రివ్యూ : పైసా

paisa-tellugu
ఈరోజుల్లో చెల్లుతుందా? పైసా : తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5

కృష్ణవంశీపై ఎవ్వరికీ న‌మ్మకాలు పోలేదు. అత‌ని క్రియేటివిటీ గురించి తెలిసిన వారెవ్వరైనా.. వ‌రుస‌గా వంద ఫ్లాపులు తీసినా నూటొక‌టో సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకొంటారు. ఎన్నివాయిదాల ప‌డ్డా స‌రే, జ‌నాలు ఈ సినిమాలో ఏం లేద‌ని ముందు నుంచీ చెబుతున్నా స‌రే…పైసాలో ఏదో అద్భుతం దాగుంటుంద‌ని ఆశ ప‌డిన‌వాళ్లు, ఆ ఆశ‌ల రెక్కల‌తో థియేట‌ర్‌లో వాలిపోయిన వాళ్లు చాలామందే ఉంటారు. మ‌రి వారి అంచ‌నాల‌ను కృష్ణవంశీ అందుకోగ‌లిగాడా?? ఈసారైనా త‌న మార్క్ ప‌నిత‌నం చూపించ‌గ‌లిగాడా?? అస‌లు ఈ పైసాలో ఏముంది?? చూద్దాం. ప‌దండి.

ఉప ఎన్నిక‌ల్లో ఓ అసెంబ్లీ సీటు ద‌క్కించుకోవ‌డానికి వివిధ పార్టీలు ప్రయ‌త్నిస్తుంటాయి. సీఎం సీటు కోసం క‌న్నేసిన ఎమ్మెల్యే (చ‌ర‌ణ్ రాజ్‌) ఈ సీటు కోసం రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్టడానికి రెడీ అవుతాడు. ఆ డ‌బ్బు హ‌వాలా రూపంలో ఇండియాకి వ‌స్తుంది. మ‌రోవైపు ప్రకాష్ (నాని) క‌థ‌. డ‌బ్బంటే మోజు, డ‌బ్బుంటే లోకంలో మ‌రేదీ అక్కర్లేదు అన్నది అత‌ని ఫిలాస‌ఫీ. నూర్ ( కేథ‌రిన్‌) ప్రకాష్‌ని ప్రేమిస్తుంది. కానీ ప్రకాష్ మాత్రం ప‌ట్టించుకోడు. డ‌బ్బున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొంటే ఈజీగా కోటీశ్వరుడికి అల్లుడు కావ‌చ్చని క‌ల‌లుకంటుంటాడు. స్వీటీ ( సిద్దిక‌) తో ప‌రిచయం అయిన త‌ర‌వాత‌.. నూర్ గురించి ఆలోచించ‌డం మానేస్తాడు. ఆ కోపంతో నూర్‌, ఓ అర‌బ్ షేక్‌కి పెళ్లిచేసుకోవ‌డానికి సిద్ధప‌డుతుంది. చివ‌రికి ప్రకాష్ ఆ అర‌బ్ షేక్‌నుంచీ ఆ ముఠా నుంచీ నూర్‌ని త‌ప్పిస్తాడు. పారిపోయే ప్రయ‌త్నంలో ఓ ఇన్నోవా కారు దొంగిలిస్తాడు. అయితే అందులోనే హ‌వాలాకు సంబంధించిన రూ.50 కోట్లు ఉన్నాయి. ఈ డ‌బ్బు కోసం మూడు ముఠాలు ప్రకాష్‌ని వెంబ‌డిస్తుంటాయి. మ‌రి ఆ కారులో డ‌బ్బులున్నాయ‌న్న సంగ‌తి ప్రకాష్‌కి తెలిసిందా? లేదా? ఆ ముఠాల బారీ నుంచి ఈ డ‌బ్బునీ, త‌న నూర్‌ని ఎలా కాపాడుకొన్నాడు? అన్న‌దే ఈ సినిమా.

సింపుల్ లైన్‌తో అద్భుతాలు సృష్టిద్దాం అనుకొంటాడు కృష్ణవంశీ. అందుకు సమ‌ర్థుడు కూడా. అయితే ఆ సింపుల్ స్టోరీలోనే బ‌ల‌మైన ఎలిమెంట్ ఏదో ఒక‌టి ఉండాలి. అది ఈ సినిమా డ‌బ్బు. ప‌చ్చనోటు కోసం మ‌నిషి ఎంత‌కు దిగ‌జార‌తాడు? ఆ డ‌బ్బు మ‌నిషితో ఏం చేయిస్తుంది?? అనే విష‌యాల్ని చెప్పాల‌నుకొన్నాడు కృష్ణవంశీ. ప్రారంభ స‌న్నివేశాలు.. పాత కృష్ణవంశీని త‌ల‌పిస్తాయి. గాలి ప‌టం కోసం వేట‌, ఉప ఎన్నిక‌ల్లో డ‌బ్బు పాట‌.. అన్నీ కృష్ణవంశీ మార్క్‌లోనే సాగాయి. అదేమిటి?? అక్కడ‌క్కడ కృష్ణవంశీ మార్క్ అలా వ‌స్తూ పోతూ ఉంటుంది. సినిమా ఆసాంతం మాత్రం ఉండ‌దు. అది ఈ సినిమాలోని ప్రధాన లోపం. డ‌బ్బు కోసం వేట సాగించే ఇలాంటి సినిమాలు ఇది వ‌ర‌కు చాలా వ‌చ్చాయి. వ‌ర్మే చాలా సార్లు ఈ కాన్సెప్ట్ పై సినిమాలు తీశాడు కూడా. కృష్ణవంశీలాంటి ద‌ర్శకుడు డీల్ చేయాల్సిన క‌థ కాదిది. ఒక వేళ చేసినా.. త‌న త‌ర‌హా ఎమోష‌న్స్ ని బ‌లంగా మేళ‌వించాల్సింది. వంశీ సినిమాల్లో సాధార‌ణంగా క‌నిపించే హ్యూమ‌న్ ట‌చ్ ఈ సినిమాలో లోపించింది.

కృష్ణవంశీ సినిమా అన‌గానే.. న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్ విష‌యంలో వంక పెట్టాల్సిన ప‌నిలేదు. ఎలాగైనా స‌రే… పిండేసుకొంటారాయ‌న‌. నాని లాంటి న‌టుడు దొరికితే ఇంకేమైనా ఉందా? నాని బాగా చేశాడు. అయితే ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇదే అని చెప్పలేం. కృష్ణవంశీ సినిమా అన‌గానే హీరోలంతా నంది అవార్డు రేంజులో న‌టించేస్తారు. దానికి నాలుగు అడుగులు ముందే నాని ఆగిపోయాడు. కేథ‌రిన్ కి వంశీ అంత అవ‌కాశం ఇవ్వలేదు. మాంటేజ్ షాట్స్ లో రొమాంటిక్‌గా క‌నిపించింది. ఇక సిద్దిక 100% అందాల ఆర‌బోత ధ్యేయంగా న‌టించింది. ఆమె చేత అమెరిక‌న్ తెలుగు (మంచు ల‌క్ష్మీ ప్రస‌న్న మాట్లాడిన‌ట్టు ) డైలాగులు ఎందుకు ప‌లికించారో అర్థం కాదు. చ‌ర‌ణ్‌రాజ్ పాత్రని మ‌రింత డెవ‌ల‌ప్ చేస్తే బాగుండేది. బ‌ల‌మైన విల‌న్ లేకపోవ‌డం ఈ సినిమాకి పెద్ద లోటు.

క‌థ, ఎత్తుగ‌డ‌, క‌థ‌నం.. ఇవ‌న్నీ కృష్ణవంశీ గ‌త సినిమా… డేంజ‌ర్ రేంజులోనే సాగాయి. ఆ త‌ర‌హా ఛేజింగులు ఈ సినిమాలో క‌నిపించాయి. డైలాగులు అక్కడ‌క్కడ బాగా పేలాయి. నాని వాటిని ప‌లికిన విధానం కూడా బాగుంది. టెక్నిక‌ల్‌గా య‌మ స్ట్రాంగ్ అయిన కృష్ణవంశీ.. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్ని సీజీ వ‌ర్క్ మీద ఆధార‌ప‌డ‌డం విడ్డూరం అనిపిస్తుంది. సాయికార్తీక్ సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆర్‌.ఆర్‌. నీతో ఏదో చెప్పాల‌పిస్తోంది.. మెలోడీ త‌ప్పకుండా ఆక‌ట్టుకొంటుంది. పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో వంశీ మ‌ళ్లీ త‌న మార్క్ చూపించాడు. ఓ పాట‌లో సిద్దిక య‌మ‌హాట్ గా క‌నిపించింది.

పాత క‌థ‌ని, కృష్ణ‌వంశీ శైలిలో చూడాలంటే ఈ సినిమా నిరభ్యంత‌రంగా చూసేయొచ్చు. కృష్ణవంశీ శైలి అంటే అంతఃపురం, గులాబీ, ఖ‌డ్గం రేంజు ఊహించుకోవ‌ద్దు. హిట్టు సినిమాలు చేసిన కృష్ణవంశీ కాదు. బిలో యావ‌రేజ్‌లు తీసిన కృష్ణవంశీ అన్నమాట‌. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                                 – స్వాతి
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

హాయ్ రీడర్స్.. మీ రివ్యూ రాయడానికి క్లిక్ చేయండి

Click Here for English Review