రివ్యూ: ఓం

om-3d-telugu-movie-reviews-ratings

  తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5Click here for English Review

సాంకేతికంగా బాగుందనిపించిన.. ‘ఓం’

సాంకేతికంగా తెలుగు సినిమా ఎదుగుతోంది. ద‌ర్శక నిర్మాత‌లు ప్రేక్షకుల‌కు విజువ‌ల్ ట్రీట్ ఇద్దామ‌నుకొంటున్నారు. అందుకోసం విదేశీ నిపుణుల‌ను కూడా బ‌రిలోకి దించుతున్నారు. మార్కెట్‌కు మించి ఖ‌ర్చు పెడుతున్నారు. ఇదంతా… భారీద‌నం కోస‌మే. ఓం కూడా ఇలా తీర్చిదిద్దిన సినిమానే. ప్రతి ఫ్రేమూ రిచ్‌గా చూపించాల‌ని… క‌ళ్ల ముందు అద్భుతాలు ఆవిష్కరించాల‌ని టీమ్ ప‌డిన క‌ష్టం మెచ్చుకోద‌గిన‌దే. కానీ ఒక్కటే లోపం. అన్నీ ఉన్నా… అల్లుడి నోట్లో శ‌ని.. అని కావ‌ల్సిన హంగుల‌న్నీ ఉంటున్నాయి గానీ – కీల‌క‌మైన క‌థ క‌నిపించ‌కుండా పోతోంది. దాంతో శ‌వానికి ముస్తాబు చేసిన‌ట్టు త‌యార‌వుతున్నాయి కొన్ని సినిమాలు. ఓం కూడా నిర్మాణ విలువ‌ల విష‌యంలో ఎక్కడా రాజీ ప‌డ‌లేదు. పావ‌లా ఖ‌ర్చు చేయాల్సిన చోట‌… రూపాయి పావ‌లా ఖ‌ర్చు పెట్టారు. మ‌రి క‌థ విష‌యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు. త్రీడీ.. త్రీడీ అని హోరెత్తించిన ఈ సినిమాలో ఆ ప‌రిజ్హానం ఎంత ముచ్చట గొలిపింది? చూద్దాం రండి.

హరిశ్చంద్ర ప్రసాద్ (కార్తీక్). బైరెడ్డి ( రావుర‌మేష్ ) బ‌ద్ధ శ‌త్రువులు. ఎలాగైనా స‌రే హ‌రిశ్చంద్రప్రసాద్ ని అంతం చేయాల‌ని పంతం పూన‌తాడు బైరెడ్డి. అత‌నికి భ‌వానీ శంక‌ర్ (సంప‌త్‌రాజ్‌) జ‌త‌కూడ‌తాడు. వీరిద్దరూ వేసిన ఎత్తుల్ని… హ‌రిశ్చంద్ర ప్రసాద్ కొడుకు అర్జున్ ( క‌ల్యాణ్ రామ్‌) చిత్తు చేస్తుంటాడు. అర్జున్ అంజ‌లి (కృతి)ని ప్రేమిస్తాడు. ఆమె ఎవ‌రో కాదు.. భ‌వానీ శంక‌ర్ మ‌నిషే. ఆ త‌రవాత హ‌రి శ్చంద్రప్రసాద్ త‌న కొడుకిని రియా (నికీషా పటేల్‌)కి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకొంటాడు. ఈలోగా అంజ‌లి అర్జున్‌కి ఓ నిజం చెబుతుంది. అదేంటి? క‌థ ఎలాంటి మ‌లుపు తిరిగింది?

బైరెడ్డిపై హ‌రిశ్చంద్రప్రసాద్ ప‌గ పెంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నల‌కు స‌మాధానం రెండో భాగంలో తెలుస్తుంది.
ఓం క‌థ‌ని ఇలా మూడు ముక్కల్లో టూకీగా చెప్పడం కూడా క‌ష్టమే. ఎందుకంటే ఈ క‌థ‌లో చాలా మ‌లుపులుంటాయి. ఆ మ‌లుపు క‌థ‌ని మ‌రో కొత్త కోణంలో తీసుకెళ్తుంటుంది. ద‌ర్శకుడు క‌థ కంటే క‌థ‌నాన్ని బాగా న‌మ్ముకొన్నాడు. ఎందుకో తెలీదుగానీ… క‌ల్యాణ్‌రామ్ సినిమాల్లో స్ర్కీన్ ప్లే బాగుంటుంది. అత‌నొక్కడే, హ‌రేరామ్ సినిమాల్ని క‌థ‌న‌మే విజ‌య‌తీరాలకు చేర్చింది. అందుకే ఈసారీ క‌థ‌నం పైనే ఆయ‌న ఎక్కువ దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.

క‌థ కాస్త ప్రజెంట్‌లోనూ, ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్‌లోనూ న‌డుస్తుంటుది. అది కాస్త త‌ల‌నొప్పి వ్యవ‌హార‌మే. ప్రేక్షకుడు కాస్త త‌ల అటూ ఇటూ తిప్పినా… క‌థ‌ను ఫాలో అవ్వడం క‌ష్టం. క‌థ‌లో ట్విస్టులు ఎక్కువున్నాయి. లెక్కకు మించిన మ‌లుపులు వ‌స్తూ పోవ‌డంతో… చాలా గంద‌ర‌గోళంగా త‌యారైంది. అయితే ఆ ట్విస్టులు ఇంకాస్త ప‌క‌డ్బందీగా రాసుకొంటే… బాలీవుడ్ సినిమా రేస్‌లా సినిమా దౌడు తీసుండేది. ఏదో ట్విస్టు పెట్టుకొంటే బాగుంటుంది అనుకొని క‌థ‌ను బ‌ల‌వంతంగా వంక‌ర్లు తిప్పార‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.

క‌ల్యాణ్ రామ్‌ని ఓ విష‌యంలో త‌ప్పకుండా మెచ్చుకొని తీరాలి. మిగ‌తా హీరోల‌కంటే భిన్నంగా ఆలోచిస్తాడు. మంచో చెడో… హిట్టో , ఫ‌ట్లో ఓ కొత్తర‌కం సినిమాని అందించాల‌ని తాప‌త్రయ ప‌డ‌తాడు. ఆ త‌ప‌న‌, ప‌డిన క‌ష్టం ఈ సినిమాలోనూ క‌నిపించింది. నిర్మాత‌గా భారాన్ని మోస్తూనే ఓ యంగ్రీ యంగ్ మెన్ పాత్ర స‌మ‌ర్థంగా పోషించాడు. అర్జున్ పాత్రకు ఏం కావాలో అవ‌న్నీ చేశాడు.. చివ‌రికి గుండు కొట్టించుకోవ‌డంతో స‌హా. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. చేసిందేం లేదు. వారి హావ‌భావాల గురించి మాట్లాడుకోవ‌ల‌సినంత సీన్ లేదు. కార్తిక్ న‌ట‌న త‌ప్పకుండా న‌చ్చుతుంది. ఇలాంటి పాత్రల‌కు కార్తిక్‌ని ఓ ఆప్షన్‌గా ఎంచుకోవ‌చ్చు.

ఇక సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. త్రీడీ ఎఫెక్టులు త‌ప్పకుండా న‌చ్చుతాయి. వాటి కోసం బాగానే ఖ‌ర్చుపెట్టారు. యాక్షన్ ఘ‌ట్టాల‌ను త్రీడీలో చూడ‌డం మాస్ ప్రేక్షకుల‌కు ఓ కొత్త అనుభూతి. ద‌ర్శకుడు.. ఛాయాగ్రహ‌ణం నుంచి వ‌చ్చాడు కాబట్టి… టేకింగ్‌లో చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా క‌నిపించాడు. మెలోడీ పాట‌లో కొరియోగ్రఫీ ఆకట్టుకొంటుంది. అయితే ఇది త్రీడీ డిమాండ్ చేసిన స‌బ్జెక్ట్ అయితే కాదు. త్రీడీ లేక‌పోయినా వ‌చ్చిన న‌ష్టమేం లేదు. కాక‌పోతే.. ఏదో ఓ కొత్తద‌నం ఉండాలి క‌దా.. అని ఈ ప‌రిజ్హానం ఉప‌యోగించుకొని ఉంటారు. ఏదైతేనేం… వెండితెర‌లో ఆ ఎఫెక్ట్ బాగానే క‌నిపించింది.

ద‌ర్శకుడు చాలా విష‌యాల్లో తేలిపోయాడు. క‌థ‌ని స‌వ్యంగా న‌డిపించ‌లేక‌పోయాడు. మ‌లుపుల్ని న‌మ్ముకొని… త‌డ‌బ‌డ్డాడు. నిర్మాత‌, హీరో త‌నే గ‌నుక‌… క‌ల్యాణ్‌రామ్ సొంత జోక్యం ఎక్కువై ఉండి ఉంటుంది. ఎంత‌సేపూ హీరోయిజం ఎలివేట్ అయ్యే స‌న్నివేశాల‌పైనే దృష్టి పెట్టాడు. సునీల్ రెడ్డికి డైరెక్షన్ చేసే అవ‌కాశం ద‌క్కిందో లేదో…? పాట‌ల గురించి కూడా ప్రత్యేకించి ప్రస్తావించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదాయె. వాటి ప్లేస్ చేసిన విధానం కూడా స‌రిగా లేదు. ఆర్‌.ఆర్‌. మాత్రం యాక్షన్ ఘ‌ట్టాల్ని బాగానే ఎలివేట్ చేసింది.

సాంకేతిక విష‌యంలో ఈ చిత్రబృందం ప‌డిన క‌ష్టాన్ని అభినందించాల్సిందే. అయితే వాటితో పాటు క‌థ విష‌యంలోనూ దృష్టి పెట్టుంటే మంచి ఫ‌లితం ద‌క్కుండేది. త్రీడీలో ఫైట్లూ, ట్విస్టులూ బీసీ ప్రేక్షకుల‌కు నచ్చే అవ‌కాశం ఉంది. టెక్నిక‌ల్ ఎఫెక్ట్ తెలియాలంటే నాణ్యమైన థియేట‌ర్‌ల‌లోనే ఈ సినిమా చూడాలి. మ‌రి అవి మ‌న‌కు అందుబాటులో ఉన్నాయా? అనేదే ప్రశ్న.

తెలుగు మిర్చి రేటింగ్స్: 3/5                                                –  స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Review