రివ్యూ : రొమాన్స్

romance-telugu-movie-review-rating

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5 | Click here for English Review

న్యూసెన్స్ +నాన్సెన్స్ = రొమాన్స్‌

చాలామంది ద‌ర్శకులు అమ్మాయిల్ని అందంగా చూపించారు. షోకేసులో బొమ్మలా తీర్చిదిద్దారు. రాఘ‌వేంద్రరావు ఓ పువ్వులా చూపిస్తే, బాపు ఓ బొమ్మలా మార్చారు. విశ్వనాథ్ సంప్రదాయం ఒల‌క‌బోస్తే, కోడి రామ‌కృష్ణ వీర‌త్వం జోడించారు. ఒక్క మారుతి మాత్రమే అమ్మాయిని ఆట వ‌స్తువుగా మార్చేశాడు. శ‌భాష్ మారుతి…! మిగిలిన సినిమాల్లో క‌థానాయిక‌ను చూస్తే ముద్దొస్తుంది. మారుతి సినిమాలో మాత్రం క‌థానాయిక‌ని చూస్తే మనింట్లో అమ్మాయిల మీద‌, మ‌న మ‌న‌సులో చోటిచ్చిన ప్రియురాలి మీద అనుమానం వ‌స్తుంది. ఇంకోసారి శెభాష‌హె…! రొమాన్స్ కి ద‌ర్శకుడు డార్లింగ్ స్వామినే, కానీ మారుతి ప్రభావం మాత్రం అణువ‌ణువూ కనిపించింది. ఈరోజుల్లో లో కొంచెం, బ‌స్ స్టాప్‌లో కొంచెం క‌ల‌గ‌లిపి, త‌న పైత్యం జోడించి బూతు జాడించి తీసిన సినిమా రొమాన్స్‌.

ల‌వ్ కి, రొమాన్స్ కి చాలా తేడా ఉంది. రొమాన్స్ ఎవ‌రితో అయినా చేయొచ్చేమో. కానీ ల‌వ్ ఒక్కరితో మాత్రమే సాధ్యం. ప్రేమ క‌థ‌లు వండేట‌ప్పుడు, దానికి రొమాన్స్ అనే పేరు త‌గిలించిన‌ప్పుడు ద‌ర్శకుడు ఈ చిన్న తేడాని గుర్తు పెట్టుకొంటాడేమో అనుకొంటాం. కానీ డార్లింగ్ స్వామి – ల‌వ్ కీ, రొమాన్స్‌కి తేడా చెప్పడానికి ఓ క‌థ ఎంచుకొని ఏది ల‌వ్వో, ఏది రొమాన్సో ఆ బుల్లి కథ‌లో చెప్పలేక ఎటువైపు మొగ్గాలో తేల్చుకోలేక కిందా మీదా ప‌డి – త‌ను క‌న్ఫ్యూజ్ అయి – ఏం చేయాలో తెలీక ఏదో ఒక‌టి చెప్పేస్తే పోలా..? అనుకొని తీసిన సినిమా రొమాన్స్‌. ఈ సినిమాలో ఎంత న్యూసెన్స్ ఉందో, ఇంకెంత నాన్సెన్స్ ఉందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

కృష్ణ (ప్రిన్స్‌) ఇంజనీరింగ్ స్టూడెంట్‌. ప్రేమ‌పై , త‌న‌కు కాబోయే ప్రేమికురాలిపై కొన్ని అభిప్రాయాలుంటాయి. ఫ‌స్ట్ ల‌వ్‌, ఫ‌స్ట్ కిస్‌, ఫ‌స్ట్ ట‌చ్‌, ఫ‌స్ట్ హ‌గ్ అంటూ ఓ రొమాంటిక్ సూత్రం ప‌ట్టుకొని త‌న‌కు కావ‌ల్సిన అమ్మాయి కోసం వెదుకులాట మొద‌లెడ‌తాడు. తొలిసారి అన్నీ త‌న‌తోనే అనుభ‌వించే అమ్మాయి కావాల‌ట‌. ఆ అమ్మాయికి ఎలాంటి పూర్వ అనుభవం ఉండ‌కూడ‌దట‌. అలాంటి వాళ్లు దొర‌క‌డం క‌ష్టమ‌ని స్నేహితులు స‌వాల్ చేస్తారు. కానీ ల‌లిత (మాన‌స‌)ని ఇష్టప‌డ‌తాడు. ఆ అమ్మాయి బెడ్ రూమ్‌లో `అది కావాలి` అంటూ వెంట‌ప‌డుతుంది. `అది కావాలి` అని అడిగిందంటే త‌ప్పకుండా ఎక్స్‌పీరియ‌న్స్ ఉండే ఉంటుంద‌ని కృష్ణ భ‌యం. కానీ తాగిన మ‌త్తులో ఆ కార్యం అయిపోతుంది. మ‌రుస‌టి రోజు ఇద్దరూ బ్రేక‌ప్ ఇచ్చుకొని విడిపోతారు. వెంట‌నే మ‌రో అమ్మాయి అనురాధ (డింపుల్‌)ని ఇష్టప‌డాడు. ఆమె కూడా అన్నిట్లోనూ ప‌ర్‌ఫెక్టే! ఓరోజు త‌న రూమ్‌కి తీసుకొచ్చి అడ్వాన్స్ అవ్వబోతే – లాగిపెట్టి కొడుతుంది. `హ‌మ్మయ్య నాకు కావాల్సిన అమ్మాయి దొరికేసింది` అని సంబ‌ర ప‌డ‌తాడు కృష్ణ. కానీ అక్కడే క‌థ రివ‌ర్స్ అవుతుంది. అదేంటి? సెకండాఫ్‌లో ఏం జ‌రిగింది? ఇవ‌న్నీ తెలుసుకోవాల‌న్న ఆత్రం మీకుంటే – రొమాన్స్ ఎక్కడ ఆడుతుందో ఆచూకీ తీయండి.

సింగిల్ లైన్‌లో స్టోరీ చెబితే ఇదేదో కామసూత్రకు త‌క్కువ కండోమ్ ప్యాకెట్ ఎడ్వడైజ్‌మెంట్ కు ఎక్కువ‌లా సాగే క‌థ అనిపిస్తోంది క‌దూ. మీరు ఊహించిన‌ది కరెక్టే! మారుతి సినిమాల‌కు ఓ సూత్రం ఉంది. ఏం చూపించైనా స‌రే – యువ‌త‌రాన్ని థియేట‌ర్లకు ర‌ప్పించాల‌ని. ఈ సినిమా కూడా అదే సూత్రం ప్రకారం అల్లుకుపోయాడు. మారుతికి కావ‌ల్సినట్టు డార్లింగ్ స్వామి క‌థ రాసుకొన్నాడో, లేదంటే డార్లింగ్ స్వామిని త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు మారుతి త‌యారు చేసుకొన్నాడో తెలీదు గానీ – బ‌స్ స్టాప్‌కి ఈ సినిమా కొన‌సాగింపులా అనిపిస్తుంటుంది.

అమ్మాయిలంటే మారుతి అండ్ కో కి ఇంత చుల‌క‌నేంటో అర్థంకాదు. అమ్మాయిలు అబ్బాయిల్ని షాపింగుల‌కీ, సెల్ ఫోన్ రిఛార్జుల‌కీ వాడుకొంటార‌ట‌. అందుకు బ‌దులుగా అబ్బాయిలు అమ్మాయిల్ని వాడుకొని బ్యాలెన్స్ చేసుకొంటార‌ట‌. అమ్మాయి ఫ్రెష్షా, కాదా.. అని తేల్చడానికి అమ్మాయిలే ర‌క‌ర‌కాల యాంగిల్లో మ‌రో అమ్మాయిని స్కానింగ్ చేస్తారు. ఓ అమ్మాయేమో `వేస్ట్ ఫెలో, నిన్న రాత్రి నీ రూమ్‌కి వ‌స్తే ఏం చేయ‌లేక‌పోయావ్‌, నీకూ నాకూ బ్రేక్ అప్` అంటుంది. ఇంకో అమ్మాయేమో త‌న సెల్‌లో ఉన్న బూతు వీడియోల‌ను మ‌రో అబ్బాయి సెల్‌లోకి బ్లూటూత్ ద్వారా పంపుతుంది. అబ్బాయి వాడిన స‌బ్బు అమ్మాయిలంతా క‌ల‌సి పాట పాడుకొంటారు. ఓ అమ్మాయి వాడేసిన స‌బ్బుని మూడు వేల‌కు కొనుక్కొంటుంది. హ‌త‌విధీ.. ఏమిటీ దిగ‌జారుడు త‌నం..?

లోకంలో ప‌విత్రమైన అమ్మాయిలు ఉన్నారా? లేదా? అనే ఆర్గ్యుమెంట్లు, అబ్బాయిలు – అమ్మాయిలు వీరిలో ఎవ‌రిని ఎవ‌రు వాడుకొంటారు? అనే డిబేట్లూ – ఏరా?? అమ్మాయిల్ని చూసి నేర్చుకొండ్రా. ప్రేమంటే అమ్మాయిల‌దిరా? అనే స్పీచులూ – ఓరినాయ‌నో.. చెప్పడం మా వ‌ల్ల కాదు బాబోయ్‌!

చిన్న సినిమాల్ని చిన్న చూపు చూస్తున్నారు. బూతు, డ‌బుల్ మీనింగ్ డైలాగులూ త‌ప్ప మ‌రేం ఉండ‌డం లేద‌ని వాపోతున్నారు. అలాంటి వారి కంటికి రొమాన్స్ లాంటి సినిమాలు ప‌డితే ఇంకెంత క‌న్నీరు కారుస్తారో?! టైటానిక్ సినిమా అంటే ముద్దులూ, కార్లో శృంగార‌మే అనుకొన్న ద‌ర్శకుడికి అందులో ఉన్న ప్రేమ విలువ ఏం తెలుస్తుంది? ఇక రొమాన్స్ గురించి ఏం చెప్తాడు??

న‌ట‌నటుల ప్రతిభ‌, వాళ్లు ప‌లికిన సంభాష‌ణ‌లు – వీటి గురించి కాస్త గొప్పగా మాట్లాడ‌మన్నా ఆ అవ‌కాశం ఎవ‌రూ ఇవ్వలేదు. బాగుంది అని చెబుదామ‌న్నా – ద‌ర్శకుడు ఎంచుకొన్న క‌థ‌, వాటిని వ్యక్తీక‌రించిన విధానం చూస్తే చిర్రెత్తుకుపోయి ఎవ‌రు బాగా చేసినా బాలేద‌నే చెప్పాల్సి వ‌స్తోంది.

చివ‌రిగా ఓ మాట‌. యూత్ ప్రతిసారీ బూతుకు ప‌డిపోతార‌ని అనుకొంటే అది పొర‌పాటు. వాళ్లకూ స్వచ్ఛమైన ఫీలింగ్స్‌కావాలి. రొమాన్స్ అంటే ఓ అనిర్వచ‌నీయ‌మైన అనుభూతి. అమ్మాయి వంటి పై ఎప్పుడు చేయేద్దామా అనే క‌క్కుర్తి ఫీలింగ్ కాదు. కానీ ఈ సినిమాలో ద‌ర్శకుడు రెండోదే చూపించాడు.

తెలుగు మిర్చి రేటింగ్స్: 2/5 –                                                                          .స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.