటి కామెడీ బిట్లు కొన్ని రోజులు పోతే టీవీలో వేసేస్తారు అనుకొంటే లైట్ తీసుకోవచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5                                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు