రివ్యూ : ప్ర‌తినిధి

rohit

ఆమ్ ఆద్మీ అస్త్రం  ‘ప్ర‌తినిధి’ తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5

ఆమ్ ఆద్మీ.. ఈ మాట ఇప్పుడు బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఓ సామాన్యుడు ఏం చేయ‌గ‌ల‌డు?? అత‌ని న‌డుం బిగిస్తే ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తాడు..? ఒక్క‌డే కొండను ఢీ కొడితే ఎలా ఉంటుంది..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ప్ర‌తినిధిలో త‌ప్ప‌కుండా దొరుకుతుంది. కొన్నాళ్ల క్రితం హిందీలో వెడ్నెస్ డే అనే సినిమా వ‌చ్చింది. ఓ సామాన్యుడు ఒకే ఒక్క సిమ్ కార్డ్‌తో న‌గ‌రాన్ని, ప్ర‌భుత్వాన్ని వ‌ణికిస్తాడు. ప్ర‌జ‌ల్ని ఆలోచ‌న‌లో ప‌డేస్తాడు. దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో, తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి అగుణంగా త‌యారైన చిత్రం ప్ర‌తినిధి.

ముఖ్యమంత్రి (కోట శ్రీ‌నివాస‌రావు) కిడ్నాప్ రాష్ట్రంలో పెను సంచ‌ల‌నం క‌లిగిస్తుంది. కిడ్నాప్ ఎవ‌రు చేశారు.? అంత అవ‌స‌రం ఎవ‌రికొచ్చింది? ఇవేం అంతుప‌ట్ట‌వు. ఈ కిడ్నాప్ చేసింది మంచోడు శ్రీ‌ను ( నారా రోహిత్‌) అనే విష‌యం అర్థం అవుతుంది. మంత్రిగారి కొడుకు శ్రీ‌క‌ర్ ( విష్ణువ‌ర్థ‌న్‌)ని వాడుకొని.. అత‌ని ఆస‌రాతో సీఎమ్ కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు శ్రీ‌ను. గాంధీ బొమ్మ‌లేని వెయ్యి రూపాయ‌ల నోటు ఇస్తే.. ముఖ్య‌మంత్రిని వ‌దిలేస్తా అంటాడు. అదెలా కుదురుతుంది? పార్ల‌మెంట్‌లో చ‌ట్టం చేయ‌నిదే కుద‌ర‌దు అంటుంది ప్ర‌భుత్వం. లేదంటే చిల్ల‌ర‌ని నిషేధించండి. అది కుద‌ర‌క‌పోతే చిల్ల‌ర ద్వారా సొమ్ము చేసుకోవాల‌ని చూస్తున్న‌వాళ్లంతా ఆ డ‌బ్బుని సీఎమ్ స‌హాయ‌క నిధికి జ‌మ చేయాలి.. అని మ‌రో ష‌ర‌తు విధిస్తాడు. ఈలోగా పోలీసులు కూపీ లాగితే… మంచోడు శ్రీ‌ను నెల రోజుల క్రింద‌టే ఆత్మహ‌త్య చేసుకొని చ‌నిపోయాడ‌న్న నిజం తెలుస్తుంది. మ‌రి మంచోడు శ్రీ‌ను చ‌నిపోతే… ఇప్పుడు కిడ్నాప్ చేసింది ఎవ‌రు? ఈ కిడ్నాప్‌కీ, అర్థం ప‌ర్థం లేని ష‌ర‌తుల‌కు కార‌ణం ఏమిటి? అన్న‌ది ప్ర‌తినిధి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

గాంధీ మ‌ద్య‌పానానికీ, అహింస‌కు వ్య‌తిరేకంగా పోరాడారు. కానీ అదే గాంధీ బొమ్మ ఉన్న నోటుతో చికెన్‌కొంటాం, మందు బాటిల్ కొనుక్కొంటాం? మ‌రి గాంధీ సిద్దాంతాలు మ‌నం ఏం పాటిస్తున్న‌ట్టు…?

లీజ‌రు పెట్రోలు రూ 71ల 16 పైసలు.. ఇదేం లెక్క‌. పైస‌ల‌కు విలువ లేదు. అలాంట‌ప్పుడు ఇక్క‌డ మాత్రం పైస‌లెందుకు?? క‌స్ట‌మ‌ర్ నుంచి ఇలా దోచుకొన్న పైస‌లు యేడాదికి కొన్ని వేల కోట్లు. అవ‌న్నీ ఏమ‌వుతున్న‌ట్టు??

లంచం తీసుకొనేవారు ల‌క్ష‌ల్లో ఉన్నారు, ఇచ్చేవాళ్లు కోట్ల‌లో మ‌రి త‌ప్పు ఎవ‌రిది?

అవినీతి ప‌రులైన ప్ర‌జ‌ల్ని పాలించ‌డానికి మ‌రింత అవినీతి ప‌రులైన పాల‌కులే శ‌ర‌ణ్య‌మా?

ఇలాంటి ప్ర‌శ్న‌ల్ని సంధించాడు ప్ర‌తినిధి. బ్లాక్ మ‌నీ, అవినీతి, ప్ర‌జ‌ల నిర్లక్ష్యం వ‌ర‌స‌పెట్టి క‌డిగేశాడు. నిత్యం మ‌నం వేసుకొన్న ప్ర‌శ్న‌లే అవ‌న్నీ. వాటికి స‌మాధానం చెప్ప‌క‌పోయినా.. క‌నీసం వెదికే ప్ర‌య‌త్నం జ‌రిగిందీ సినిమాలో. ఏదైనా ఓ స‌మ‌స్య‌ని తెర‌పై చూపించ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భ‌య‌ప‌డుతుంటారు. మ‌రీ డాక్యుమెంట‌రీలా అయిపోతుందేమో….?? అని. కానీ ఇలా కాస్త ఆసక్తిగా చెప్ప‌గ‌లిగే ద‌మ్ముంటే ప్ర‌తినిధిలాంటి క‌థ‌ల్ని టేక‌ప్ చేయొచ్చు. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న పాయింట్‌ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. అప్ కోర్స్ ఇందులో లాజిక్ లేదన్న‌మాట నిజ‌మే. కాక‌పోతే నిత్యం అలాంటి ప్ర‌శ్న‌లే వేసుకొనే ప్రేక్ష‌కుడిని మాత్రం సంతృప్తి ప‌రిచాడు. ప్ర‌జ‌లు మారాలి, ప్ర‌జ‌లు త‌ప్పు చేస్తే ప్ర‌భుత్వం, చ‌ట్టం స‌ర్దిచెప్పాలి… అంటూ ఓ మంచి పాయింట్‌ని జ‌న‌రంజ‌కంగా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

నారా రోహిత్ కాస్త టిపిక‌ల్ క్యారెక్ట‌ర్‌. కాస్త విభిన్నంగా ఉన్న క‌థ‌ల‌నే ఎంచుకొంటాడు. త‌నకి స‌రిగ్గా స‌రిపోయే సినిమా ఇది. అయితే చాలా లావుగా క‌నిపించాడు. డాన్సులు వేసేట‌ప్పుడు ఇబ్బందిగా క‌దిలాడు. డైలాగ్ డెలివ‌రీ కాస్త మార్చుకోవాలి. అయితే సీరియ‌స్ స‌న్నివేశాల్లో మాత్రం అత‌ని వాయిస్ ప్ల‌స్ అయ్యింది. డాన్సులు, ఫైటింగులు, మాస్ క‌థ‌లు అంటూ నేల విడ‌చి సాము చేయ‌కుండా ఇలాంటి స్టోరీలు ఎంచుకొంటే బాగానే ఉంటుంది. అయితే అస్ల‌మానూ దొర‌క‌డం క‌ష్ట‌మే. దాన్ని ఎలా దాటుకొని వ‌స్తాడో చూడాలి. శుబ్ర అయ్య‌ప్ప క‌థానాయిక‌లా క‌నిపించ‌లేదు. ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ భ‌రించ‌డం క‌ష్టం. కోట‌, పోసాని.. మ‌ళ్లీ మామూలుగానే బాగా చేసేశారు. విష్ణువ‌ర్థ‌న్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకొంటుంది. ఆ పాత్ర‌కీ ఓ సార్థ‌క‌త క‌నిపిస్తుంది.

ఫ‌స్టాప్ లో ల‌వ్ ట్రాక్ వ‌ల్ల సినిమా ట్రాక్ త‌ప్పుతుందేమో అనిపిస్తుంది. కానీ మ‌ళ్లీ వెంట‌నే గాడిలోకి వ‌చ్చేశాడు. ఫ‌స్టాఫ్‌లో ఉన్న పాట‌ని తీసేస్తే బాగుండును. రెండో భాగంలో స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించాడు ద‌ర్శ‌కుడు. ఓ కిడ్నాప‌ర్‌ని లీడ‌ర్‌ని, హీరోని చేసి ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లిరావ‌డం కాస్త అతిగా అనిపిస్తుంది. టీవీ ఛాన‌ళ్లు కూడా ముఖ్యమంత్రి గురించి కాకుండా కిడ్నాప‌ర్ గురించే మాట్లాడ‌డం ఓవ‌ర్ యాక్ష‌నే. సినిమా అంతా సందేశాలూ, క్లాసులూ పీకి చివ‌రికి ఏం చేసిన‌ట్టు?? అంటే స‌మాధానం దొర‌క‌దు. నారా రోహిత్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్‌కీ, తాను చేసిన డిమాండ్ల‌కూ పొంత‌న లేదు. ఇలా కొన్ని లాజిక్‌కు అంద‌ని పాయింట్లు ఈ సినిమాలో ఉన్నాయి. స్ర్కిప్టు రాసుకొనేట‌ప్పుడు వాటిపైనా శ్ర‌ద్ధ పెట్టి, ఇలాంటి చిన్న త‌ప్పులు స‌రిదిద్దుకొంటే బాగుండేది.

సాయికార్తీక్ పాట‌ల‌కు ఈ సినిమాలో స్కోప్ లేదు. ఒక‌ట్రెండు బాణీలు కూడా విన‌బుల్‌గా లేవు. కానీ ఆర్‌. ఆర్ మాత్రం బాగుంది. సన్నివేశాల్ని త‌న వంతుగా ఎలివేట్ చేశాడు. బ‌డ్జెట్‌లో ప‌రిమితులు సినిమా క్వాలిటీ విష‌యంలో క‌నిపించాయి. అయినా ఇలాంటి సినిమాల్ని త‌క్కువ బ‌డ్జెట్‌లో ముగించ‌డ‌మే క‌రెక్ట్‌. కొన్ని సంభాష‌ణ‌లు చ‌మ‌క్ మ‌నిపిస్తాయి. తెలుగు దేశం పార్టీకి ప్ల‌స్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంద‌ని ముందు నుంచీ భావిస్తూనే ఉన్నారు. ఇంట్రవెల్ కార్డ్ ప‌డేముందు ఎన్టీఆర్ బొమ్మ చూపించారు. అంతేకాదు.. ఇంట్రమిష‌న్‌లో కూడా తెలివిగా ఎన్టీఆర్ పేరు క‌నిపించేలా చేశారు.

రాజ‌కీయంగా వాతావ‌ర‌ణం వేడెక్కింది. మంచి నాయ‌కుడిని ఎన్నుకోవాల్సిన త‌రుణం ఇది. ఈ ద‌శ‌లో చూడాల్సిన సినిమా ఇది. స‌మాజంలో కూడా మార్పు రావాల‌ని సూచించిన ప్ర‌తినిధి.. స‌రైస స‌మ‌యంలో స‌రైన సినిమా…

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5             – స్వాతి
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.