రివ్యూ: సికింద‌ర్‌

sikinder-telugu-movie-review-ratingఫైట్ల‌తో ఫీట్లు చేసిన‌ సికింద‌ర్‌ | Click here for English Review

కొత్త క‌థ అర్థ‌మ‌య్యేట్టు చెప్పాలి. తెలిసిన క‌థ కొత్త‌గా చెప్పాలి. ఇదీ సినిమాకి సంబంధించిన ఓ ప్రాధ‌మిక సూత్రం. పాత క‌థ‌ని ఎంత ఫ్రెష్‌గా చెబితే… ఇప్పుడు అంత కిక్‌. అలాంటి క‌థ‌లే స‌క్సెస్ అవుతున్నాయ్ కూడా. రివైంజ్ డ్రామా అన్న‌ది సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచీ ఉంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఆ రివైంజ్ తీర్చుకొనే విధానం కొత్త‌గా ఆలోచిస్తున్నారు ద‌ర్శ‌కులు. సికింద‌ర్ కూడా ఓ రివైంజ్ స్టోరీనే. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు లింగు స్వామి కాబ‌ట్టి… ఆ క‌థ‌ని ఎన్ని మ‌లుపుల‌తో, ఎంత ఆస‌క్తిగా తీర్చిదిద్దాడు అన్న విష‌యంపై ఫోక‌స్ పెరుగుతుంది. ఎందుకంటే.. లింగుస్వామి ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఆవారా, ర‌న్‌, పందెంకోడి సినిమాలు చూస్తే.. ఈ ద‌ర్శ‌కుడికి ఫ్యాన్ అయిపోవాల్సిందే ఎవ‌రైనా. అత‌నికి సూర్య తోడ‌య్యాడు. ఇంకేముంది?? ఈ సినిమా బ్యాంగ్ … బ్యాంగ్‌.. బ్యాంగ్ అయిపోవాల్సిందే. మ‌రి… ఈ కల‌, ఆ క్యాప్ష‌న్ నిజ‌మ‌య్యాయా? సూర్య‌, లింగుస్వామి జోడీ ప్రేక్ష‌కులు కోరుకొనే అద్భుతాన్ని సృష్టించాయా?? తెలుసుకొందాం రండి.

కృష్ణ (సూర్య‌) త‌న అన్న‌య్య‌ని వెదుక్కొంటూ… ముంబై వ‌స్తాడు. కృష్ణ అన్న‌య్య ఎవ‌రో కాదు.. రాజూభాయ్ (సూర్య‌). త‌ను ముంబైలో మాఫియా డాన్‌. చందు (విదుత్ జ‌మాల్‌) ఇద్ద‌రూ ప్రాణ స్నేహితులు. ముంబైలో వీళ్ల‌దే ఆధిపత్యం. ఎలాంటి ప‌నైనా చాక‌చక్యంగా చ‌క్క‌బెడ‌తాడు రాజూభాయ్‌. చందుకి కుడిభుజం. చందు ఏం చెబితే అదే. చందూ కూడా అంతే. రాజూ భాయ్ కోసం ఏమైనా చేస్తాడు. సిటీకి కొత్త క‌మీష‌న‌ర్ వ‌స్తాడు. రాజూభాయ్ గ్యాంగ్ దూకుడుకి అడ్డుక‌ట్ట‌వేయాల‌ని చూస్తాడు. క‌మీష‌న‌ర్ కూతుర్ని (స‌మంత‌)ని ఎత్తుకొస్తాడు రాజుభాయ్‌. అక్క‌డ నుంచి ఆ అమ్మాయి. రాజుబాయ్ వెంట ప‌డుతుంది. వీరిద్ద‌రిమ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. `ఈ సిటీకి దూరంగా ఓ వారం రోజుల పాటు ఎక్క‌డైనా స‌ర‌దాగా గ‌డిపి రండి. ఇక్క‌డి విష‌యాలు నేను చూసుకొంటా` అని రాజుభాయ్‌ని పంపుతాడు చందు. కానీ రాజుభాయ్ తిరిగొచ్చేస‌రికి ముంబైలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోయ‌తాయి. రాజుభాయ్ జీవితం చిన్నాభిన్న‌మ‌వుతుంది. అస‌లు ఏం జ‌రిగింది? రాజుభాయ్ ఏమ‌య్యాడు? కృష్ణ అన్న‌య్య‌ని వెదుక్కుంటూ రావ‌డానికి కార‌ణం ఏమిటి? అనేదే సికింద‌ర్ క‌థ‌.

శ‌త్రువుల ద‌గ్గ‌ర కూడా ద్రోహులు ఉండ‌కూడ‌దు… అనేది ఈ సినిమా లాస్ట్ డైలాగ్‌. సినిమా కూడా అంతే. ద్రోహం చుట్టూ సాగుతోంది. త‌న‌కు జ‌రిగిన న‌మ్మ‌క ద్రోహానికి హీరో ఎలా ప‌గ తీర్చుకొన్న‌డ‌న్న‌దే క‌థ‌. ఇలాంటి క‌థ‌లు చాలా చాలా వ‌చ్చాయి. వాటికి మాఫియా బ్యాక్‌డ్రాప్ అవ్వ‌డం, లింగుస్వామి ద‌ర్శ‌కుడు కావ‌డం వ‌ల్ల కాస్త కొత్త కోటింగ్ ఇవ్వ‌డానికి ఆస్కారం దొరికింది. క‌థ‌ని కూడా అలానే ఆసక్తిక‌రంగా మొద‌లెట్టాడు లింగుస్వామి. అన్న‌య్య‌ని త‌మ్ముడు వెదుక్కొంటూ రావ‌డం, ఆ ప్ర‌యాణంలో ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవ‌డం.. ఇంట్ర‌వెల్ లో ఓ ట్విస్టు…ఇవ‌న్నీ బాగానే సాగాయి. ఇంట్రవెల్ వ‌ర‌కూ క‌థ ప‌ట్టు స‌డ‌ల్లేదు. కానీ సెకండాఫ్ లో మాత్రం ఆ జోరు క‌నిపించ‌లేదు. హీరో మామూలుగానే ఒకొక్క‌రినీ చంపుకొంటూ వెళ్లిపోతాడు. అక్క‌డ ట్విస్టులూ, ట‌ర్న్‌లూ ఏమీ ఉండ‌వు. హీరోకి జ‌రిగిన ద్రోహం బ‌య‌ట‌ప‌డిన త‌ర‌వాత క‌థ‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులూ లేవు. ఈ సినిమా అక్క‌డే ట్రాక్ త‌ప్పేసింది. ఏం జ‌ర‌గ‌బోతోందో ప్రేక్ష‌కుడు సుల‌భంగా అంచ‌నా వేసేస్తాడు. లింగుస్వామి ద‌గ్గ‌రున్న గొప్ప విష‌యం ఏంటంటే… అత‌ను ట్విస్టుల‌తో క‌థ‌లో కొత్త మ‌లుపుల్ని గుర్తిస్తాడు. కానీ.. లింగుస్వామి ఈ సినిమా విష‌యంలో త‌న మార్క్ ప‌నిత‌నాన్ని బ‌య‌ట‌కు తీయ‌లేదేమో అనిపిస్తుంది. సెకండాఫ్ లో మ‌న‌కు తెలియ‌ని, సాధార‌ణ ప్రేక్ష‌కుడు క‌నిపెట్ట‌లేని భ‌యంక‌ర‌మైన ట్విస్టు ఉంటుంద‌ని ఊహిస్తే.. అదేం లేక బోసిబోయింది. హీరో త‌న శ‌త్రువుల్ని చంపుకొంటూ వెళ్లి… ఆ ప‌ని పూర్తి చేసేస‌రికి శుభం కార్డ్ ప‌డిపోయింది.

సూర్య రెండు ర‌కాలైన (?) పాత్ర‌ల్లోనూ బాగానే మెప్పించాడు. కృష్ణ క్లాస్ అయితే.. రాజుభాయ్ ప‌క్కా మాస్‌. సూర్య డైలాగ్ డెలివరీ, స్టైలీష్ న‌ట‌న‌, బాడీ లాంగ్వేజ్‌, మేన‌రిజాల‌కు వంక పెట్ట‌లేం. త‌న వైపు నుంచి పొర‌పాట్లు లేకుండా చేసుకొంటూ వెళ్లిపోయాడు. స‌మంత‌కు ప్రాధాన్యం లేని పాత్ర‌. అయితే గ్లామ‌ర్ విష‌యంలో మొహ‌మాట‌ప‌డ‌క‌పోవ‌డం వల్ల‌.. మాస్ ఆమెని చూసి ముచ్చ‌ట‌ప‌డిపోతారు. సెకండాప్ లో పాట‌కు ముందు మాత్ర‌మే వ‌స్తుంది. పాట అయిపోయాక మాయం అయిపోతుంది. విదుత్ జ‌మాల్ న‌ట‌న ఓకే. అతి ముఖ్య‌మైన ఇమ్రాన్ ఖాన్ (మ‌నోజ్ బాజ్‌పేయ్‌) పాత్ర‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారు. ఆ పాత్ర‌ని బిల్డ‌ప్పుల‌కే ప‌రిమితం చేశారు. బ్ర‌హ్మానందం పాత్ర శుద్ద దండ‌గ‌.

సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. కెమెరా, నేప‌థ్య సంగీతం… బాగున్నాయి. పాట‌ల ప్లేస్ మెంట్ త‌ల‌పోటు తెప్పిస్తుంది. సంద‌ర్భం లేకుండా పాట‌లొచ్చేస్తుంటాయ్‌. అవి కూడా ఢ‌మ ఢ‌మ ద‌రువులే. ఏక్ దో తీన్ చార్‌ పాట‌లోని సాహిత్యం సిల్లీగా ఉంది. లింగుస్వామి కూడా ఓ సాధార‌ణ ద‌ర్శ‌కుడిలానే ఆలోచించ‌డం ఈ సినిమాకి పెద్ద మైన‌స్ . అత‌ని నుంచి చూడాల్సిన మెరుపుల్లేవు. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడే సినిమా పూర్త‌యిపోయింది. ఆ త‌ర‌వాత ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్షే.

సాధార‌ణ క‌థ‌, అతి సాధార‌ణ‌మైన స్ర్కీన్ ప్లే, మామూలు క‌మ‌ర్షియ‌ల్ అంశాలు… ఈ మూడింటిని మంచి ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టినా ఓ మామూలు సినిమానే వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి సికింద‌ర్ నిద‌ర్శ‌నం. సూర్య‌ని అభిమానించేవాళ్ల‌కు ఈ సినిమా న‌చ్చొచ్చు. అయితే ఇంకా ఏదో కావాల‌ని ఆశ‌ప‌డి థియేట‌ర్‌లోకి అడుగుపెడితే.. డేంజ‌ర్ జోన్‌లో కాలు పెట్టిన‌ట్టే.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.