రివ్యూ : విక్ర‌మ‌సింహా

vikrmasimha-telugu-movie-ra

                                 |Click here for English Review|
125 కోట్ల కార్టూన్ సినిమా ‘విక్ర‌మ‌సింహా‘   తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5

ర‌జ‌నీకాంత్ అంటే మాస్ సినిమాల‌కు దేవుడు. ఈ సూప‌ర్‌ స్టార్ క‌టౌట్ నిల‌బెడితే చాలు… కోట్లు ప‌డ‌తాయి. కొంచెం క‌థ‌తో కావ‌ల్సినంత స్టైల్ మిక్స్ చేసి… సూప‌ర్ హిట్లు కొట్టేస్తారు ద‌ర్శ‌కులు. నిర్మాత‌ల‌కు కోట్లు మిగిలిపోతాయి. అలాంటి సూప‌ర్‌ స్టార్ సినిమాకి రూ.125 కోట్ల బ‌డ్జెట్ పెట్టి, మోష‌న్ క్యాప్చ‌ర్ అనే కొత్త టెక్నాల‌జీని ఇండియాలో ఈసినిమాతో ప్ర‌వేశ‌పెట్టి, ఈ సినిమాకి ర‌జ‌నీ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింద‌ని తెలిస్తే.. సినిమాపై ఎన్ని ఆశ‌లు, ఇంకెన్ని అంచ‌నాలూ ఉంటాయి..?? అందుకే విక్ర‌మ సింహాపై ర‌జ‌నీ ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, యావ‌త్ ప్రేక్ష‌కులు భారీగా ఆశ‌లు పెంచుకొన్నారు. మ‌రి విక్ర‌మ‌సింహుడు అంచ‌నాల‌ను జయించాడా? లేదా? అస‌లు ఈ కొత్త టెక్నాల‌జీ ఎలా ఉంది? అందులో ర‌జ‌నీకాంత్ ఎలా ఇమిడిపోయాడు? తెలుసుకొందాం. రండి.

అన‌గ‌న‌గా రెండు రాజ్యాలు కళింగపట్నం-కొట‌పట్నం. కోట‌ ప‌ట్నానికి రాజా మహేంద్ర (జాకీ షరాఫ్) అధిప‌తి. ఈ రాజ్యం బ‌లం… స‌ర్వ‌సైన్యాధ్య‌క్షుడు రానా (ర‌జ‌నీకాంత్‌). అత‌ని ధైర్య సాహ‌సాలే… కోట‌ప‌ట్నానికి శ్రీ‌రామ‌ర‌క్ష‌. క‌ళింగపట్నానికి ఉగ్రసింహ (నాజర్) ప్ర‌భువు. ఎప్పుడూ కొత్త‌ప‌ట్నాన్ని దెబ్బ‌తీయాల‌ని చూస్తుంటాడు. దాంతో ఒక రాజ్యంపై మ‌రో రాజ్యం క‌య్యానికి కాలు దువ్వుతుంటుంది.

ఒక దశలో రెండు రాజ్యాలు యుద్దానికి దిగుతాయి. అయితే ఇక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది. కోట పట్నానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన రానా… ఉగ్రసింహతో చేతులు కలుపుతాడు. దాంతో మ‌హేద్ర‌ రానాను రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. క‌ళిగ‌ప‌ట్నానికి క‌ళింగ ప‌ట్నానికి సైన్యాధ్య‌క్షుడిగా ప‌ద‌వి అందుకొంటాడు. ఆ రాజ్యంలో ఉంటూనే ఉగ్ర సింహాను చంపాల‌నుకొంటాడు. రానా ఇదంతా ఎందుకు చేస్తున్న‌ట్టు…?? అస‌లు త‌న శ‌త్రువుతో చేయి క‌ల‌ప‌డానికి కార‌ణం ఏమిటి?? అస‌లు విక్ర‌మ‌సింహా క‌థేమిటి? అనేదే… చిత్ర క‌థ‌.

నిజానికి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కావ‌ల్సిన అన్ని హంగులూ ఈసినిమాలో ఉన్నాయి. ఎటొచ్చీ.. మోష‌న్ క్యాప్చ‌ర్ విధానంలో తీయాల‌నుకొన్నారు. ముందుగా ఆయా న‌టీన‌టుల‌తో స‌న్నివేశాలు తెర‌కెక్కించి.. దాన్ని మోష‌న్ క్యాప్చ‌ర్ విధానంలోకి మారుస్తారు. ఈ విధానం తెలియ‌ని ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఇదో బొమ్మ‌ల సినిమాలా ఉంటుంది. టీవీలో కార్టూన్ షోలు చూసే పిల్ల‌లు ఇది మ‌రో కార్టూన్ సినిమా అనుకొనే ప్ర‌మాదం ఉంది. అయితే కొత్త టెక్నాల‌జీ ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా న‌చ్చుతుంది. సినిమా ప్రారంభ స‌న్నివేశాలు, ముఖ్యంగా ర‌జ‌నీ కాంత్ ఎంట్రీ.. ఓ స్థాయిలో ఉంటాయి. అయితే క‌థ న‌డుస్తున్న కొద్దీ…. నిదానంగా సాగుతుంటుంది. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ వ‌చ్చే వ‌ర‌కూ ఇదే వ‌రుస‌. సెకండాఫ్‌ లో మాత్రం.. విక్ర‌మసింహా పాత్ర ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ ఊపందుకొంటుంది. పాట‌లు, భీక‌ర పోరాటాలూ, యుద్ధ స‌న్నివేశాలు, ర‌జ‌నీ మార్క్ పంచ్‌ లూ అన్నీ ఉంటాయి. కానీ ఏదో లోపం. నిజం సినిమా చూడ‌లేక‌పోతున్నామ‌న్న భావ‌న‌. దాంతో… ఆ అసంతృప్తి ప్ర‌తీ స‌న్నివేశంలోనూ ప్రేక్ష‌కుల మొహంలో క‌నిపిస్తూనే ఉంటుంది.

ఇదే క‌థ‌ని ఫ‌క్తు సినిమాగా తీయొచ్చు. బ‌డ్జెట్ భారీగా పెట్టారు కాబ‌ట్టి, మ‌గ‌ధీర రేంజు సినిమా అవుదును. కానీ…. ఎప్పుడైతే యానిమేష‌న్ సినిమా అన్న ముద్ర ప‌డిందో… సినిమాలో లీనం కాలేం. మ‌న ముందు ర‌జ‌నీ పంచ్‌ లు చెబుతూ పోయినా.. కిక్ ఉండ‌దు. పోనీ మోష‌న్ టెక్నాల‌జీ వైపు నుంచే ఆలోచిద్దాం. పాత్ర‌ల మ‌ధ్య ఐ కోర్డ‌నేష‌న్ అస్స‌లు కుద‌ర్లేదు. అవ‌తార్ సినిమా కూడా ఇలాంటి టెక్నాల‌జీతో తీసిందే. మ‌రి అది చూస్తూ ప్రేక్ష‌కుడు డీప్ గా ఇన్‌ వాల్వ్ అయిపోయాడు. కానీ ఇక్క‌డ ఆ ఛాన్స్ లేదు. క‌థ‌ని ముందు నుంచీ ప‌రిగెట్టుస్తూ ఉంటే ఈ లోటు కూడా మ‌ర్చిపోదురు. కానీ… క‌థ‌నం చాలా స్లోగా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌కు రుచించ‌దు.

న‌టీన‌టులు ఎవ‌రు బాగా చేశారంటే ఏం చెప్పుకోవాలి?? అంతా గ్రాఫిక్స్ మహిమ‌. కాబ‌ట్టి డ‌బ్బింగ్ క‌ళాకారుల ప‌నితీరు గురించి మాట్లాడుకోవాలి. ర‌జ‌నీకి గొంతిచ్చే మ‌నో.. మ‌రోసారి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. మిగిలిన వారి లిప్ సింక్ లు అస్స‌లు కుద‌ర్లేదు. దాంతో…. ప‌రాయి సినిమా చూస్తున్నామ‌న్న భావ‌న మ‌రింత పెరుగుతుంది. పాట‌లు ఈ సినిమాకి పెద్ద మైన‌స్‌. అర్థం ప‌ర్థం లేకుండా వ‌చ్చిప‌డిపోతుంటాయి. రెహ‌మాన్ త‌న నేప‌థ్య సంగీతంతో సినిమాని నిల‌బెట్ట‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేశాడు. టెక్నిక‌ల్ విభాగం చాలా చాలా క‌ష్ట‌ప‌డి ఉంటుంది. నిద్రాహారాలు మాని రెండేళ్ల పాటు క‌ష్ట‌ప‌డి ఉంటుంది. తెర‌పై అది క‌నిపిస్తూనే ఉంటుంది. కానీ…. టెక్నిక‌ల్ అంశాల కంటే సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ విష‌యాలే కావాలి అనుకొనే ప్రేక్ష‌కుల‌కు, మ‌రీ ముఖ్యంగా ర‌జ‌నీ వీర ఫ్యాన్స్ కీ ఈ సినిమా పెద్ద‌గా రుచించ‌క‌పోవ‌చ్చు.

ద‌ర్శ‌కురాలు సౌంద‌ర్య చాలా సాహ‌సోపేత‌మైన అడుగు వేసింది. నాన్న‌తో మామూలుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమా లాగించేయొచ్చు. కానీ..ఆ దారిలో వెళ్ల‌లేదు. ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతి ఇద్దామ‌నుకొంది. అవ‌తార్ స్ఫూర్తితో తాను ఓ ప్ర‌య‌త్నం చేసింది. ఆ ప్ర‌య‌త్నాన్ని మ‌న‌సారా అభినందించాల్సిందే. ర‌జ‌నీ కోసం, అత‌ని పంచ్ డైలాగుల‌కోసం అయితే మాత్రం ఈ సినిమాకి వెళ్ల‌క్క‌ర్లేదు. కొత్త టెక్నాల‌జీ ఓ సారి చూసొద్దాం అనుకొంటే మాత్రం.. నిర‌భ్యంత‌రంగా చూడొచ్చు

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3/5                                              – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు

|Click here for English Review|