రివ్యూ : వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్

Venkatadri-Express-Telugu-Movie-Reviews-Ratingsవెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ : ప‌ట్టాలు త‌ప్పలేదుతెలుగు మిర్చి రేటింగ్: 3.25/5

సినిమా అంటే ఇలానే ఉండాలి అనే రూలుందా..? అదే హీరోయిజం, అవే పాట‌లు, అవే డైలాగులూ – కాస్త రూలు బ్రేక్ చేయండి సార్! ఆ సాహ‌సం ఒక్క చిన్న సినిమాలే చేస్తాయోమో? అలా చేసిన సినిమాల్ని చిన్న సినిమా అన‌డం కూడా త‌ప్పే! తెలుగు ప్రేక్షకుడికి కాస్త కొత్తద‌నం రుచి చూపించే ప్రతీ సినిమా పెద్ద సినిమానే. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌నీ ఈ జాబితాలో చేర్చేద్దాం. ఇదేం `గొప్ప‌` సినిమా కాదు. కానీ మేం గొప్ప సినిమా తీశామోచ్ అని డ‌ప్పులు కొట్టుకొని, డ‌బ్బులు త‌గ‌లేసే చెత్త సినిమాల మ‌ధ్య‌… ఇది మంచి సినిమానే! ఇంత‌కీ వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఈ సినిమా ఎలా ఉంది? ఎందుకు చూడాలి – ఈ ప్రశ్నల‌కు స‌మాధానం తెలియాలంటే రివ్యూ రైలు ఎక్కాల్సిందే!

మ‌రీ… వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ అంత పెద్ద  క‌థ కాదు గానీ… ఇంజ‌న్ పెట్టెలా – దూకుకెళ్లగ‌లిగే క‌థే! రామ్మూర్తి మాస్టారు.. రిటైర్డ్ హెడ్ మాస్టారు. క్రమ శిక్షణ అంటే ప్రాణం. ఇంట్లో ఓ రాజ్యాంగం ఉంటుంది. దాన్ని అంద‌రూ పాటించాల్సిందే. వంద త‌ప్పులు చేసిన ఎవ‌రినైనా ఆ ఇంట్లోంచి నిర్థాక్షిణ్యంగా త‌రిమేస్తుంటాడు. ఆ కౌంట్‌కి ద‌గ్గర ప‌డ‌తాడు చిన్నకొడుకు సందీప్ (సందీప్ కిష‌న్‌). కావాల‌ని ఎవ‌రితో గొడ‌వ పెట్టుకోడు. కానీ ఎవ‌రైనా గొడ‌వ ప‌డుతుంటే చూడ‌లేడు. అందుకే సందీప్ కౌంట్ 99 వ‌ర‌కూ వ‌స్తుంది. ఇంకో త‌ప్పు చేస్తే.. ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం ఖాయం. అంత‌లో అన్నయ్య (బ్రహ్మజీ) పెళ్లి కుదురుతుంది. తిరుప‌తిలో పెళ్లి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణం. కానీ అంత‌లోనే ఓ ట్విస్టు. సందీప్ ట్రైన్ మిస్ అవుతాడు. అత‌ని ద‌గ్గర తాళి ఉండిపోతుంది. తెల్లారేలోగా పెళ్లి. తాళి తీసుకెళ్లక‌పోతే.. వంద త‌ప్పులూ పూర్తవుతాయి. ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల్సి ఉంటుంది. మ‌రి సందీప్ ఏం చేశాడు.? వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఎలా అందుకొన్నాడు. ఈ ప్రయాణంలో ప‌రిచ‌య‌మైన ప్రార్థన (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) క‌థేంటి? ఇవ‌న్నీ తెలియాలంటే.. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ టికెట్ కొనాల్సిందే.

చాలా చాలా సింపుల్ క‌థ ఇది. న‌డ‌పాలంటే.. స్ర్కీన్ ప్లే అల్లుకొనే తెలివి తేట‌లుండాలి. కొత్త ద‌ర్శకుడు మేర్ల‌పాక గాంధీ – ఈ విష‌యంలో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. క‌థ ఎత్తుగ‌డ స్లోగా ఉన్నా – ట్రైన్ ఎపిసోడ్ నుంచి సినిమా ఊపందుకొంటుంది. హీరో.. ట్రైన్ ని అందుకొన్నాడనే సంగతి ముందే చెప్పేసి, ఎలా అందుకొన్నాడో పార్టులు పార్టులుగా చూపించ‌డం ఆక‌ట్టుకొంటుంది. చిన్న చిన్న ట్విస్టులే గానీ, స‌ర‌దాగా – హాయిగా ఉన్నాయి. ట్రైనులో స‌ప్తగిరి పాత్ర కావ‌ల్సినంత వినోదం పండిస్తుంది. సాహిత్యం మీద పిచ్చి అభిమాన‌మున్న టీటీ… కూడా న‌వ్విస్తాడు. హీరోయిన్ కూడా క‌థ‌ని న‌డిపించ‌డంలో తోడ్పడింది. పాట‌ల గోల లేదు. ఉన్నవి రెండు పాట‌లే. ఆ మాత్రం రిలీఫ్ ఉండాలి కూడా. మొత్తమ్మీద ఓ స‌ర‌దా ఛేజింగ్‌లా ఈ సినిమా సాగిపోయింది. బ‌ట‌య‌కు వ‌చ్చి గుర్తించుకొని మ‌ళ్లీ మ‌ళ్లీ త‌ల‌చుకొనేంత గొప్పగా లేదు గానీ, సినిమా చూస్తున్నంత సేపూ టైమ్ పాస్ అయిపోవ‌డం గ్యారెంటీ!

సందీప్ త‌న పాత్రను అల‌వోక‌గా చేశాడు. న‌ట‌న‌, డాన్సులు, ఫైట్స్ ఈ మూడు విబాగాల్లోనూ మంచి మార్కులు ప‌డ‌తాయి. అత‌ని వాయిస్ ప్రధాన బ‌లం. కొన్ని డైలాగులు ప‌లికేట‌ప్పుడు… అత‌ని గొంతు ప్లస్ అయ్యింది. ఇక కొత్తమ్మాయి ర‌కుల్ ఫ‌ర్వాలేదు. ఇప్పుడొస్తున్న తింగ‌రి బ్యాచ్ హీరోయిన్లతో పోలిస్తే బెట‌రే. అప్పుడ‌ప్పుడూ కాస్త ఓవ‌ర్ యాక్షన్ చేసింది. నాగినీడు గెట‌ప్ ఈ సినిమాలోనూ మార‌లేదు. పాత సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ ఈ సినిమాలోనూ కంటిన్యూ చేశారేమో అనిపిస్తుంది. న‌ట‌నా డిటోనే. అదే ప్లేసులో రావు ర‌మేష్‌లాంటి న‌టుడు ఉంటే.. ఆ పాత్ర మ‌రింత ర‌క్తిక‌ట్టేది. స‌ప్తగిరి గిలిగింత‌లు పెట్టే బాధ్యత స‌క్రమంగా నిర్వర్తించాడు. ఎమోష‌న్ సీన్స్‌లో బ‌లం లేదు. బొమ్మరిల్లు ప‌తాక స‌న్నివేశాలు గుర్తొస్తాయి. అంత సెంటిమెంట్ కూడా అవ‌స‌రం లేదు. చేప‌న్నాక ముళ్లూ, జీవిత‌మ‌న్నాక బాధ‌లూ ఉంటాయి… అనే డైలాగ్ ఉందీ ఈ సినిమాలో. సినిమా అన్నాక మైన‌స్‌లూ ఉంటాయి. అయితే అవి ఈ సినిమాలో త‌క్కువే. కొత్త ప్రయ‌త్నం చేస్తున్న‌ప్పుడు కొన్ని లాజిక్‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వాలి.

సాంకేతిక విభాగంలో స్ర్కీన్ ప్లేకి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. అదే ఈ సినిమాకి ప్రధాన బ‌లం. ఆ త‌ర‌వాత చోటా కెమెరా ప‌నిత‌నం గురించి చెప్పుకోవాలి. మేన‌ల్లుడి సినిమా అనేమో.. కాస్త జాగ్రత్తగా ప‌నిచేశాడు. రెండు పాట‌లూ క‌ల‌ర్‌ఫుల్ గా తీశాడు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ర‌మ‌ణ గోగుల‌కు అంత ప‌ని క‌ల్పించ‌లేదు. ఆర్‌.ఆర్‌లో త‌న ప‌నిత‌నం చూపించుకోగ‌లిగాడు. కొన్ని పాట‌లు బాగున్నాయి. అయితే… ఇంకాస్త బాగా రాయొచ్చేమో..? మొత్తానికి వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ కాల‌క్షేపం కోసం చూడొచ్చు. ఎక్కడా బోర్ కొట్టదు. హాయిగా న‌వ్వుకొన్ని, కాస్త థ్రిల్ ఫీలైపోయి, బ‌య‌ట‌కు రావ‌చ్చు. ఆ గ్యారెంటీ మాది!!

తెలుగు మిర్చి రేటింగ్స్ 3.25/5                                               -స్వాతి

 

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.