రివ్యూ : నువ్వ‌లా.. నేనిలా..

nuvvala-nenila-review1                                                                |Click here for English Review|
ఇలాగైతే ఎలా?? నువ్వ‌లా నేనిలా.. : తెలుగుమిర్చి రేటింగ్ : 1.5/5 

తాడు ఉంది క‌దా అని గుర్రాన్ని కొనుక్కోవ‌డం మూర్ఖ‌త్వం. సినిమా విష‌యంలోనూ ఇంతే. చిన్న లైన్ దొరికింది క‌దా, అని వాటి చుట్టూ క‌థ అల్లుకోవాల‌నుకోవ‌డం అవివేకం. ఈ సంగ‌తి అర్థం కాక చాలామంది చేసిన త‌ప్పే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తున్నారు. లైన్ కోసం క‌థ అల్లుకోవ‌డం క‌మ‌ర్షియ‌ల్ హీరోల‌కు ఓకేనేమో. ఎందుకంటే.. పెద్ద హీరో సినిమా అంటే పాట‌లూ, ఫైటింగులూ, ఫ్యాన్స్‌కి కావ‌ల్సిన అద‌న‌పు హంగుల‌న్నీ జోడించేయొచ్చు. కాస్తో కూస్తో వ‌ర్క‌వుట్ అవుతుంది. క‌నీసం ఫ్యాన్స్ అయినా చూస్తారు. వ‌రుణ్ సందేశ్ లాంటి హీరో కూడా అదే బాట‌లో లైన్లు ప‌ట్టుకొని వేలాడదాం. అనుకొంటే ఎలా…?? నువ్వలా నేనిలా చూస్తే… మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాంటి సందేహ‌మే క‌లుగుతుంది.

క్రిష్(వరుణ్ సందేశ్) అమెరికా నుంచి ఇండియా వ‌స్తాడు. ఇక్క‌డో కంపెనీ బాధ్య‌త‌లు చూసుకోవాల‌నుకొంటాడు. అత‌నికి ప్రేమ‌పై ప్ర‌త్యేక‌మైన న‌మ్మ‌కాలేం ఉండ‌వు. ల‌వ్ అంటే ఓ గేమ్ అంతే. అత‌నికి మహాలక్ష్మి(పూర్ణ) ప‌రిచ‌యం అవుతుంది. మ‌హాల‌క్ష్మి క్రిష్ ఆఫీసులోనే ప‌నిచేస్తుంటుంది. త‌న‌దో ట్రాజెడీ ప్రేమ క‌థ‌. మ‌హా.. ఒక‌రిని ప్రేమిస్తుంది. కానీ అత‌ను మోసం చేస్తాడు. ఆ బాధ‌ల్లో ఉన్న మ‌హాకి.. క్రిష్ చేష్ట‌లు కూడా విసుగు తెప్పిస్తాయి. మ‌హాని అమమ్మ లాంటి అమ్మాయి అని ఏడిపిస్తుంటాడు. దాంతో ఎలాగయినా క్రిష్ ని ఆకర్షించి… త‌ను అన్న మాట‌లు త‌ప్ప‌ని నిరూపించాల‌నుకొంటుంది మ‌హాల‌క్ష్మి. మ‌రి అందుకు త‌నే చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం మొద‌లైందా? అది ప్రేమగా ఎలా మారింది?? అనేదే…. నువ్విలా నేన‌లా క‌థ‌.

బేసిగ్గా.. ఇదో చిన్న లైన్ అంతే. అయ్య‌బాబోయ్‌.. ఎంత బాగుందో అని ముచ్చ‌ట ప‌డిపోయే లైన్ కూడా కాదు. సాదా సీదాగా ఉంది. ద‌ర్శ‌కుడు త‌న అమోఘ‌మైన తెలివితేట‌ల‌తో ఈ లైన్‌కి వ‌న్నె తెచ్చాడా అంటే అదీ లేదు. క‌థ‌ ఎంత సాధార‌ణంగా ఉందో… తీత కూడా అంతే యావ‌రేజ్‌గా ఉంది. ఓ అమ్మాయి.. అబ్బాయిని ప‌డేయ‌డానికి ఎన్ని విధాల ట్రై చేస్తుంద‌న్న‌ది కొత్త పాయింట్‌. అంత‌కు మించి… ఈ సినిమాలో ఏం లేదు. ఈరోజుల్లో ఇలాంటి క‌థ‌ల‌కు వినోదం, కాస్త స‌స్పెన్స్, ఇంకాస్త గ్లామ‌ర్ జోడించే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. మొన్నొచ్చిన ర‌న్ రాజా ర‌న్ కూడా అంతే క‌దా. కామెడీ, టేకింగ్ వాల్యూస్ వ‌ల్ల ఆ సినిమా ఆడింది. అయితే.. ఇందులో అవి కూడా లేవు. నాలుగో స‌న్నివేశంలోనే ఈ సినిమాకి ఎందుకొచ్చాంరా బాబూ.. అనిపిస్తుంది. ఇంట్ర‌వెల్ కి పారిపోవాల్సిందే. కానీ.. ఏదో ఉంటుందిలే అన్న ధీమాతో కూర్చుంటారంతా. చివ‌రికి.. ఇది టైమ్ పాస్ సినిమాకి కూడా త‌క్కువ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌తి స‌న్నివేశాన్నీ నిదానంగా చెక్కే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఏదో ఓ దృశ్య కావ్యం తీస్తున్న‌ట్టు ఫీలైపోయాడే మ‌రి. తెర‌పై పాత్ర‌లు కూడా ఇలా వ‌చ్చి, అలా వెళ్తున్న‌ట్టు అనిపిస్తాయి. ఒక్క‌టీ రిజిస్ట‌ర్‌కాదు. దాంతో.. ప్రేక్ష‌కుడు కూడా ప‌క్క చూపులు చూడ‌డం మొద‌లెట్టేస్తాడు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు మంచి స‌న్నివేశాలు కూడా.. వీటి మ‌ధ్య చేరి క‌లుషిత‌మైపోయాయి.

వ‌రుణ్ సందేశ్‌.. హిట్ సినిమా చూసి చాలాకాలం అయ్యింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న త‌ప‌న‌తో క‌థ‌లు ఒప్పుకొంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. వ‌స్తున్నాయ్ క‌దా, చేసేద్దాం అని ఫిక్స‌యిపోతే… ఇలాంటి క‌థ‌లే ఒప్పుకోవాల్సివ‌స్తుంది. అత‌ని బాడీ లాంగ్వేజ్ లో , డైలాగ్ డెలివ‌రీలో ఎలాంటి మార్పూ లేదు. ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డానికే ఇష్టం లేన‌ట్టు దిష్టి బొమ్మ‌లా నిల‌బ‌డ్డాడంతే. పూర్ణ అయితే మ‌రీ ఘోరం. ఏ ఫ్రేములోనూ అందంగా క‌నిపించ‌లేదు. పోనీ.. న‌ట‌న ఇర‌గ‌దీసిందా అంటే అదీ లేదు. ఆమెను ఎందుకు తీసుకొన్నారో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే అర్థం కావాలి. కామెడీ గ్యాంగ్ ఉన్నా.. వాళ్ల నుంచి న‌వ్వులు ఆశించ‌డం.. మ‌న త‌ప్పే.

మేం వ‌య‌సుకి వ‌చ్చాం అనే సినిమాతో ఆక‌ట్టుకొన్నాడు త్రినాథ‌రావు న‌క్కిన‌. అయితే ఆ సినిమా మేకింగ్‌లో పెట్టిన శ్ర‌ర్థ ఇక్క‌డ‌కొచ్చేసరికి ఏమైపోయిందా?? అనిపించింది. అరె… ఇక్క‌డ ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఆలోచించాడు, అని ముచ్చ‌ట ప‌డే సంద‌ర్భం ఒక్క‌టీ లేదు. క‌థ‌, క‌థ‌నాలు ఇంత బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడు తెర‌పై జిమ్మిక్కులూ వ‌ర్క‌వుట్ కావు. మాట‌లు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. ఈ సినిమాలో మెచ్చుకోద‌గిన విష‌యాలుంటే.. అవి సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం. ఈమ‌ధ్య‌కాలంలో చిన్న సినిమాల్లో చూసిన మంచి ఫొటోగ్ర‌పీ.. ఇది. పాట‌ల్లో కెమెరా మ‌రింత రెచ్చిపోయింది. పాట‌లూ బాగున్నాయి. అయితే వాటి ప్లేస్‌మెంట్ ఇబ్బంది క‌లిగించింది.

మ‌రోసారి వ‌రుణ్ సందేశ్‌కి నిరాశాజ‌న‌క‌మైన ఫ‌లితం ఇచ్చిన సినిమా ఇది. క‌థ క‌థ‌నం ఇలా ఉంటే.. ఫ‌లితం వేరేలా ఎలా ఉంటుంది. సేమ్ టూ సేమ్‌… అలానే ఉంటుంది. ఈ వారం ఎక్కువ సినిమాలొచ్చాయి. ఏ సినిమాకి వెళ్లాలి? అన్న క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్న‌వాళ్లు ఈ సినిమాని లైట్ తీసుకోవ‌చ్చు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

                                                     |Click here for English Review|