రివ్యూ: సాహ‌సం

sahasam-telugu-movie-review-rating

 ఫలించిన ‘సాహసం

కొత్తగా ఆలోచించేవాళ్లే కరువైపోయారు. మన సినిమా ఎప్పుడూ పడికట్టు సూత్రాల మధ్యలోనే నగిలిపోతోంది. అప్పడప్పుడూ చంద్రశేఖర్ యేలేటి లాంటి దర్శకులు కాస్త రిలీఫ్ ఇస్తుంటారు. ‘ఐతే’ సినినిమాతో చిన్న సినిమాలకు కొత్త ‘రూపు’ ఇచ్చిన దర్శకుడాయన. ‘అనుకోకుండా ఒకరోజు’ ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’ ఇవన్నీ ఆయన పంథా తెలియజేశాయి. ఇప్పుడాయన నుంచి మరో సినిమా వచ్చింది. అదే ‘సాహసం’. ఇది కూడా చందూ శైలిలోనే కొత్తదారిలో సాగపోయిందా? లేదంటే ఆయన కూడా గోపీచంద్ కోసం కమర్షయల్ సూత్రాలు పాటించారా? తెలుసుకొందాం.. రండి.

గౌతమ్ వర్మ (గోపీచంద్) ఓ సెక్యురిటీ గార్డు. ‘నాది కానిది కోటి రూపాయలైనా వద్దు. నాదన్నది అర్థ రూపాయైనా అడగొద్దు’ అనే క్యారెక్టర్. సడన్ గా జాక్ పాట్ కొట్టేసి కోటీశ్వరుడు అయిపోదామని కలలు కంటుంటాడు. ప్రతిరోజూ లాటరీలు కొంటాడు. కానీ ఒక్కసారి కూడా అదృష్టం కలసిరాదు. ఓసారి ఏటీఎమ్ ని లూఠీ చేస్తున్న దొంగల ముఠాను అడ్డుకొంటాడు. అప్పుడు కూడా ప్రమోషన్ రాదు సరికదా.. ఓ డంప్ యార్డ్ కి సెక్యురిటీగా డిమోషన్ ఇస్తారు. ఉసురోమంటూ జీవితం సాగిస్తున్న గౌతమ్ కి తన తాతలనాటి ఆస్తులకు సంబంధించిన ఓ నిజం తెలుస్తుంది. తన ఇంట్లోనే అందుకు సంబంధించిన ఓ ‘కీ’, తాతయ్య డైరీ, వీలునామా లభిస్తాయి. ఆ నిధి ఇండియాలో కాదు.. పాకిస్థాన్ లో ఉంది. అక్కడికి వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. ఇదే నిధి కోసం పాకిస్థాన్ లో మరో ముఠా ప్రయత్నిస్తుంటుంది. మరి గౌతమ్ అక్కడికి వెళ్లగలిగాడా? వెళ్లి నిధిని సాధించాడా? అనేదే ఈ సినిమా కథ.

మనవైన కమర్షియల్ కథలకు చాలా దూరంగా అల్లుకొన్న కథ ఇది. నిధుల నేపథ్యంలో హాలీవుడ్ లో ‘ఇండియానా జోన్స్’ లాంటి క్లాసిక్ సినిమాలొచ్చాయి. తెలుగులో ‘మెరుపుదాడి’, ‘కొదమసింహాం’, ‘టక్కరిదొంగ’ ఇలాంటి కథలొచ్చాయి. అయితే గత కొంతకాలంగా ఈ పాయింట్ మనవాళ్లు ఎవరూ టచ్ చేయలేదు. చందూ మాత్రం ఆ ‘సాహసం’ చేశాడు. నిధిని అన్వేషిస్తూ హీరో సాగించిన ప్రయాణం ఓ ఫజిల్ లానే ఉంటుంది. తీసుకొన్న నేపథ్యం, ఎంచుకొన్న లొకేషన్స్ ఇవన్నీ సినిమాకి కొత్తదారిలోకి తీసుకెళ్ళేందుకు దోహం చేశాయి. తరవాత ఏమవుతుంది? అనే ఉత్కంథ కలిగించడంలో దర్శకుడు కొంత వరకూ సఫలీకృతుడయ్యాడు. ముఖ్యంగా ఇంట్రవెల్ నుంచి కథలో వేగం వస్తుంది. అక్కడక్కడా కాస్త ‘స్లో’ నేరేషన్ ఇబ్బంది పెట్టినా మళ్లీ పతాక సన్నివేశాలతో సినిమా ఊపందుకొంటుంది.

గోపీచంద్ కి యాక్షన్ ఇమేజ్ ఉంది. దాన్ని నమ్ముకొంటూనే కాస్త కొత్తగా చేసిన ప్రయత్నం ఇది. యాక్షన్, ఎమోషన్ దృశ్యాల్లో చాలా బాగా నటించాడు. ఒక విధంగా గౌతమ్ పాత్రలోకి చాలా ఈజీగానే వెళ్లిపోయాడు. శ్రీనిధిగా కనిపించిన తాప్సీకి అంత స్కోప్ లేదు. నిజానికి ఓ హీరో, హీరోయిన్ చుట్టూ తిరిగే కథ కాదు కాబట్టి ఆ లోటును మర్చిపోవచ్చు. పాటలూ, రొమాంటిక్ సన్నివేశాల గురించి దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా అదీ మంచికే. ఎందుకంటే.. కథలోని టెంపో చెడిపోకుండా అది దోహదం చేస్తుంది.

కథలో ఎక్కువ భాగం పాకిస్థాన్ లో జరిగుతుంది. ఆ సన్నివేశాలన్నీ లడక్ లో తీశారు. అయితే అక్కడి వాళ్లంతా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రేక్షకుల సౌలభ్యం కోసం తెలుగు మాట్లాడించినా.. మరీ అంత స్వఛ్ఛమైన తెలుగు అవసరం లేదేమో..? గౌతమ్ తాతయ్య (సుమన్) వజ్రాల వ్యాపారి. ఆ సంగతి గౌతమ్ నాన్నకి ఎందుకు తెలియదో అర్థం కాదు. ‘మా నాన్న డొక్కు సైకిల్ వేసుకొని తిరిగేవాడు’ అని ఎందుకు చెప్తాడు? పైగా సన్నివేశాల్లో చాలా వరకూ అక్కడిక్కడ అల్లుకొన్నట్టు చూపించాడు. హీరో ఏం అనుకొంటే అదే జరిగిపోతుంది. ఇంత పెద్ద నిధి ఓ చోట ఉందని తెలిసినప్పుడు పాక్ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఎందుకు ఉండిపోతుంది? అలీ పాత్రని సరిగా వాడుకోలేదు. ఈ సినిమాలో వినోదం మిస్. కథ మొదటి నుంచీ సీరియస్ గానే సాగుతుంది. విలన్ గా నటించిన శక్తికపూర్ ఫర్వాలేదు గానీ ఆయన్ని గుర్తుపట్టడం కష్టం.

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, యాక్షన్ ఘట్టాలు అన్నీ ఉన్నతంగానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఏదో ఫీల్ మిస్సయింది. కథలోకి ప్రేక్షకుడు వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. దాంతో పాటు తెరపై జరుగుతున్న తతంగం గుడ్డిగా చూడ్డం మినహా ప్రేక్షకుడు కూడా ఆలోచించేలా దర్శకుడు చేయలేకపోయాడు. ఇవన్నీ మినహాయించి చూస్తే సాహసం ఓ మంచి ప్రయత్నం. ఫక్తు కమర్షియల్ సినిమాల్ని చూసీ విసిగిపోయిన ప్రేక్షకులకు చందూ ఎప్పటిలాగే కాస్త రిలీఫ్ ఇచ్చాడు.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.25/5                                                                       –  స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version