రివ్యూ :సింగం

Singam(yamudu-2)-telugu-movie-review-rating

 

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5| Click here for English Review

కేవలం మాస్ కు మాత్రమేః

బాణం అనుకొన్న లక్ష్యాన్ని ఛేదించాలంటే.. ముందు దేనికి గురి పెడుతున్నామో తెలిసుండాలి. చూపు ఎక్కడో ఉండి, లక్ష్యం మరెక్కడో ఉంటే – గురి తప్పకుండా ఎలా ఉంటుంది. సినిమా తీయడం కూడా అంతే! లక్ష్య ప్రేక్షకులు ఎవరో, ఎవరి కోసం సినిమా తీస్తున్నామో తెలిసుండాలి. దర్శకుడు హరి ఈ విషయం పట్ల శ్రద్ద తీసుకున్నాడు. తన సినిమా ‘మాస్’ కోసం.. అని ముందే ఫిక్సయ్యాడు. వారికి ఎలా తీస్తే సినిమా నచ్చుతుందో అలాగే తీశాడు. అదే సింగం. యముడుకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మాస్ ని మురిపించిందా? దాని కోసం సూర్య, హరి ఏం చేశారు?

నరసింహం (సూర్య) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. గోవాలో ఓ కేసు ఛేదించి పోలీస్ డిపార్ట్ మెంట్ లో తిరుగులేని సింహంగా ఎదుగుతాడు. ముఖ్యమంత్రి నరసింహానికి ఓ ప్రత్యేకమైన కేసు అప్పగిస్తాడు. విదేశాల నుంచి కాకినాడకు ఆయుధాల దిగుమతి అవుతున్నాయి. ఆ ముఠా గుట్టు రట్టు చేయమని కాకినాడ పంపిస్తాడు. అయితే, పోలీస్ గా కాదు. ఓ ఎన్ సీసీ ఆఫీసర్ గా, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూనే స్మగ్లర్ల గురించి కూపీ లాగుతాడు. ఈ ముఠాతో భాయ్, త్యాగరాజు, డాలీలకు సంబంధం ఉంది అనే విషయం తేలుస్తాడు. ఆ తరవాతే డీఎస్ పీగా బాధ్యతలు తీసుకుంటాడు. భాయ్, త్యాగరాజు, డాలీ ఈ ముగ్గురి ఆట ఎలా కట్టించాడు? కాకినాడను ఎలా కాపాడాడు? అనేదే కథ.

పక్కా మాస్ యాక్షన్ అంశాలతో సాగే కథ ఇది. కథంటూ ఏమీ లేదు గానీ, యాక్షన్ సీక్వెన్స్ మాత్రం కావాల్సినన్ని ఉంటాయి. అవన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొన్నాడు హరి. స్కూల్లో మాస్టర్ నుంచి డీఎస్ పీగా ఛార్జ్ తీసుకొనే వరకూ – కథ నత్తనడక సాగుతుంది. హన్సిక ప్రేమాయణం కథను పొడగించడానికే. అయితే చివర్లో ఆ పాత్రను సవ్యంగానే వాడుకొన్నట్లు అనిపిస్తుంది. కాకినాడలో కుల ఘర్షణల తరవాత కథ జోరందుకొంటుంది. డాలీని పట్టుకోవడానికి సింహం.. సౌత్ ఆఫ్రికా కూడా వెళ్తాడు. దాంతో పతాక సన్నివేశాల్లో విదేశీ ఛేజింగులు చూసే అవకాశం దక్కింది.

పార్ట్ 1తో పోలీస్తే ఇందులో ట్విస్టులు తక్కువే. ఆ మాటకొస్తే లేవు కూడా. కథంతా స్మగ్లింగ్ చుట్టూనే తిరుగుతుంది. యముడులో ప్రకాష్ రాజ్-సూర్యల మధ్య ఘర్షణ, వారి ఎత్తుకు పైఎత్తులూ కథను రక్తికట్టిస్తాయి. కానీ ఆ అవకాశం పార్ట్ 2లో లేకుండా పోయింది. ఎప్పుడూ సూర్యది ఎన్ సైడ్ వీరబాదుడే! ప్రతి ఒక్కరూ సూర్య చేతిలో చావు దెబ్బలు తినడానికే వస్తుంటారు. యాక్షన్ స్వీక్వెన్స్ కోసం యాక్షన్ స్వీక్వెన్స్ అన్నట్టుగా సాగాయి. ఆ పోరాట సన్నివేశాలన్నీ. మొత్తానికి అవి బీ,సీ ఆడియెన్స్ కి నచ్చేలా తీర్చిదిద్దారు.

యముడులో ఉంది కదా.. అని అనుష్కని ఈ సినిమాలోనూ పెట్టుకొన్నారంతే. ఆమె చేసింది ఏమీలేదు. పాట కావాల్సినప్పుడల్లా ప్రత్యక్షం అవ్వడం తప్ప. ఒకవేళ అనుష్క అందుబాటులో లేకపోతే ఆమెను వెతుక్కొంటూ వెళ్లిపోతాడు సూర్య.. పాట కోసం. అంజలి ఓ హాట్ గీతంలో కనిపించింది. ఆమెపై కెమెరా సరిగ్గా ఫోకస్ చేయలేదు. దాంతో అంజలి మమ.. అనిపించింది. హన్సిక కూడా ఏదో ఉందంతే! అయితే చివర్లో కాస్త డ్రామా పండడానికి తోడ్పడింది. కథను ఎంత వరకూ సాగదీయాలో అంత వరకూ సాగదీశాడు హరి. ఇంట్రవెల్ కే దొంగలందరూ పట్టుబడిపోదురు. అలాగైతే కథ క్లైమాక్స్ వరకూ నడవదని – ఆ దొంగల్ని వదిలేశాడు. బలమైన ప్రతినాయకుడు లేకపోవడం ఈ సినిమాకి మైనస్. సంతానం కామెడీకి బలవంతంగా నవ్వుకోగలిగితే నవ్వుకోవచ్చు.

సూర్య యాక్షన్ ఘట్టాల్లో అలవాటు ప్రకారం రాణించాడు. డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ, గొంతు పోయి ఉంటుంది. అన్ని అరుపులున్నాయి. డాన్సులు కూడా ఫైట్ల్ లానే చేశాడు సూర్య. ఆ ఎమోషన్స్ నుంచి బయటకు రాలేక. ఇక మిగిలిన వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దేవి శ్రీ సంగీతం డబ్బింగ్ సినిమాలకు తగ్గట్టే ఉంది. ఆర్. ఆర్ లో కూడా ఆయన మార్క్ కనిపించలేదు. నిర్మాత మాత్రం భారీగా ఖర్చుపెట్టాడు. తెరపై తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. అంతా అరవవాసనే.

ఫైట్లూ, ఫీట్లూ అరుపులూ బాగానే ఉన్నాయి. పోలీస్ పవర్ చూపించాడు. కాకపోతే వీటిని అల్లుకొంటూ హరి మార్కు పనితనం కూడా కనిపిస్తే బాగుండును. అది లేదు కాబట్టే కేవలం ఈ సినిమా మాస్ కి పరితమితమైపోతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5                                                                       –  స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version