రివ్యూః పెళ్లిపుస్తకం

pelli-pustakam-movie-reviews-ratings

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5| Click here for English Review

‘టైటిల్ పాడైపోయింది’

కొన్ని టైటిళ్లు చూడ‌గానే – ఓ చిన్ని పుల‌కింత క‌లుగుతుంది. ఆ టైట‌ల్‌ తో ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటి టైటిల్ ’పెళ్లి పుస్తకం’. బాపు -ర‌మ‌ణ‌ల సున్నిత‌మైన సృజ‌నాత్మక‌త‌కు నిలువుట‌ద్దం. రాజేంద్ర ప్రసాద్‌, దివ్యవాణి న‌ట‌న చూసి త‌రించాల్సిందే. ఇవ‌న్నీ పెళ్లి పుస్తకం సినిమాని తెలుగు వాళ్లంతా మ‌ర్చిపోలేని ఓ దృశ్యకావ్యం లాంటి స్థానం క‌ల్పించింది. అలాంటి టైటిల్‌ ని పెట్టుకోవ‌డానికి ఎంత ధైర్యం ఉండాలి.? త‌మ క‌థ‌పై ఎంత‌టి న‌మ్మకం ఉండాలి?? కొత్త ద‌ర్శకుడు రామ‌కృష్ణ మ‌చ్చకంటి త‌న సినిమా టైటిల్ పెళ్లిపుస్తకం అని చెప్పగానే – మ‌న‌కు తెలియ‌కుండానే ఆ సినిమాపై దృష్టి ప‌డింది. – “బాపు సినిమా టైటిల్‌ కి ఏమాత్రం మ‌చ్చలేకుండా ఈ సినిమా తీశాం..` అని చెప్పుకోవ‌డం వ‌ల్ల ఇంకాస్త గౌర‌వం క‌లిగింది. మ‌రి ఈ సినిమా చూసిన త‌ర‌వాత కూడా ఈ గౌర‌వం నిల‌బ‌డిందా? అల‌నాటి పెళ్లి పుస్తకం సినిమాకి ఈ సినిమా ఎంత దూరంలో ఉంది? తెలుసుకొందాం… ప‌దండి.

అనుబంధం, ఆప్యాయ‌త‌లు క‌ల‌గ‌లిసిన ఓ ఉమ్మడి కుటుంబం అది. ఆ ఇంటిపెద్ద నాగినీడు. ఆ ఇంటికి ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ ఇంటి అమ్మాయిని, అబ్బాయిని బయ‌టివారికి ఇచ్చి పెళ్లిళ్లు చేయ‌రు. పెళ్లంటూ జ‌రిగితే అది కుటుంబానికి సంబంధించిన బంధువుల‌తోనే జ‌ర‌గాలి. బావామ‌ర‌ద‌ళ్లయిన రాహుల్‌, నీతిల‌కూ కూడా అలాగే పెళ్లిచేయాల‌నుకొంటాడు నాగినీడు. అయితే రాహుల్, నీతిల‌కు ఆ ఆలోచ‌నే ఉండ‌దు. కానీ నాగినీడి బ‌ల‌వంతం చేసి, హార్ట్ ఎటాక్ డ్రామా ఆడి – ఇద్దరికీ పెళ్లిచేస్తాడు. నీతికి ఈ పెళ్లి ఇష్టం లేక‌పోవ‌డంతో రాహుల్ ఒంట‌రిగా హ‌నీమూన్ చేసుకొస్తాడు. నీతి ఇక్కడ చెర్రీ అనే అబ్బాయి ప్రేమ‌లో ప‌డుతుంది. నీతి, రాహుల్ వేరే కాపురం ప‌డ‌తారు. ఇద్దరికీ ఒక్క నిమిషం కూడా ప‌డ‌దు. గిల్లిక‌జ్జాలతో రోజులు గ‌డుస్తుంటాయి. అయితే క్రమంగా నీతిని ఇష్టప‌డ‌డం మొద‌లుపెడ‌తాడు… రాహుల్‌. అయితే త‌ను.. చెర్రీ మాయ‌లో ఉంటుంది. ఆమెను ఎలాగైనా స‌రే దారిలోకి తెచ్చుకోవాల‌నుకొంటాడు రాహుల్‌. అందుకే నీతి చ‌దువుతున్న కాలేజీలో లెక్చల‌ర్‌ గా వెళ్తాడు. అక్కడ ఏం జ‌రిగింది? త‌న భార్యను ఎలా దారిలోకి తీసుకొచ్చాడు అనేదే ఈ సినిమా క‌థ‌.

ఉమ్మడి కుటుంబం – అందులోని మ‌ధురిమ‌ల మ‌ధ్య తెలుగుద‌నం నిండిన స‌న్నివేశాల‌తో సినిమా ప్రారంభం అవుతుంది. పెళ్లిపుస్తకం అనే టైటిల్‌ లానే ప‌విత్రంగా మొద‌లైంది అనుకొంటాం. అయితే.. ఆ ఫీలింగ్ రానురానూ చెరిపేశాడు దర్శకుడు. నాగినీడు హార్ట్ ఎటాక్ డ్రామా, ఆ త‌ర‌వాత పెళ్లి, ఇద్దరూ కొట్టుకోవ‌డం – ఇవ‌న్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. దానికి తోడు తెర‌పై క‌నిపించే ప్రతి పాత్ర ఓవర్ యాక్షన్ చేయ‌డానికే ట్రై చేసింది. ఎక్కువ శాతం న‌టీన‌టులు బుల్లి తెర నుంచి వ‌చ్చిన వాళ్లే. అక్కడి సాగ‌దీత కార్యక్రమాన్ని ఈ సినిమాలోనూ కొన‌సాగించారు. ద‌ర్శకుడి టేకింగ్ కూడా సీరియ‌ల్‌ ని త‌ల‌పిస్తుంది. ఉమ్మడి కుటుంబం, స‌రిగా అమ‌ర‌ని భార్యాభ‌ర్తల మ‌న‌సులు – క‌థ ఈ ట్రాక్‌ లోనే న‌డిపితే బాగుండును. కానీ మాస్‌ కీ, యూత్‌ కి ఎక్కడ దూర‌మైపోతామో అనే భ‌యంతో ద‌ర్శకుడు ఆ రిస్క్ తీసుకోలేదు. మ‌సాలా సన్నివేశాలు, అర్థం లేని పాట‌ల్ని జోడించి క‌క్కుర్తి ప‌డ్డాడు.

క‌థ కాలేజ్ బ్యాక్‌ డ్రాప్‌ లోకి వెళ్లి పూర్తిగా ట్రాక్ త‌ప్పింది. అక్కడ‌క్కడా కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఎదుర‌వుతుంటాయి. లెక్చరర్ – స్టూడెంట్స్ మ‌ధ్య తెర‌కెక్కించిన సన్నివేశాలు పెళ్లి పుస్తకం అనే టైటిల్‌ లోని ప‌విత్రత‌కు తూట్లు పొడిచేలా ఉంటాయి. చివ‌ర్లో మళ్లీ హెవీ డైలాగులు. క‌న్నీళ్లు పెట్టి భార్యాభ‌ర్తల్ని క‌లిపి క‌థ‌ని సుఖాంతం చేశారు. అయితే ప్రేక్షకుడిలో ఓపిక ఇంట్రవెల్ కార్డుకే హ‌రించుకుపోతోంది. ఇక శుభం వ‌ర‌కూ ఉంటాడా?? అనేది అనుమాన‌మే!

నాగినీడు, రాహుల్ న‌ట‌న ఫ‌ర్వాలేదు. రాహుల్‌ లో కాస్త ఈజ్ వ‌చ్చింది. చ‌లాకీగానే న‌టించాడు. నీతి కేవ‌లం గ్లామ‌ర్‌ కి మాత్రమే ప‌నికొచ్చింది. ఇక మిగిలిన వారి గురించి చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. శేఖ‌ర్ చంద్ర సంగీతం సోసోనే. శ్రీ‌ర‌స్తు శుభమ‌స్తు పాట‌ని కూడా చీల్చి చెండాడారు. రాజేంద్రప్రసాద్‌, దివ్యవాణిల ఎక్స్‌ ప్రెష‌న్‌ ని కూడా కాపీ కొట్టాల‌ని చూశారు. అంత‌మంచి పాట‌కు ఈ ఖ‌ర్మేంటి దేవుడా..? అని ప్రేక్షకులు ఫీల‌వ్వడం గ్యారెంటీ. ఎంతో కొంత బ‌డ్జెట్ చేతిలో పెట్టుకొని, ఏదో ఓ సినిమా తీసేయాలి అనుకొంటే ఇలాంటి సినిమాలే వ‌స్తాయి. ద‌ర్శకుడి అనుభ‌వ‌లేమి స్పష్టంగా క‌నిపించింది. పెళ్లి పుస్తకం అనే టైటిల్‌ ని పాడుచేయ‌డం మిన‌హా..ఈ సినిమా మ‌రేం చేయ‌లేక‌పోయింది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2/5                                           – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version