రివ్యూ : మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో

malli-telugu-review                            తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5 |Click Here for English Review|

మ‌ల్లిగాడు మ‌హా బోరో.. : మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో

సినిమా అప్పుడే అయిపోయిందా – అనుకొనేలా తీస్తే క‌చ్చితంగా అది మంచి సినిమానే. ఎప్పుడైపోతుందిరా బాబూ… అని ఎదురుచూస్తే అంత‌కంటే మ‌రో న‌ర‌కం ఉండ‌దు ప్రేక్షకుడికి. దుర‌దృష్టమో, దౌర్భాగ్యమో మ‌న‌కు అలాంటి సినిమాలే ఎక్కువ‌గా వ‌స్తున్నాయిప్పుడు. అలాంటి సినిమాల్లో త‌ర‌చూ క‌నిపిస్తూ ప్రేక్షకుల‌ని హింసించే ప‌నిలో తానూ భాగం అందుకొంటున్నాడు. అలాంటి సినిమా శ్రీ‌కాంత్ నుంచి మ‌రోటొచ్చింది. అదే… ‘మ‌ల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. సినిమా చూసొచ్చిన వాళ్లంతా మ్యారేజ్ బ్యూరో కాదు, మహా బోర్ అని పెడితే బాగుంటుంది అంటున్నారంటే… ఈ సినిమా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాలా??

మ‌ల్లి (శ్రీ‌కాంత్‌)కి అర్జెంటుగా డ‌బ్బులు కావాలి. వంద‌లూ, వేలూ కాదు. ల‌క్షలు. దానికో ఫ్లాష్‌ బ్యాక్ ఉందిలెండి. ఆ డ‌బ్బులు సంపాదించ‌డం కోసం ఓ మ్యారేజ్ బ్యూరో తెరుస్తాడు. త‌న బ్యూరోలో పెళ్లిచేసుకొన్నవాళ్లకు ఓ సంవ‌త్సరం గ్యారెంటీ కూడా ఇస్తాడు. డ‌బ్బుల కోసం ఎవరిని, ఎవ‌రితో పెళ్లిచేయ‌డానికైనా మ‌ల్లిగాడు రెడీ. చిత్ర (మ‌నో చిత్ర‌)కి పెళ్లంటే ఇష్టం ఉండుదు. ఆమె మ‌న‌సు మార్చడానికి మ‌ల్లి తెగ క‌ష్టప‌డుతుంటాడు. ప్రేమ‌లో విఫ‌ల‌మైన బాబి (వెన్నెల కిషోర్‌) ఆత్మహ‌త్య చేసుకోవాల‌నుకొంటాడు. అత‌న్ని కాపాడి.. బాబి ప్రేమ‌ను గెలిపిస్తాడు మల్లి. చోటూ భాయ్ (బ్రహ్మానందం) ద‌గ్గర కూడా డ‌బ్బులు తీసుకొని.. అత‌నికో పిల్లను అంట‌గ‌డ‌దామ‌నుకొంటాడు. మ‌రి ఈ ప్రయ‌త్నాల‌న్నీ స‌ఫ‌లీకృత‌మ‌య్యాయా? మ‌ల్లి వెనుక ఉన్న క‌థేంటి? అస‌లు ఈడ‌బ్బంతా త‌ను ఏం చేస్తున్నాడ‌న్నదే ఈ సినిమా క‌థ‌.

వినోదాత్మకంగా సాగే సినిమాలో క‌థే కాదు… లాజిక్‌ లూ అవ‌స‌రం లేద‌ని న‌మ్ముతున్న రోజులివి. అందుకే… క‌థ‌ని వ‌దిలేద్దాం, లాజిక్ నీ లాగొద్దు. అయితే ఇక్కడ ప్రేక్షకుల‌కు కావ‌ల్సిన వినోదం మాటేమిటి? మాది ఫుల్ ఎంట‌ర్‌ టైన‌ర్ సినిమా అని చెప్పుకోవ‌డం త‌ప్ప‌… ఈ సినిమాలో ఎంట‌ర్‌ టైన‌రేది? తెర‌పై అర‌వై స‌న్నివేశాలు వ‌చ్చిపోతున్నప్పుడు అందులో ఒక్కటైనా రిజిస్టర్ అవ్వాలి క‌దా, క‌నీసం స‌గ‌మైనా ప్రేక్షకుల్ని న‌వ్వించాలి క‌దా? అదేం ఈ సినిమాలో క‌నిపించ‌దు. పోనీ బ‌ల‌వంతంగా న‌వ్వాల‌న్నా ఆ ఓపిక ఉండ‌దు. ఈ సినిమాలో ఉండ‌డానికి చాలామంది క‌మెడియ‌న్లు ఉన్నారు. కానీ కామెడీ మాత్రం లేదు. ర‌చ‌యిత పెన్నులో ఇంక్ అయిపోయిందో, లేదంటే క‌మెడియ‌న్లు ఉంటే కామెడీ అదే వ‌చ్చేస్తుందిలే… అని ద‌ర్శకుడు భావించాడో తెలీదుగానీ ఈ సినిమాలో న‌వ్వులు క‌ర‌వైపోయాయి. సినిమాకి మూల‌స్థంభ‌మైన కామెడీ మిస్సయిన‌ప్పుడు ప్రేక్షకుల‌కు ట్రాజ‌డీ త‌ప్ప ఏం మిగులుతుంది?

వంద సినిమాలు చేసిన శ్రీ‌కాంత్‌… క‌థ‌ల ఎంపిక‌లో ఇంకా ఎందుకు త‌ప్పట‌డుగులు వేస్తున్నాడో అర్థం కావ‌డం లేదు. ఏదో డ‌బ్బులిచ్చారు కాబ‌ట్టి న‌టించాలి అనుకొని.. స‌గం మైండ్‌ తో కెమెరా ముందుకొచ్చాడు. ఒక్కసీన్‌లో కూడా ఇన్‌ వాల్వ్ కాలేదు. క‌థ‌, క‌థ‌నాలు ఇలా ఏడిస్తే, హీరో మాత్రం ఏం చేస్తాడు చెప్పండి?? వంద సినిమాల్లో ది బెస్ట్ వ‌ర‌స్ట్ పెర్‌ ఫార్మెన్స్ ఏదైనా ఉందంటే.. అది ఇదే. హీరోయిన్ పేరుకు మాత్రమే. ఆమె నుంచి అంత‌కు మించి ఏమైనా ఆశిస్తే ఆ త‌ప్పు మీదే. బ్రహ్మానందంలాంటి దిగ్గజ న‌టుల్ని పెట్టుకొని పేల‌వ‌మైన కామెడీ సీన్స్ రాసుకొంటే ఆ త‌ప్పు ర‌చ‌యిత‌ది కానీ, బ్రహ్మానందాన్ని కాదు. ఇలాంటి సినిమాలకు కూడా నా అనుభ‌వాన్నంతా ఉప‌యోగించాలా అనుకొని, బ్రహ్మానందంలోకి క‌మెడియ‌న్ కూడా నిద్రపోయాడు. వెన్నెల కిషోర్ పాత్ర ఒక్కటే కాస్త బెట‌ర్‌.

క‌థ‌నం మ‌రీ నీర‌సంగా న‌డుస్తుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా థ్రిల్లింగ్ గా ఆస‌క్తిగా తీయ‌లేదు. దానికి తోడు చెల్లెలు సెంటిమెంట్ ఒక‌టి. అది కూడా ఫోర్స్‌డ్‌ గానే క‌నిపిస్తుంది. ఇక సాంకేతిక విష‌యాల‌కొద్దాం.. సంగీతం, ఛాయాగ్రహ‌ణం ప్రాధ‌మిక స్థాయిలోనే ఉన్నాయి. ఇదేదో మ‌హాకావ్యం.. ఎక్కడా క‌ట్ చేయ‌డానికి వీల్లేద‌న్నట్టు ఏకంగా మూడుగంట‌ల సినిమా తీసి.. ప్రేక్షకుల మీద‌కు వ‌దిలారు. ఈమ‌ధ్య సీరియ‌ల్ లే కాస్త క్వాలిటీ మెయిన్‌ టైన్ చేస్తున్నాయి. ఈ సినిమా మ‌రీ నాశిర‌కంగా తీశారు. పాట‌లు న‌ర‌కం అంచుల వ‌ర‌కూ తీసుకెళ్తాయి. డైలాగుల్లో ప‌న లేదు. మ‌ల్లిగాడి ద‌గ్గర‌కు వ‌చ్చారంటే వాళ్ల ఖ‌ర్మకాలిపోవ‌ల్సిందే.. అనే డైలాగ్ శ్రీ‌కాంత్ చేత ప‌లికించారు. అది నిజం అని సినిమా ఆసాంతం చూసిన ప్రేక్షకుడికి ఈజీగా అర్థమైపోతుంది. త‌క్కువ బ‌డ్జెట్‌ లో సినిమా లాగించేసి, దాని శాటిలైట్ హ‌క్కుల‌తో సొమ్ములు పోగేసుకొందాం అనుకొన్నప్పుడు ఇలాంటి ఆణిముత్యాలే అభిస్తాయి.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5                             – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here for English Review