రివ్యూ : మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు

mallela-theeramlo-sirimalle-puvvu-telugu-movie-review-ratingనిస్సందేహంగా ఓ మంచి సినిమా! తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.5/5

మంచి సినిమా చిరునామా ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఎందుకంటే సినిమాను చాలా మంది చాలా రకాల కారణాలతో చూస్తారు కాబట్టి, వారి వారి అభిరుచుల మేరకు ఆ మంచి చెడ్డలు ఆధారపడి వుంటాయి. అయితే సెల్యులాయిడ్ పైకి మానవ సంఘర్షణలను, వ్యక్తిత్వ చర్చలను తీసుకొచ్చి, కాస్సేపు ఆలోచించేలా చేయగలగడం, సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని ప్రేమ్ కట్టించుకునేలా తీర్చిదిద్దడం, రణ గొణ ధ్వనులే సంగీతం అనుకుంటున్న వేళ, మంద్రస్థాయిలో మంత్రముగ్ధుల్ని చేయడం వంటి లక్షణాలున్నాయి కాబట్టి ‘మల్లెల తీరంలో సిరిమల్లెపూవు’ సినిమాను మంచి సినిమాల కేటగిరిలోకి చేర్చవచ్చేమో? నిజానికి ఈ సినిమాకు తొలుత పెట్టిన పేరు ‘మల్లెల తీరం’. కానీ సీతమ్మ వాకిట్లో.. సినిమా తరువాత ఇదేదో బాగుందనుకున్నారేమో? సిరిమల్లె పూవు చేర్చారు. అది లేకుండా వుంటేనే బాగుందనిపించడం విశేషం.

రామ్ గోపాల్ వర్మ స్కూలు నుంచి వచ్చిన రామరాజు అనే కొత్త దర్శకుడు ముగ్గురు కొత్త నటులను, ఇద్దరు కొత్త సాంకేతిక నిపుణులను తీసుకుని రూపొందించిన సినిమా ఇది. తండ్రిచాటు అమ్మాయి.. తండ్రి మంచి సంబంధం వచ్చింది.. పెళ్లి చేసుకుంటావా? అన్నాడు.. ఓకె. అంది. కుర్రాడు అందమైన వాడు. మంచివాడు, సంపాదిస్తున్నవాడు. అంతకన్న ఏం కావాలి. పైగా జాతకాలు కలిసాయి. కానీ కాపురానికి వచ్చాకే తెలిసింది ఆమెకు.. కాపురం అంటే చిన్న చిన్న సంతోషాలు, సుస్వరానికి గమకాల్లా సందడి చేయాలని, కానీ అవే కరువయ్యాయి. దాంతో ఆమె ఓ గేయ రచయితకు దగ్గరయింది. భర్త దగ్గర మిస్సయినవి అక్కడ వెదుక్కోకుండానే దొరికాయి. దాంతో ఏం చేయాలన్న సంఘంర్షణ.. తండ్రి, స్నేహితురాలు.. అందరూ భర్త అంటే అంతకన్నా ఏం చేయాలి అన్న హితబోధలు.. తనేమే.. ఇంకా ఏదో కావాలన్న తపన చివరకు ఏమయింది? ఇదీ కథ.

తండ్రిగా రావురమేష్, అమ్మాయిగా శ్రీదివ్య, భర్తగా జార్జ్, ప్రేమికుడిగా క్రాంతి, ఇవే ప్రధాన పాత్రలు. అచ్చమైన తెలుగింటి అమ్మాయి ఆహార్యం శ్రీదీవ్యకు సమకూర్చాడు దర్శకుడు. ఆఖరికి చీరలు కూడా ఆ విధంగా డిజైన్ చేయింఛాడు. భర్తగా జార్జ్ బాగా చేశాడు. ప్రేమికుడిగా క్రాంతి ఉన్న మేరకు సహజంగా చేశాడు. రావు రమేష్ తనలోని సత్తాను చూపించాడు. చాలా బ్యాలెన్స్ డ్ గా కనిపించాడు.

సినిమాకు దర్శకుడు సమకూర్చిన మాటలు, బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ, పవన్ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్లు. మనసుల్ని టచ్ చేస్తాయి చాలా మాటలు. పాటలు కూడా హాయిగా వున్నాయి.

కానీ సినిమా కాస్త వన్ సైడ్ గా నడించిందా అన్న సందేహం తలెత్తుతుంది. అమ్మాయి కోణంలో కథ నడపడం అన్నది ఆ పాత్రకు పెద్ద ప్లస్ అయింది. కానీ క్రాంతికి ఆమె పట్ల ప్రేమ ఏ మేరకు అన్నది దర్శకుడు స్పష్టం చేయలేకపోయాడు. కేవలం ఆమె చెబుతున్నట్లు తలాడించే పాత్రలామిగిలింది అది. ఇక అదే సమయంలో ప్రేక్షకులకు కథానాయిక తీసుకున్న నిర్ణయం సబబు అనిపించాలన్న తపనతో దర్శకుడు భర్తపాత్రకు కాస్త అన్యాయం చేసినట్లనిపించింది. కావాలని ఆ పాత్ర కాస్త మోతాదు మించి ప్రవర్తించేలా చేశాడానిపించింది.

ఈ ప్లస్ మైనస్ లు సంగతి అలా వుంచితే, బాపు, వంశీలా ప్రతి ఫ్రేమ్ ను పెయింటింగ్ల్లా తీర్చిదిద్దడం, బాల చందర్ లా మానసిక సంఘర్షణలను మాటల్లో పొదగడం వంటి అంశాలు, ఆ తరహా సినిమాలు నచ్చే వారికి తప్పకుండా నచ్చుతాయి. కానీ సినిమా అంటే రెండు గంటల కాలక్షేపం, పాటలు, ఫైట్లు అనుకునేవారికి అస్సలు నచ్చనే నచ్చదని చెప్పేయచ్చు.

ప్లస్ పాయింట్లు :
ఫొటో గ్రఫీ
పాటలు
మాటలు
ఆర్.ఆర్

మైనస్ పాయింట్లు :
వినోదాన్ని విస్మరించడం

చివరగా..
మల్లె విరిసింది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.5/5                                                                    మాధురి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.