రివ్యూ : ట్రాఫిక్

t

థ్రిల్లింగ్‌ గా సాగిన‌ ట్రాఫిక్‌ :  తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5       |Click Here for English Review|

కొత్త క‌థ‌లు పుట్టడం లేదు అనుకొంటారు గానీ.. ఎందుకు లేవు…? దాదాపుగా ప్రతీ ద‌ర్శకుడూ కొత్తగా ఆలోచించి ఓ లైన్ త‌యారు చేసుకొంటాడు. లైన్ బ‌లంగానే ఉంటుంది. కానీ దాన్ని సినిమాగా తీయాల‌నుకొన్నప్పుడు ఆ లైన్ స‌రిపోదు. దాని చుట్టూ క‌మ‌ర్షియ‌ల్ పోత కూడా పూయాల్సిఉంటుంది. క‌థ‌లో పెద్ద హీరో వ‌చ్చి చేరితే – అత‌ని కోసం ఇంకొన్ని నాట‌కీయ మార్పలు చేస్తారు. దాంతో క‌థ అనుకొన్నదొక్కటీ, తెర‌పై క‌నిపించేది మ‌రోటి. చాలా మంచి క‌థ‌లు ఇలానే చెద‌లు ప‌ట్టుకుపోతున్నాయి. కానీ మ‌లయాళ చిత్రం ‘ట్రాఫిక్’ అలా కాదు. క‌థ‌కు ఏం కావాలో అదే చేశారు. స్టార్ ఆర్భాటం లేదు. నాట‌కీయ‌త లేదు. దాంతో.. ప్రేక్షకుల్ని అల‌రించ‌డానికి ఆ లైన్ స‌రిపోయింది. ఆ క‌థ‌తే త‌మిళంలో చేన్నయిల్ వ‌రునాల్ పేరుతో రీమేక్ అయ్యింది. దాన్ని మ‌ళ్లీ ట్రాఫిక్ పేరుతో తెలుగులోకి అనువ‌దించారు. చ‌క్కటి స్ర్కీన్‌ ప్లేకి నిదర్శనంగా సాగిన ట్రాపిక్ క‌థేంటి? ఈ సినిమా సాగిన విధానం ఎలాంటిది? చూద్దాం… రండి.

గౌత‌మ్ (ప్రకాష్ రాజ్‌) ఓ సినిమా హీరో. ఎప్పుడూ షూటింగ్ గొడ‌వే. కూతుర్ని ప‌ట్టించుకొనే తీరిక కూడా ఉండ‌దు. కార్తీ (స‌చిన్‌) కి మంచి ఆశ‌యాలున్నాయి. జ‌ర్నలిస్టుగా మారి.. ఈ స‌మాజానికి త‌న‌వంతు సేవ చేయాల‌నుకొంటాడు. అత‌నికి ఉద్యోగం కూడా వ‌స్తుంది. తొలి రోజు ఆపీసుకు బ‌య‌ల్దేర‌తాడు. స‌త్యమూర్తి (చేర‌న్‌)ది మ‌రో క‌థ. అత‌నో ట్రాఫిక్ కానిస్టేబుల్‌. చెల్లాయి కోసం తొలిసారి లంచం తీసుకొని ప‌ట్టుబ‌డ‌తాడు. ఓ పెద్దాయ‌న్ని ప‌ట్టుకొని రిక‌మెండేష‌న్ తో తొలి రోజు ఉద్యోగానికి వ‌స్తాడు. వీళ్లంతా ట్రాఫిక్ సిగ్నల్ ద‌గ్గర క‌లుస్తారు. అనుకోని ప‌రిస్థితుల్లో కార్తిని ఓ కారు గుద్దేస్తుంది. చావు బ్రతుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న కార్తిని ఆసుప‌త్రికి చేరుస్తారు. కార్తిని బ‌తికించ‌లేమ‌ని డాక్టర్లు తేల్చేస్తారు. అదే స‌మ‌యంలో గౌత‌మ్ కూతురికి ఆప‌రేష‌న్ జ‌రుగుతుంటుంది. గుండె మారిస్తేగానీ ఆమె బ‌త‌క‌దు. గౌత‌మ్ గుండెను ఆ అమ్మాయికి అమ‌ర్చడానికి కార్తి ఇంట్లోవాళ్లు ఒప్పుకొంటారు. కానీ… మూడు గంట‌ల్లో ఆప‌రేష‌న్ జ‌రిపోవాలి. హైద‌రాబాద్ నుంచి కోదాడ 180 కి.మీ. ఈ ప్రయాణం కేవ‌లం 90 నిమిషాల్లో జ‌ర‌గాలి. మ‌రి.. గుండెమార్పిడి జ‌రిగిందా? మ‌ధ్యలో ఎలాంటి ఆటంకాలు ఎదుర‌య్యాయి..? అన్నదే ట్రాఫిక్‌!!

ఇదో కొత్త ప్రయ‌త్నం. ఇలాంటి క‌థ‌తో కూడా సినిమా తీయొచ్చా..?? అని ముక్కున వేలేసుకొనే లైన్ ఇది. అవ‌య‌వ‌దానం చేయ‌డం అవ‌స‌రం అంటూ ఓ మంచి సందేశం కూడా ఇచ్చారు చివ‌ర్లో. కానీ మ‌ధ్యలో సాగే క‌థంతా థ్రిల్లింగ్‌ గా న‌డిచింది. గుండె మార్పిడి జ‌రుగుతుంది అన్న విష‌యం థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఈజీగానే ఊహిస్తాడు. కానీ మ‌ధ్యలో ఓ ట్విస్ట్ రాసిపెట్టుకోవ‌డం.. ద‌ర్శకుడి ప‌నిత‌నానికి నిద‌ర్శనం. స్ర్కీన్ ప్లే ఇంత బిగుతుగా ఉంటే.. స్టార్ కాస్టింగ్‌. పాటలూ, అన‌వ‌స‌ర హంగామా అవ‌స‌రం లేదు. ట్రాఫిక్ విష‌యంలో ద‌ర్శకుడు ఆ విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోలేదు. క‌థ‌కు ఏం కావాలో, అది చేసుకొంటూ పోయాడు. అది ట్రాఫిక్ సినిమాకి అతి పెద్ద ప్లస్‌.

ఓ పాట‌తో సినిమా స్లోగా మొద‌లువుతుంది. ప్రధాన పాత్రల జీవితాల్ని మొద‌టి 20 నిమిషాల్లో చూపించే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. గుండెమార్పిడి అనే టాపిక్ వ‌చ్చే వ‌ర‌కూ క‌థ నెమ్మదిగానే సాగుతుంది. ఆ త‌ర‌వాత‌… జెట్ స్పీడ్ అందుకొంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ద‌గ్గర ద‌ర్శకుడు త‌న నేర్పు చూపించాడు. ఎక్కడ క‌ట్ చేయాలో.. అక్కడే చేసి – సెకండాఫ్‌ పై ఆస‌క్తి పెంచాడు. అక్రమ సంబంధం అనే లైన్ ప‌ట్టుకొన్న ద‌ర్శకుడు – దాన్ని క‌థ‌లో తెలివిగా మేళ‌వించి ట్విస్ట్ కి దారిచ్చుకొన్నాడు. దాంతో సెకండాఫ్ కూడా జోరుగానే సాగుతుంది. మ‌ధ్యలో క‌థ డ‌ల్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. కానీ సూర్య రాక‌తో మ‌ళ్లీ సినిమాకి ప్రాణం వ‌స్తుంది. ఆయ‌న‌ది చిన్న పాత్రే. కానీ.. మెరుపులా అనిపిస్తుంది.

ప్రకాష్‌రాజ్‌, శ‌ర‌త్‌ కుమార్‌, రాధిక‌, చేర‌న్ త‌ప్ప మిగ‌తావాళ్లతో తెలుగు ప్రేక్షకుల‌కు పెద్దగా ప‌రిచ‌యం లేదు. అది కొంత వ‌ర‌కూ ప్లస్‌. ఇంకొంత మైన‌స్‌. మ‌న‌కు తెలిసిన పాత్రలు తెర‌పై క‌నిపిస్తే… పాత్రధారుల డామినేష‌న్ కనిపిస్తుంది. మ‌న‌కు తెలియ‌ని పాత్రల‌తో త్వర‌గా జ‌ర్నీ చేయ‌లేం. అదొక్కటీ మిన‌హాయిస్తే.. తెర‌పై క‌నిపించిన ప్రతి ఒక్కరూ త‌మ పాత్రల‌కు న్యాయం చేశారు. చేర‌న్ ఆక‌ట్టుకొంటాడు. అత‌నికి డైలాగులు చాలా త‌క్కువ. ఎక్స్ ప్రెష‌న్స్ తోనే న‌టించేశాడు. ప్రకాష్ రాజ్ పాత్రకు ఎవ‌రో డ‌బ్బింగ్ చెప్పారు. అది కూడా కృత‌కంగా ఉంది. ప్రకాష్‌ రాజ్ లా మాట్లాడాలి, త‌న‌ని ఇమిటేట్ చేయాలి అనుకొన్నాడా గాత్రధారి. ప్రకాష్ రాజ్ గొంతుకు అల‌వాటు ప‌డిన ప్రేక్షకులు.. ఈ విష‌యాన్ని మాత్రం జీర్ణించుకోలేరు.

సాంకేతికంగా ఏ డిపార్ట్ మెంట్‌నీ త‌క్కువ చేయ‌లేం. కానీ మ‌రీ అంత గొప్పగా కూడా లేవు. బ‌డ్జెట్ ప‌రిమితుల‌కు లోబ‌డి సినిమా తీశార‌నే సంగతి అర్థమ‌వుతూనే ఉంటుంది. పాట‌లు మైన‌స్‌. ఆర్‌.ఆర్ మాత్రం.. ఉలిక్కిప‌డేలా చేస్తుంటుంది. స్ర్కీన్ ప్లే ప‌ర్‌ఫెక్ట్‌. ఈ విష‌యంలో మాతృక ద‌ర్శకుడిని అభినందించాలి. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయిస్తే బాగుండును అనిపిస్తుంది. డ‌బ్బింగ్ సినిమా, అందులోనూ మ‌న‌కు తెలియ‌ని న‌టీన‌టులు కాబ‌ట్టి.. సినిమాకి ద‌క్కవ‌ల‌సిన గౌర‌వం దక్కుతుందా అనేది అనుమాన‌మే. 90 నిమిషాల్లో 180 కి.మీ.. అదీ రోడ్డు మార్గం అంటే.. న‌మ్మశ‌క్యం కాదు. టైమ్ లేదు, లేదు.. అంటుంటూనే తెర‌పై కాల‌యాప‌న చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. పాత్రల ఎంట్రీ ప‌ర్‌ ఫెక్ట్ గా ఇచ్చిన ద‌ర్శకుడు వాటి ఎగ్జిట్ మాత్రం ఇవ్వలేక‌పోయాడు. త‌ర‌వాత ఏం జ‌రుగుతుందో మీరే ఊహించుకోండి.. అని వ‌దిలేశాడు. చిన్నచిన్న మైన‌స్‌ ల‌ను ప‌క్కన పెడితే.. ట్కాఫిక్ ఓ కంప్లీట్ థ్రిల్ అందిస్తుంది. అయితే సీ సెంట‌ర్‌ కు ఈ సినిమా ఎక్కే అవ‌కాశం చాలా త‌క్కువ‌.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here for English Review