రివ్యూ : రభస

rabasara-review

                                                               |Click here for English Review|

రొటీన్ యాక్షన్ మ‌సాలా  ర‌భ‌స‌రేటింగ్ : 3.25/5

క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే అర్థం మారిపోయింది… క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అంటే.. ఫైట్లూ, పాట‌లూ, డైలాగులూ.. ఫ్లాష్ బ్యాక్ అనుకొంటున్నారంతా. ఓ క‌థ‌ని అంద‌రికీ న‌చ్చేలా, అర్థమ‌య్యేలా చెప్పడం అనే సంగ‌తి మ‌ర్చిపోతున్నారు. ఓ స్టార్ హీరో దొర‌గ్గానే క‌థ రాసుకోరు.. లెక్కలు వేసుకొంటున్నారిప్పుడు. ఆ హీరో ఏం చేశాడు? అత‌నికి ఏం కావాలి? అభిమానులు ఏం కోరుకొంటున్నారు? ఇది వ‌ర‌కు ఎలాంటి సినిమాలు హిట్టయ్యాయి..? అనే లెక్కల న‌డుమ క‌థ రెడీ అవుతోంది. ఆ చిన్న తాడుపై… హీరో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయ‌డం మొద‌లెడుతున్నాడు. బ‌ల‌హీన‌మైన ఆ తాడు… ఎప్పుడు తెగిపోతుందో ఎవ్వరికీ అర్థం కాదు. సినిమా మొద‌లైన కాసేప‌టికే.. ప‌టాపంచ‌లైపోయి… హీరో, అత‌నిపై వేసుకొన్న లెక్కలు బొక్క బోర్లా ప‌డుతున్నాయి. ర‌భ‌స క‌థ కూడా అచ్చంగా అలాంటిదే. ఎన్టీఆర్ ఏం చేయ‌గల‌డు? అత‌ని బ‌లాలేంటి? … ఇవి తెలుసుకొని వాటికి ఓ సూప‌ర్ హిట్ ఫార్ములాతో క‌లిపి క‌థ అల్లేశారు. మ‌రి… ఇలాంటి రొటీన్ ఫార్ములాలో ఎన్టీఆర్ ఏం చేయ‌గ‌లిగాడు? అత‌ని విన్యాసాలు జ‌నానికి చేరువ అవుతాయా? ఈ వినాయ‌క చ‌వితికి జ‌నం ముందుకొచ్చిన ర‌భ‌స‌లో కంటెంట్ ఏంటి?? తెలుసుకొందాం… రండి.

అమ్మ (జ‌య‌సుధ‌) కోరిక మేర‌కు త‌న మ‌ర‌ద‌లు చిట్టిని పెళ్లి చేసుకొందామ‌ని హైద‌రాబాద్ వ‌స్తాడు కార్తీక్ (ఎన్టీఆర్‌). త‌న త‌ల్లిదండ్రుల్ని అవ‌మానించిన మేన‌మావ (షాయాషీ షిండే)కి బుద్దిచెప్పి.. మ‌ర‌ద‌ల్ని ఇంటికి తీసుకెళ్లాల‌న్నది కార్తీక్ ప్లాన్‌. అందులో భాగంగా మేన‌మావ మేయ‌ర్ కాకుండా అడ్డుకొంటాడు. చిట్టి (ప్రణీత‌) చ‌దువుతున్న కాలేజీలోకి ఎంట‌ర్ అవుతాడు. యాంటీ ల‌వ‌ర్స్ స్వాడ్ పేరుతో అక్కడ తిష్ట వేస్తాడు. క్రమంగా చిట్టి కి ద‌గ్గర‌వుతాడు. ఈ క్రమంలో ఇందు(స‌మంత‌)తో గొడ‌వ‌లు ప‌డుతుంటాడు. కార్తీక్ – ఇందుల మ‌ధ్య పచ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంటుంది. అయితే ఇక్కడ అస‌లు ట్విస్టేంటంటే… కార్తీక్ మ‌ర‌ద‌లు చిట్టి కాదు… ఇందునే. ఈ విష‌యం కార్తీక్‌కి అర్థమ‌య్యేలోపే ఇందు మ‌రొక‌రి ప్రేమ‌లో ఉంటుంది. త‌న స్నేహితురాలి ప్రేమ‌ని కాపాడిన వంశీని ఇష్టప‌డుతుంది. అత‌నెవ‌రో మొహం చూడ‌కుండానే ప్రేమిస్తుంది. ఆ వంశీ… ఈ కార్తీక్ ఇద్దరూ ఒక్కటే. అదెలా?? అసలు మేన‌మావ‌తో కార్తీక్‌కి ఉన్న ప‌గేంటి?? కార్తీక్‌ని ఇందు ఎందుకు ఎలా ఇష్టప‌డింది? ఆ త‌ర‌వాత ఏమైంది?? అన్నదే ర‌భ‌స స్టోరీ.

క‌థ‌పై ద‌ర్శకుడు పెద్దగా క‌స‌ర‌త్తులేం చేయ‌లేద‌ని ఈ స్టోరీ లైన్ చూస్తే అర్థమైపోతుంటుంది. అమ్మానాన్నని అవ‌మానించిన మేన‌మావ‌పై ఇదో రివైంజ్ డ్రామా. ఇదొక్కటీ స‌రిపోదు కాబ‌ట్టి.. రెండు ట్విస్టులు వేసుకొన్నాడు. అవీ బ‌ల‌హీనంగా మార‌డంతో క‌థ మ‌రింత బ‌ల‌హీనంగా మారింది. అయితే కథ‌లో కొంత‌భాగం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో న‌డిపించ‌డం, ఎన్టీఆర్ – స‌మంత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ కాస్త సినిమాని కాపాడుతుంది. మేన‌మావ ఇంటికెళ్లి ఛాలెంజ్ చేసి… ఇంట్రవెల్ కార్డు వేసుకొందీ సినిమా. ఆ త‌ర‌వాత టోట‌ల్‌గా క‌థాగ‌మ‌న‌మే మారిపోయింది. ఓ ఊర్లో రెండు కుటుంబాల మ‌ధ్య త‌న వ‌ల్ల ఏర్పడిన అగాథాన్ని పూడ్చడానికి హీరో… విల‌న్ ఇంట్లోనే దూరి.. వాళ్లని బ‌క‌రాలు చేసుకొని (ఢీ, రెడీ ఫార్ములా) ఆటాడేసుకొంటాడు. రెండు కుటుంబాల్ని క‌లిపి హ్యాపీ ఎండ్ కార్డు వేసేసి.. జ‌నాన్ని ఇంటికి పంపించేశారు.

మేన‌మావ మోసం చేస్తే… ప‌గ తీర్చుకోవ‌డం బీసీ ఫార్ములా. దానికి కాస్త బిల్డప్ జోడించి తీసిన సినిమా ఇది. ఎన్టీఆర్ క‌థ‌ల ఎంపిక‌లో ఎప్పుడూ చేసే పొర‌పాటే.. ఇప్పుడూ చేశాడు. అస‌లేం ఉంద‌ని ఈ క‌థ ఒప్పుకొన్నాడో అర్థం కాదు. త‌ర‌వాతి సీన్ ఏమిట‌న్నది అర్థమైపోయిన‌ప్పుడు ఇక సినిమా చూడ‌డంలో అర్థం ఏముంటుంది??

హీరో ఎవ‌రో, ఎందుకొచ్చాడో? ఏం చేయ‌బోతున్నాడో ప్రేక్షకుల‌కు తెలిసిపోతూనే ఉంటుంది. కానీ తెర‌పై ప్రతినాయ‌కుల‌కు మాత్రం అర్థం కాదు. అలాంట‌ప్పుడు ఎమోష‌న్స్ ఎందుకు పండుతాయి? ఇంకా ఢీ, రెడీ ఫార్ములానే ప‌ట్టుకొని వేలాడుతూ, అందు కోసం కోట్లు ఖ‌ర్చు పెట్టడం, ఓ స్టార్ హీరో ఇమేజ్ తో చెల‌గాటం ఆడ‌డం ఎందుకు…?? యాంటీ ల‌వ‌ర్స్ స్వాడ్ అనే పాయింట్‌తో క‌థ‌ని కాసేపు న‌డిపించాలి అనుకోవ‌డంలోనే ద‌ర్శకుడి మేధ‌స్సు అర్థమైపోతోంది. గుళ్లో పూజారి ప‌లికే సంభాష‌ణ‌లు, అత‌ని గుళ్లోనే ర‌క్తం వ‌చ్చేట్టు చావ‌గొట్టడం చూస్తే… గుడి ప‌విత్రత‌నీ దృష్టిలో పెట్టుకోరా?? అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఇమేజ్‌, కోట్ల రూపాయాల పెట్టుబ‌డి, ప్రేక్షకుడి అమూల్యమైన రెండున్నర గంట‌ల స‌మ‌యం… వృథా.. వృథా… వృథా..

ఇంత‌టి అతిసాధారణ‌మైన స్టోరీలో ఎన్టీఆర్ మాత్రం ఏం చేయ‌గ‌ల‌డు. ఎప్పట్లా డాన్సులు, ఫైట్లతో అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డం మిన‌హా. రెండు మూడు ఎమోష‌న‌ల్ సీన్స్‌లో మాత్రం న‌టించ‌గ‌లిగాడు. అయితే… అంత అవ‌స‌రం లేద‌క్కడ‌. న‌టుడిగా ఎన్టీఆర్ ఎప్పుడూ ఫుల్ మార్కులే తెచ్చుకొంటాడు. హీరోగా త‌న‌కేం కావాలో, ఏం చేయాలో ఇప్పటికైనా అర్థం చేసుకొంటే మంచిది. స‌మంత దృష్టి ఎంతసేపూ చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకోవ‌డం పైనే. అమెలో గ్లామ‌ర్ పెరుగుతూ పెరుగుతూ.. న‌ట‌న త‌గ్గిపోతోందా?? అనిపిస్తోంది. ప్రణీత గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన ప‌నిలేదు. చెప్పుకోవ‌డానికి భారీ కాస్టింగ్ ఉందీ చిత్రంలో. కానీ ఏంలాభం?? ఎవ‌రికి ప్రాధాన్యత ఉంది? షాయాజీ అర‌చుకోవ‌డం త‌ప్ప చేసిందేముంది? అజ‌య్ బ‌క‌రా అవ్వడం మిన‌హా.. సాధించేది ఏముంది?? బ్రహ్మానందం పాత్రని కాసేపు న‌డిపిస్తే గ‌ట్టెక్కేయొచ్చు అనుకొన్నారు. పాపం.. ఆయ‌నా త‌న శ‌క్తికి మంచి క‌ష్టప‌డ్డాడు.

నా ఇష్టం… నా ట్యూన్లు ఇలానే ఉంటాయ్‌… అన్నట్టు కొట్టిందే కొట్టాడు త‌మ‌న్‌. నేను ఈ సినిమాని ఇంత‌కంటే క‌ట్ చేయ‌లేను బాబు… అంటూ అడ్డదిడ్డంగా వ‌దిలేశాడు ఎడిట‌ర్‌. కెమెరాప‌నిత‌నం రిచ్‌గా ఉంది అని చెప్పకూడ‌దు. ఎందుకంటే.. నిర్మాత బోలెడ‌న్ని డ‌బ్బులు పోశాడు. రిచ్ నెస్ రాకుండా ఎక్కక‌కు పోతుంది. ఆ ఫైట్లేంటో… తీసిన‌వాళ్లకీ చేసిన వాళ్లకీ అర్థమ‌య్యాయో లేదోగానీ, చూసినోళ్లకు త‌ల‌లు వాచిపోతాయ్‌. డైలాగుల్లో పంచ్‌లు లేవు. మంచివీ లేవు.

ఎన్టీఆర్ వినాయ‌క చ‌వితికి విందుభోజ‌నం పెడ‌తాడ‌నుకొంటే… చాలీ చాల‌కుండా ఒడ్డించాడు. ఎన్టీఆర్ నుంచి ఓ గొప్ప సినిమా వ‌స్తుంద‌నుకొన్నవాళ్లకి నిరాశ త‌ప్పుదు. ఏదో ఒక సినిమా వ‌చ్చిందిలే.. అదే చాలు అనుకొంటే నిర‌భ్యంత‌రంగా వెళ్లొచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

                                                |Click here for English Review|