రివ్యూ: మ‌నం

manam

జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం ‘మ‌నం‘: తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.5/5

గ‌త జ‌న్మ‌లో విడిపోయిన అమ్మానాన్న‌ని క‌ల‌పాల‌నుకొన్న ఓ కొడుకు..
అర్థాయిష్షుతో మ‌ర‌ణించి ఆ ఆయువు త‌న‌కు పోసిన తల్లిదండ్రుల ప్రేమ కోసం మ‌రో జ‌న్మ‌లోనూ త‌పించిన ఓ త‌న‌యుడు..
అమ్మానాన్న క‌ళ్ల ముందే ఉంటారు.. కానీ గ‌త జ‌న్మ‌లో నేను మీ కొడుకుని అని చెప్ప‌లేని ఓ నిస్స‌హాయ‌త‌..
అప్పుడు వీళ్ల ప్రేమ‌ను పొంద‌లేక‌పోయినా ఇప్పుడైనా అనుభ‌విస్తున్నాన‌న్న ఆనందం..
కొన్ని అంద‌మైన జ్ఞాప‌కాలు, వెల‌క‌ట్ట‌లేని సంతోషాలు, గుండెని త‌డిమేసే క‌న్నీళ్లు…
వెర‌సి చూస్తే మ‌నం..

కొన్ని అనుభూతుల్ని క‌థ‌గా చెప్ప‌లేం. చూడాలంతే. మ‌నం క‌థ కూడా ఓ అనుభూతే. అయినా క‌థ‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాం. రాధ‌(నాగ‌చైత‌న్య‌), కృష్ణ (స‌మంత‌) పెళ్లి చేసుకొంటారు. వాళ్ల ప్ర‌తిరూపం బిట్టు ఉర‌ఫ్ నాగేశ్వ‌ర‌రావు రాధ త‌న‌ని నిర్ల‌క్ష్యం చేస్తున్నాడేమో అన్న అనుమానం కృష్ణ‌కు. ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. చిన్న చిన్న కార‌ణాల‌కే కృష్ణ రాధ‌తో గొడ‌వ ప‌డుతుంటుంది. ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరుగుతుంది. విడిపోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌స్తారు. ఫిబ్ర‌వ‌రి 14న లాయ‌ర్‌ని క‌లుసుకోవ‌డానికి వెళ్తారు. ఆ దారిలో ప్ర‌మాదం జ‌రుగుతుంది. ఇద్ద‌రూ చ‌నిపోతారు. బిట్టు అనే నాగేశ్వ‌ర‌రావు (నాగార్జున‌) పెరిగి పెద్ద‌వాడు అవుతాడు. గొప్ప పారిశ్రామిక వేత్త‌గా ఎదుగుతాడు. అనుకోకుండా త‌న నాన్న పోలిక‌ల‌తో ఉన్న నాగార్జున (నాగ‌చైత‌న్య‌)ని క‌లుస్తాడు. గ‌త జ‌న్మ‌లో నాగార్జున త‌న తండ్రి అన్న విష‌యం నాగేశ్వ‌ర‌రావుకి గుర్తుంటుంది. కానీ.. నాగార్జున మాత్రం గుర్తించ‌లేక‌పోతాడు. నాన్న మ‌ళ్లీ పుట్టాడు అంటే.. అమ్మ ఉండే ఉంటుంది.. అన్న న‌మ్మ‌కంతో అమ్మ‌ను వెదుకుతూ ఉంటాడు. చివ‌రికి అమ్మ (స‌మంత‌) కూడా దొరికేస్తుంది. వీరిద్ద‌రినీ ఈ జ‌న్మ‌లో అయినా క‌ల‌పాల‌నుకొంటాడు. ఇంత‌లో శ్రియ ఎదుర‌వుతుంది. శ్రియ‌ని చూడ‌గానే… మ‌న‌సులో ఏదో తెలియ‌ని క‌ద‌లిక‌. శ్రియ ఓ డాక్ట‌ర్‌. ఆమె ఆప‌ద‌లో ఉన్న చైత‌న్య (నాగేశ్వ‌ర‌రావు)ని కాపాడుతుంది. చైత‌న్య‌కు నాగేశ్వ‌ర‌రావుని చూస్తే.. త‌న తండ్రి గుర్తొస్తాడు. అంటే అత‌నికీ ఓ పున‌ర్జ‌న్మ ఉంద‌న్న మాట‌. మ‌రి ఈ జ‌న్మ‌జ‌న్మ‌ల బంధాలు ఏ తీరానికి చేరాయి..?
చివ‌రికి ఎలా ముగిశాయి?? అన్న‌దే క‌థ‌.

ద‌ర్శ‌కుడు చిన్న గ‌మ్మ‌త్తు చేశాడు.
ఈ సినిమాలో నాగార్జున నాన్న నాగ‌చైత‌న్య‌.
నాగేశ్వ‌ర‌రావు నాన్న నాగార్జున‌.
నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌కు చైతూ అని పేరు పెట్టాడు.
నాగార్జున పేరు నాగేశ్వ‌ర‌రావు. నాగ‌చైత‌న్య పేరు నాగార్జున‌. అలా ఒక‌రి పేరుని మ‌రొక‌రి పాత్ర‌కు లింకు పెట్టి ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. నాగ‌చైత‌న్య ని నాగార్జున నాన్న‌.. నాన్న అని పిలిస్తే ఎలా ఉంటుంది? గ‌మ్మ‌త్తుగా ఉంటుంది క‌దా..? అక్క‌డే ప్రేక్ష‌కులు థ్రిల్ పీల‌వుతాయి. ఫ‌స్టాఫ్ అంతా ఇలానే గ‌మ్మ‌త్తుగానే సాగుతుంది. గ‌త జ‌న్మ‌లో త‌న‌ని అర్థాంత‌రంగా వ‌దిలేసి వెళ్లిపోయిన అమ్మా నాన్న ఈ జ‌న్మ‌లో మ‌ళ్లీ క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంటారు. ఏ కొడుకుకైనా ఇంత‌కంటే ఆనందం ఏముంటుంది? త‌న అమ్మానాన్న‌ని క‌ల‌ప‌డానికి నాగార్జున ప‌డిన ఆరాటం.. వాళ్ల‌ని చూస్తున్న‌ప్పుడు ఆ క‌ళ్ల‌లో ప‌లికే ఫీలింగ్స్ అద్భుతంగా కుదిరాయి. ఇలాంటి క‌థ‌ని డీల్ చేయ‌డం మామూలు విష‌యం కాదు. క‌థ గ‌మ్మత్తుగా ఉన్నా తెర‌కెక్కించ‌డంలో క‌న్‌ఫ్యూజ్ అయితే మొద‌టికే మోసం వ‌స్తుంది. కానీ అలాంటి త‌ప్పు చేయ‌లేదు. చాలా జాగ్ర‌త్త‌గా న‌డిపించాడు. ఫ‌స్టాఫ్ అంతా నాగార్జున – నాగ‌చైత‌న్య , నాగార్జున – స‌మంత కాంబినేష‌న్‌లో న‌డిచే స‌న్నివేశాలే. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ముందు నాగేశ్వ‌ర‌రావు ఎంట్రీ ఇస్తారు. ఆయ‌న‌కూ ఓ పున‌ర్జ‌న్మ కు సంబంధించిన జ్ఞాప‌కాలున్నాయ్ అని చెప్పి ద‌ర్శ‌కుడు మ‌రో షాక్ ఇస్తాడు. దాంతో సెకండాఫ్‌లోకి వెళ్తుంది క‌థ‌.

సెకండాఫ్ కూడా అలాంటి థ్రిల్లింగ్ ఉండాల్సింది. కానీ… ఈ క‌థ‌ని న‌డిపించ‌డంలో సెకండాఫ్‌లో రిలాక్స్ అయిపోయాడు ద‌ర్శ‌కుడు. గ‌త జ‌న్మ‌లో విడిపోయిన అమ్మా -నాన్న‌ని ఎలా క‌ల‌పాలి?? అనే విష‌యంపై దృష్టి పెట్టాడు. దాంతో నాగేశ్వ‌ర‌రావు పాత్ర సైడ్ అయిపోయింది. గ‌త జ‌న్మ‌లో దూర‌మైన అమ్మానాన్న ఈ జ‌న్మ‌లో క‌నిపిస్తే, అదీ త‌న ముస‌లి వ‌య‌సులో…?? నాగార్జున పాత్ర‌కు చేసిన జ‌స్టిఫికేష‌న్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌కు చేయ‌లేక‌పోయాడు. ఫ్లాష్ బ్యాక్‌లు ఎవ‌రికి ఎలా తెలిశాయి? గ‌త జ‌న్మ‌ల జ్ఞాప‌కాలు నాగార్జున – శ్రియ‌ల‌కు ఎలా అర్థ‌మ‌య్యాయో తెలీదు. నాగేశ్వ‌ర‌రావు త‌న జ్ఞాప‌కాల్ని త‌న‌లోనే దాచేసుకొన్నాడా? లేదంటే చెప్పాడా? అన్న విష‌యాల‌కు క్లారిటీ లేదు. చివ‌ర్లో చిన్న ఝ‌ల‌క్ (అఖిల్ ఎంట్రీ) తో శుభం కార్డు వేసేశాడు. అమ‌ల‌, అఖిల్‌ల‌ని చూపించి ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేశాడు.
ఈ క‌థ‌లో అక్కినేని వంశానికి చెందిన ముగ్గురు హీరోలున్నారు. కానీ మొదటి మార్కు నాగార్జున‌కే. ఎందుకంటే… ఈ సినిమాలో నాగ్ న‌ట‌న చాలా కొత్త‌గా అనిపించింది. త‌న వ‌య‌సుకి త‌గిన డిగ్నిటీ మొద‌టిసారి త‌న పాత్ర‌లో చూపించార‌నిపించింది. విమానంలో చైతూతో క‌ల‌సి చేసిన సీన్ హైలెట్‌. అక్క‌డ నాగ్ హావ‌భావాలు చాలా చాలా బాగున్నాయి. ఆ త‌ర‌వాత నాగ‌చైత‌న్య కూడా ఓకే అనిపించాడు. కానీ కొన్ని మైన‌ర్ మిస్టేక్స్ ఉన్నాయి. మొత్తానికి ఫ‌ర్వాలేదు. ఇక లెజెండ‌రీ న‌టుడు నాగేశ్వ‌ర‌రావు గురించి చెప్పేదేముంది?? తాగుబోతు సీన్‌లో బాగా న‌టించారు. వ‌చ్చే జ‌న్మ‌లో మీ కొడుకుగా పుడ‌తా… అని నాగార్జున పాత్ర‌ని ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌కి థియేట‌ర్లో చ‌ప్ప‌ట్ల వ‌ర్షం కురుస్తుంది. స‌మంత క్యూట్‌గా ఉంది. కొన్ని ఎక్స్‌ప్రెష‌న్స్ ఆమెకే సాధ్యం అన్న‌ట్టు ఇచ్చింది. చీర‌లోనూ సెక్సీగా క‌నిపించింది. రెండు లిప్‌లాక్‌లు అద‌నం. శ్రియ ఓకే. కానీ వ‌య‌సు మీరిన ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపించాయి.

ఇది ద‌ర్శ‌కుడి చిత్రం. అస‌లు ఇలాంటి క‌థ‌ని డీల్ చేయ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. కానీ ఈ విష‌యంలో చాలా చాలా స‌క్సెస్ అయ్యాడు. సెకండాఫ్ డ‌ల్‌గా సాగింది, కొన్ని లాజిక్ లు మిస్స‌య్యాడు గానీ.. ఓవ‌రాల్‌గా బాగా చేశాడు. గ‌త జన్మ‌లోని సంగ‌తులు ఈ జ‌న్మ‌లోనూ తెలివిగా రిపీట్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ మాట‌లు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. సింపుల్‌గా ఉన్నా.. బాగున్నాయి. అనూప్ ఆర్‌.ఆర్‌.ఈ సినిమాకి ప్రాణం. పాట‌లు థియేట‌ర్లో చూస్తే ఇంకా బాగున్నాయి. ఫొటోగ్ర‌ఫీ సూప‌ర్‌. ఇక ఎడిటింగ్ విష‌యానికొస్తే సెకండాఫ్‌లో ట్రిమ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ విష‌యంలోనూ దృష్టి పెడితే బాగుంటుంది.

నాగేశ్వ‌ర‌రావు చివ‌రి చిత్ర‌మిది. ఈ సినిమాకి సమ్ థింగ్ స్పెష‌ల్‌గా తీర్చిదిద్దాల‌నుకొన్నారు. ఆ విష‌యంలో క‌చ్చితంగా టీమ్ విజ‌యం సాధించింది. మ‌నం.. అక్కినేనికి నిజ‌మైన ఘ‌న‌మైన వీడ్కోలు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.5/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు