రివ్యూ: ఆపరేషన్‌ దుర్యోధన 2

Operation-Duryodhana2-telugu-movie-review-rating

ప్రేక్షకుల‌ సహనానికి బైపాస్ఆప‌రేష‌న్ దుర్యోధ‌న 2:

సినిమాల నుంచి ప్రేక్షకుడు అద్భుతాలేం కోరుకోవ‌డం లేదు. కాసేపు ఈ టెన్సన్స్ నుంచి విముక్తి క‌లిపిస్తే చాలు.. అనుకొంటున్నాడు. పాత సినిమాల్నే చూపించినా. న‌వ్వురాని జోకులేసినా – టికెట్టు రేటుకి అదే ప‌దివేలు అనుకొని స‌ర్దుకుపోతున్నాడు. ప్రేక్షకుడి అతి మంచిత‌నాన్ని కొంత‌మంది అలుసుగా తీసుకొంటున్నారు. ఏం చూపించినా చూస్తాడులే అనుకొంటున్నారు. టెన్షన్ నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డం అటుంచండి కొత్త టెన్షన్లు సృష్టిస్తున్నారు. సినిమా మ‌ధ్యలో బ‌తుకుజీవుడా అంటూ పారిపోయే సినిమాలు తీస్తున్నారు. ఇంత‌కీ ఈ ఉపోద్ఘాతానికీ, ఆప‌రేష‌న్ దుర్యోధ‌న 2కీ ఉన్న సంబంధం ఏమిటి?? తెలుసుకొందాం రండి.

ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ప్రమాదంలో మ‌రణిస్తాడు. మంత్రి వ‌ర్గంలో సీనియ‌ర్ అయిన ప్రతాప‌రెడ్డి (ఏరాసు ప్రతాప‌రెడ్డి)ని ముఖ్యమంత్రిగా నియ‌మిస్తుంది అధిష్టానం. అయితే ఈ ఎంపిక హోం మంత్రి వెంక‌టాద్రి (కోట శ్రీ‌నివాస‌ర‌రావు)కి ఏ మాత్రం ఇష్టం ఉండుదు. సీఎమ్‌ని ఎలాగైనా గ‌ద్దె దించి ఆ స్థానంలో తాను కూర్చోవాల‌నుకొంటాడు. అందుకోసం ఓ ప‌థ‌కం వేస్తాడు. కృష్ణ (పోసాని) మ‌హా జిమ్మిక్కుల మ‌నిషి. హ‌వాలా లావాదేవీల లోతుపాతులు తెలిసిన‌వాడు. త‌ను రూ.500 కోట్ల బ్లాక్ మ‌నీతో దొరికిపోతాడు. ఆ డ‌బ్బులు సీఎమ్‌వే అని చెబుతాడు. దాంతో.. ప్రతాప‌రెడ్డి చిక్కుల్లో ప‌డతాడు. రాష్రంలో రాజ‌కీయ అల‌జడి మొద‌ల‌వుతుంది. ఈ కేసుని చేధించ‌డానికి అశోక్ (జ‌గ‌ప‌తిబాబు) అనే సీబీఐ ఆఫీస‌ర్ బ‌రిలోకి దిగుతాడు. అస‌లు దోషిని అశోక్ ప‌ట్టుకొన్నాడా? లేదా? ఈ స్వార్థ రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలాంటి పాఠం చెప్పాడు?? అనేదే ఈ సినిమా క‌థ‌.

పొలిటిక‌ల్ సెట‌ర్లు మ‌న ద‌గ్గర అంత‌గా న‌డ‌వ‌వు. మ‌ల‌యాళంలో బాగా చూస్తారు. అయితే ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌తో అలాంటి సినిమాలు ఇక్కడా ఆడ‌తాయి అని నిరూపిత‌మైంది. అందుకే ఇప్పుడు దానికి సీక్వెల్ వ‌చ్చేసింది. నిజానికి ఆప‌రేష‌న్ దుర్యోధ‌న సినిమాకీ దీనికి ఏమాత్రం సంబంధం లేదు. కేవ‌లం ఆ పేరుని వాడుకొన్నారంతే. సినిమా అంతా పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలోనే సాగుతుంది. అసెంబ్లీలో అర‌చుకోవ‌డాలూ. ఒక‌రిపై మ‌రొక‌రు బుర‌ద జ‌ల్లు కోవ‌డాలూ… సినిమా అంతా ఇలానే సాగుతుంది. ఈ సినిమా ప్రస్తుత ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డిని హీరోగా చూపించాల‌నుకొంది. ఆయ‌న చేప‌ట్టిన ప‌థ‌కాలు, చేసిన గొప్పప‌నులూ ఏక‌రువు పెట్టేశారిందులో. ఇదేమైనా ఎన్నిక‌ల ప్రచార చిత్రమా? లేదంటే కిర‌ణ్ కుమార్ రెడ్డి గురించి తీసిన ల‌ఘు చిత్రమా?? అనే సందేహం కూడా వ‌స్తుంది.

స‌న్నివేశాల్లో స్పీచుల ధోర‌ణి అధికంగా ఉంది. పోసాని ఎన్ని పెన్నులు అవ‌గొట్టాడో గానీ… పేజీల కొద్దీ డైలాగులు రాసి ప‌డేశాడు. అయితే అందులో న‌స ఎక్కువ‌. విన్న డైలాగ్‌నే రిపీట్‌గా విన్నట్టుంటుంది. జ‌గ‌పతిబాబు వ‌చ్చే వ‌ర‌కూ సినిమాలో జోష్ ఉండ‌దు. ఆయ‌నొచ్చాక పెరిగిందేమో అనుకొంటారేమో..? అంత లేదిక్కడ‌. ఇక జోష్ ఎప్పటికీ రాదు అనే విష‌యం అర్థం అవుతుంది. జ‌గ‌ప‌తి కూడా ఎడా పెడా నాలుగు స్పీచులు ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోయే స‌రికి… ప్రేక్షకుడికి నీర‌సం ముంచుకొచ్చేస్తుంది.

పోసాని అల‌వాటు ప్రకారం అరిచేశాడు. కోట శ్రీ‌నివాస‌రావు అనుభ‌వ‌జ్హుడు కాబ‌ట్టి, ఉన్నంత‌లోకాస్త ర‌క్తిక‌ట్టించాడు. అయితే ఆయ‌న‌పై తెరకెక్కించిన స‌న్నివేశాలు కూడా బ‌ల‌హీనంగానే ఉన్నాయి. రావు ర‌మేష్ లాంటి వాళ్లను స‌రిగా వాడుకోలేదు. ఇక రాష్ట్ర్రమంత్రి ఏరాసు.. ఈసినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో క‌నిపిస్తారు. చాలా క‌ష్టప‌డి న‌టించారేమో.. చూడ్డం కూడా కాస్త క‌ష్టంగానే ఉంటుంది. ఇక జ‌గ‌ప‌తి పాత్రకు అంత స్కోపు లేదు. నాలుగు గోడ‌ల మ‌ద్య అర‌చుకోడం త‌ప్ప‌.. ఆయ‌న చేసిందేం లేదు.

పొలిటిక‌ల్ సెటైర్ క‌థ‌ల‌తో ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలంటే – స‌న్నివేశాల్లో స‌మ‌కాలిన స‌మాజాన్ని ప్రతిబింబించాలి. అరె.. ఇది నిజ‌మే క‌దా? అనిపించాలి. కానీ అలాంటి ప్రయ‌త్నాలేం జ‌ర‌గ‌లేదు. నోటి కొచ్చిన స‌న్నివేశాలు రాసేసి. చేతికొచ్చింది తీసేస్తే ఎలా ఉంటుంది?? ఈ సినిమా అలా ఉంటుంది. ద‌ర్శకుడు నందం హ‌రిశ్చంద్రరావు ఇంకా త‌న‌ని తాను అప్‌డేట్ చేసుకోలేదు అని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహ‌ర‌ణ‌. ఇర‌వై ఏళ్ల క్రితం నాటి టేకింగ్‌, టీవీ సీరియ‌ల్ కంటే అధ్వానంగా ఉన్న నిర్మాణ విలువ‌లు, ప‌న లేని సంభాష‌ణ‌లు ఇవ‌న్నీ ఈ సినిమాని అధః పాతాళానికి తొక్కేశాయి. శ్రీ‌లేఖ అందించిన నేప‌థ్య సంగీతం గురించి మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసుకోక‌పోవ‌డం మంచిది.

ఎంత చెత్త సినిమా అయినా అందులో ఏదో ఓ పాయింట్‌, ఓ డైలాగ్‌, ఓ స‌న్నివేశం – బాగుంది అనిపిస్తాయి. అయితే ఈ చిత్ర రూప‌కర్తలు అంత అవ‌కాశం ప్రేక్షకుల‌కు ఇవ్వలేదు. ఆప‌రేష‌న్ అనే పేరు పెట్టినందుకు మ‌త్తముందు లేకుండా – ప్రేక్షకుల‌ను కూర్చీలో కూర్చోబెట్టే ప‌ర ప‌ర కోసేసే స‌న్నివేశాలున్నాయ్ ఇందులో. అంత రిస్క్ తీసుకొంటానంటే ఈ సినిమాకి నిర‌భ్యంత‌రంగా వెళ్లొచ్చు.
తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.75/5                       స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.