రివ్యూ : రన్ రాజా రన్

run-raja-run                                            |Click here for English Review|
నాన్‌స్టాప్ ఫ‌న్‌ర‌న్ రాజా ర‌న్‌‘ : తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

న‌వ్విస్తే….. గ‌ల్లా పెట్టె నిండడం ఖాయం. బాక్సాపీసు ద‌గ్గ‌ర చాలా సినిమాలు ఇదే సూత్రాన్ని రుజువు చేశాయి. మ‌న‌వాళ్ల‌కూ ప్రేక్ష‌కుల్ని బాగా న‌వ్వించాల‌నే ఉంటుంది. కానీ అదెలాగో అర్థం కావ‌డం లేదు. సీరియ‌స్ క‌థ‌లోకి బ్ర‌హ్మానందం, ఎమ్మెస్‌, తాగుబోతు ర‌మేష్ లాంటి వాళ్ల‌ను ఇరిచించి వాళ్ల నుంచి కామెడీ పిండేద్దామ‌ని వీర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. క‌థ‌లోంచి కామెడీ పుట్టిస్తే.. స‌న్నివేశాల్లోంచి వినోదం పిండిస్తే, క్యారెక్ట‌రైజేష‌నే ఫ‌న్నీగా ఉంటే.. ఇలా ఎవ్వ‌రూ ఆలోచించ‌డం లేదు. కానీ కొత్త ద‌ర్శ‌కుడు సుజిత్ & టీమ్ ఇలానే ఆలోచించింది. అందుకే ’ర‌న్ రాజా ర‌న్’ ఇప్పుడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర వినోదాలు పండిస్తోంది. ఇంత‌కీ రన్ రాజా ర‌న్ లో ఎంత ఫ‌న్ ఉందో తెలుసుకోవాలంటే క‌థ‌లోని ర‌న్నింగ్ చేయాల్సిందే.

రాజా హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ (శ‌ర్వానంద్‌) స‌ర‌దా కుర్రాడు. హ‌రిశ్చంద్రుడిలా అన్నీ నిజాలే చెబుతుంటాడు. అత‌ని నిజాలూ, నిజాయ‌తీ భ‌రించ‌లేక ప్రేమించిన ప్ర‌తీ అమ్మాయీ హ్యాండిస్తుంది. మ‌రోవైపు ప్రియ (సీర‌త్ క‌పూర్‌) ప‌రిస్థితీ ఇంతే. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. ప్రియ ఎవ‌రో కాదు.. పోలీస్ క‌మీష‌న‌ర్ దిలీప్ కుమార్ (సంప‌త్) కూతురు. న‌గ‌రంలో వ‌రుస‌గా కిడ్నాప్‌ లు జ‌రుగుతుంటాయి. అయితే ఈ కేసులు ఛేందించ‌లేక పోలీసులు త‌ల‌లుప‌ట్టుకొంటారు. ఈ కిడ్నాప్‌ల‌ను అరికట్ట‌డానికి ప్ర‌భుత్వం దిలీప్ కుమార్‌ని నియ‌మిస్తుంది. అసలే కిడ్నాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న దిలీప్‌కి… కూతురి ప్రేమ వ్య‌వ‌హారం తెలుస్తుంది. ఈ రెండింటికీ చెక్ పెట్టేందుకు ఓ ప‌ధ‌కం ర‌చిస్తాడు దిలీప్. ఆ ప‌ధ‌కం ప్ర‌కారం ఓ డ‌మ్మీ కిడ్నాప‌ర్‌ని అరెస్ట్ చేయాలి. దాంతో అస‌లు కిడ్నాప‌ర్ బ‌య‌ట‌కు వ‌స్తాడ‌న్న‌ది పోలీసుల ప్లాన్. రాజాని ఈ ప‌థ‌కం కింద వాడుకోవాల‌ని చూస్తాడు క‌మీష‌న‌ర్‌. దానికి రాజా కూడా ఒప్పుకొంటాడు. ఆ త‌ర‌వాత ఏమైంది?? అస‌లు క‌మీష‌న‌ర్ రాజాని అరెస్ట్ చేయ‌డానికి ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా?? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే ర‌న్ రాజా ర‌న్ చూడాల్సిందే.

వినోద‌మే ప్ర‌దానంగా అల్లుకొన్న క‌థ ఇది. వాటిలో రొడ్ మూవీ ఫార్ములాని కొంత‌, క్రైమ్ కామెడీని కొంత క‌లిపారు. అయితే ప్ర‌ధాన ఉద్దేశం మాత్రం ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే. ఈ విష‌యంలో ఏమాత్రం లోటు చేయ‌కుండా క‌థ‌నం సాగింది. సీన్ నెంబ‌ర్ 1 నుంచి శుభం కార్డు వ‌ర‌కూ – ప్ర‌తీ సీన్‌నీ వినోదం కోస‌మే వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. పాత్ర‌ల ప‌రిచ‌యం. వాటి ప్ర‌వ‌ర్త‌న‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ హ్యూమ‌ర్ ఉంటుంది. పోలీస్ క‌మీష‌న‌ర్ కూతుర్ని హీరో ప్రేమించ‌డం, ఆ ప్రేమ‌ని త‌న అధికారం, ప‌ర‌ప‌తి అడ్డు పెట్టే హీరోయిన్ తండ్రులు.. ఎంత‌మందిని చూళ్లేదు. ఇదీ అలాంటి క‌థే. కాక‌పోతే.. పాత క‌థ అన్న ధ్యాస రాకుండా చేశాడు ద‌ర్శ‌కుడు. ఇంట్ర‌వెల్‌లో ఓ ట్విస్ట్ ఉంది. దానికి ముందు వ‌ర‌కూ క‌థ అంగుళం కూడా ముందుకు క‌ద‌ల‌దు. అయినా ఆ ఫీలింగ్ రాదు. ప్ర‌తీ సీన్‌.. ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో ఎన‌ర్జిటిక్ గా సాగుతుంది. బోర్ కొట్టే ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇదే స్పీడ్ సెకండాప్ లోనూ ఉంటే.. ర‌న్ రాజా ర‌న్ స్థాయి మ‌రోలా ఉండును. కానీ.. అక్క‌డ కొన్ని త‌ప్ప‌ట‌డుగులు ప‌డ్డాయి. సినిమా డ‌ల్ అయ్యింది. రొటీన్ రివైంజ్ డ్రామా ల‌క్ష‌ణాలు, బీసీ కాలంనాటి ఫార్ములా ఇక్క‌డా క‌నిపిస్తాయి. అయితే.. దానికి మ‌ళ్లీ ఫ‌న్ కొటింగ్ ఇచ్చి బాగా క‌వ‌ర్ చేశాడు ద‌ర్శ‌కుడు. టోట‌ల్‌గా ఓ మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌ ని అందించాడు. భారీ యాక్ష‌న్ సీన్ల‌కు చోటున్నా… అక్క‌డా లైట్ వేలోనే న‌డిపాడు. ఈ ఎత్తుగ‌డ కూడా వ‌ర్క‌వుట్ అయ్యింది. లేదంటే… శ‌ర్వాపై భారీ ఫైట్లు ఎవ‌రు చూస్తారిప్పుడు..??

శర్వానంద్‌కి ఇది పూర్తిగా కొత్త పాత్ర‌. అత‌నిలోని అన్ని యాంగిల్స్‌ని ప‌రిపూర్ణంగా వాడుకొన్నార‌నిపిస్తుంది. ఇది వ‌ర‌కు శ‌ర్వానంద్‌ని న‌టుడిగానే చూశారు. ఇప్పుడు అత‌నిలోని ఎన‌ర్జిటిక్ హీరో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. రాజాగా నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాతో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టేసిన‌ట్టే. సీర‌త్ క‌పూర్ కూడా ఒకే అనిపిస్తుంది. సంత‌ప్‌కి ఇది వెరైటీ పాత్ర‌. అత‌ని నుంచి కామెడీ కూడా ఆశించొచ్చ‌ని ఈ సినిమా రుజువు చేసింది. అడ‌వి శేష్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకొంటుంది. అత‌ను బాగా ఇంప్రూవ్ అయ్యాడు. కోట‌, వెన్నెల కిషోర్‌… ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ప‌రిధికి త‌గిన‌ట్టు రాణించారు.

సినిమా చాలా రిచ్‌గా ఉంది. యూవీ క్రియేష‌న్స్.. నిర్మాణ విలువ‌లు తెర‌పై క‌నిపించాయి. శ‌ర్వానంద్‌పై, ఓ కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మి ఇంత రిచ్ గా సినిమా తీయ‌డం విశేష‌మే. ఫొటోగ్ర‌పీ హై క్లాస్ గా ఉంది. వీలైనంత క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాడీ సినిమాని. జిబ్రాన్ సంగీతం కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ద‌ర్శ‌కుడు గురించి చెప్పుకోవాలి. అత‌నికి ఇదే తొలి సినిమా. ల‌ఘు చిత్రాలు తీసిన అనుభ‌వం మాత్రం ఉంది. యువ‌తరాన్ని న‌మ్ముకోవ‌చ్చు.. నిక్షేపంగా సినిమా తీయొచ్చు.. అన్న న‌మ్మ‌కం క‌లిగించాడు సుజిత్‌. ప్ర‌తీ పాత్ర‌ని మ‌ల‌చిన విధానం, ట్విస్టులు రాసుకొన్న ప‌ద్ధ‌తి, రాసుకొన్న క‌థ ఎలాంటి త‌డ‌బాటుకీ గురికాకుండా తెర‌పై ఆవిష్క‌రించిన వైనం అంద‌రినీ ఆక‌ట్టుకొంటాయి. ఇక యువ హీరోలు.. సుజిత్ చుట్టూ తిర‌గ‌డం ఖాయం.

కొన్ని మైన‌స్‌లున్నా.. వాటిని పెద్ద మ‌న‌సు చేసుకొని క్ష‌మించేయొచ్చు. యాక్ష‌న్‌, మాస్ మ‌సాలా కోరుకొనే ప్రేక్ష‌కుల‌కు ర‌న్‌రాజా ర‌న్ 50 % మాత్ర‌మే ఎక్కుతుంది. టైమ్ పాస్ కావాల‌నుకొంటే.. 150 శాతం న్యాయం చేస్తుంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5               – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|