రివ్యూ : పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ppt
ప‌రేషాన్ చేసిన పాండ‌వులు  | తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5

శ్రీ‌నువైట్ల తెలుగు సినీ ప‌రిశ్రమ‌కు చేసిన మేలు కంటే కీడే ఎక్కువ ఉందేమో..?? ఆయ‌న ఢీ తీశాడు. అదే క‌థ కాస్త మార్చి… రెఢీ తీశాడు. హిట్లు కొట్టాడు. ఫార్ములా అదే. హీరోల్ని మార్చుకొంటూ విజ‌యాలు సాధించాడు. ఇదేదో బాగుందే అని.. మిగ‌తావాళ్లూ దాన్ని ఫాలో అయిపోయారు. ఆ ఫార్ములాను పిప్పి పిప్పి చేసి పాడేశారు. ఇప్పుడు కొంత‌మంది ద‌ర్శకులు దాన్నీ వ‌ద‌ల‌డం లేదు. ఆ పిప్పికి కాస్త క‌ల‌రింగిచ్చి, టైటిల్ మార్చి జ‌నంలోకి వ‌దులుతున్నారు. అలా వ‌దిలిన ఓ సినిమా. పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌. అయితే శ్రీ‌నువైట్ల సినిమాలో ఒక్కడే హ‌రో – ఇందులో మాత్రం అయిదుగురు. అదొక్కటే తేడా. ఈ పాండ‌వులు చేసిన గార‌డీ ఎలాంటిది? ఇంత‌కీ ఆ ఫార్ములాని శ్రీ‌వాస్ ఎలా వాడుకొన్నాడు?? తెలియాలంటే క‌థ‌లోకి జంప్ చేయాల్సిందే.

మోహ‌న్‌బాబు, ర‌వీనాటాండ‌న్ ప్రేమించుకొంటారు. కానీ ర‌వినా డాడీ దాస‌రి అడ్డు ప‌డ‌డంతో ఇద్దరి ప్రేమ‌కూ బ్రేక్ ప‌డుతుంది. దాంతో మోహ‌న్‌బాబు, ర‌వీనా విడిపోతారు. మ‌ళ్లీ 30 ఏళ్ల త‌ర‌వాత క‌లుస్తారు. అప్పటికే మోహ‌న్ బాబు ముగ్గురు అనాథ‌ల్ని (మ‌నోజ్‌, వ‌రుణ్ సందేశ్‌, తీనీష్‌) చేర‌దీసి పెంచి పెద్దచేస్తాడు. అటు ర‌వీనా కూడా అంతే. విష్ణు, వెన్నెల కిషోర్‌ల‌కు అమ్మలేని లోటు తీరుస్తుంది. విష్ణుని హ‌న్సిక ప్రేమిస్తుంది. మోహ‌న్ – ర‌వీనాల ప్రేమ క‌థ తెలుసుకొని వారిద్దరినీ ఒక్కటి చేస్తుంది. కొట్టుకొంటున్న ఈ అన్నద‌మ్ముల్ని క‌లుపుతుంది. విష్ణు, హ‌న్సిక ఒక్కట‌య్యేలోగా హ‌న్సిక‌ను ఎవ‌రో తీసుకెళ్లిపోతారు.

హ‌న్సికకు ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. వాళ్ల నాన్న గిరిబాబు.. ముఖేష్ రుషి తో పేకాడి ఆస్తుల‌న్నీ కోల్పోతాడు. చివ‌రికి త‌న కూతుర్ని కూడా జూదంలో ఓడిపోతాడు. హ‌న్సిక భ‌య‌ప‌డి పారిపోతుంది. త‌న‌ని ప‌ట్టుకోవ‌డానికే ముఖేష్‌రుషి గ్యాంగ్ ప్రయ‌త్నిస్తుంటుంది. ముఖేష్ హ‌న్సిక‌ను త‌న పెద్ద కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకొంటాడు. మ‌రి ఆ ప్రయ‌త్నాన్నిఈ తండ్రీ కొడుకులు ఎలా అడ్డుకొన్నారు?? హ‌న్సిక – విష్ణుల పెళ్లి ఎలా జ‌రిపించారు?? అన్నదే ఈసినిమా క‌థ‌.

బాలీవుడ్ సినిమా గోల్‌మాల్ 3కి రీమేక్‌.. ఫ్రీమేక్ అని గోల చేశారు గానీ – ఈ త‌ర‌హా క‌థ‌లు తెలుగు సినిమాల్లో కోకొల్లలుగా క‌నిపిస్తాయి. కాక‌పోతే అందులో ఒక్కడే హీరో.. ఇందులో అయిదుగురు ఉన్నార‌న్నమాట‌. శ్రీ‌నువైట్ల సినిమాల సెకండాప్ ఇందులో కూడా డిట్లో దింపేశారు. ఆయా సినిమాల‌కు ప‌నిచేసిన ర‌చ‌యిత త్రయం గోపీమోహ‌న్, కోన వెంక‌ట్‌, ర‌వి ఈ సినిమాకీ ప‌నిచేశారు. శ్రీ‌ను వైట్ల ద‌గ్గర వ‌ర్కవుట్ అయినా ఫార్ములానే శ్రీ‌వాస్ ద‌గ్గరా అప్లై చేయ‌డానికి ప్రయ‌త్నించారు. అయితే శ్రీ‌వాస్‌కి అయిదుగురు హీరోల్నీ, ఈక‌థ‌నీ హ్యాండిల్ చేసే కెపాసిటీ స‌రిపోలేదు. సీక్వెన్స్ సీన్స్ పండ‌క‌పోవ‌డం, రొటీన్ కామెడీ, స్ర్కీన్ ప్లే లోపాలు ఈ పాండ‌వుల్ని ముప్పు తిప్పలు పెట్టాయి.

క‌థ స‌ర‌దా స‌ర‌దాగానే మొద‌ల‌వుతుంది. అయిదుగురు హీరోల ఎంట్రీ గ‌బ‌గ‌బ కానిచ్చి ద‌ర్శకుడు క‌థ‌లోకి వెళ్లిపోయాడు. ఫ‌స్టాఫ్ కాస్త బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌కి కావ‌ల్సిన బేస్ ఫ‌స్టాఫ్ లో ఉంది. కానీ ద‌ర్శకుడు దాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ఇలాంటి క‌థ‌ల్ని టేక‌ప్ చేయ‌డంలో అనుభ‌వం లేని శ్రీ‌వాస్‌… కామెడీ పండించ‌డంలో ఫెయిల‌య్యాడు. తెరంతా న‌టీన‌టులు క‌నిపిస్తున్నా, వారిని వాడుకోలేక‌పోయాడు. దాంతో గంద‌ర‌గోళం త‌ప్ప‌.. ఏం మిగ‌ల్లేదు. విల‌న్ ఇంట్లో తిష్ట వేసి అక్కడ డ్రామా వేయ‌డానికి స‌రైన కార‌ణం లేదు. ఇంత‌మంది ఆప‌సోపాలు ప‌డి అక్కడ సాధించిందేమీ లేదు. చివ‌ర్లో రొటీన్ క్లైమాక్స్ ఫైట్ కూడా త‌ప్పలేదు.

మ‌నోజ్ లేడీ గెట‌ప్, అక్కడ‌క్కడా కొన్ని సీన్స్ త‌ప్ప ఈ సినిమాలో కామెడీ పండ‌లేదు. దాంతో ఎంతో ఆశించి థియేట‌ర్‌కి వెళ్లిన ప్రేక్షకుడు భంగ‌ప‌డ‌క మాన‌డు. మోహ‌న్ బాబు చాలా కాలం త‌ర‌వాత ఈ సినిమాలో స్టెప్పులేశాడు. త‌న‌దైన శైలిలో కొన్ని డైలాగులూ చెప్పాడు. మ‌నోజ్‌, విష్ణు ఇద్దరూ ఓకే. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అయితే మోహ‌న్ బాబు కూడా చేసిన ఫైటింగ్‌లో గ్రాఫిక్స్ ఎక్కువ‌య్యాయి. హ‌న్సిక ఫ‌ర్లేదు గానీ, ప్రణీత‌కు అంత ఛాన్స్ చిక్కలేదు. త‌న‌కు దొరికిన ఒక్క పాట‌లో ఎక్స్ పోజింగ్ చేసి ఆలోటు తీర్చుకొంది. బ్రహ్మానందం అండ్ కో… న‌వ్వించ‌డానికి ఆప‌సోపాలు ప‌డ్డారు.

సాంకేతికంగా ఈ సినిమా యావ‌రేజ్‌. ఫొటోగ్రపీ కొన్ని సీన్స్ లో బాగుంటే, ఇంకొన్ని సీన్స్‌లో తేలిపోయింది. ఆర్‌.ఆర్‌కీ స్కోప్ లేదు. పాత పాట‌ల్ని వాడేసుకొని అదే ఆర్ ఆర్ అనుకోమ‌న్నారు. ఓ సన్నివేశంలో ధూమ్ థీమ్‌ని యాజ్ టీజ్ వాడేసుకొన్నారు. మాటల్లో పంచ్‌లు పేలినా.. అక్కడ‌క్కడే. రొటీన్ స్ర్కీన్ ప్లే ఈ మ‌ల్టీస్టార‌ర్‌ని డామేజ్ చేసింది. మ‌నోజ్ – ప్రణీత‌ల‌పై తెర‌కెక్కించిన ఒక్క పాట మాత్రం బాగుంది. అంతే.. ఇక చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు.

అయిదుగురు హీరోలున్నప్పుడు వారికి స‌రిప‌డా క‌థ రాసుకోవాలి. ప్రతీ పాత్రకూ న్యాయం చేయాలి. లేదంటే క‌థ అన్యాయం అయిపోతుంది. మ‌ల్టీస్టార‌ర్ అన్న మాట‌కు విలువ ఉండ‌దు. అయిదుగురు హీరోలు, కావ‌ల్సినంత పెట్టుబ‌డి దొరికిన‌ప్పుడు రొటీన్ క‌థ‌ను ఎంచుకొని విసిగించిన ఈ ద‌ర్శకుడిని ఏమ‌నాలి??

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here for English Review